పల్నాటి యుద్ధము
వికీపీడియా నుండి
అయోమయ నివృత్తి పేజీ పల్నాటి యుద్ధం చూడండి.
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
పల్నాటి యుద్ధము ఆంధ్ర దేశములోని పల్నాడు ప్రాంతములో 1182 వ సంవత్సరములో జరిగినది. మహాభారతమునకు, పల్నాటి వీరుల చరిత్రకు దగ్గరి పోలికలు ఉండటము చేత దీనిని ఆంధ్ర భారతము అనికూడా అంటారు. పల్నాటి యుద్ధం 12వ శతాబ్దపు ఆంధ్రదేశంలో రాజకీయ, సాంఘీక మతమార్పులకు దోహదం చేసిన కీలక యుద్ధం. ఈ యుద్ధం తీరాంధ్రలోని రాజవంశాలన్నింటిని బలహీనపరచి కాకతీయ సామ్రాజ్య విస్తరణకు మార్గం సుగమం చేసింది.
విషయ సూచిక |
[మార్చు] చారిత్రకత
పల్నాటి యుద్ధం ఆంధ్రదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన యుద్ధం అయినప్పటికీ సమకాలీన శాసనాలలోగానీ, ఆ తరువాత శాసనాలలోగానీ ఈ యుద్ధం యొక్క ప్రస్తావన ఎక్కడాలేదు. శాసనాలలో పేర్కొనక పోయినా ఈ యుద్ధం జరగలేదని భావించుటకు వీలులేదు. క్రీడాభిరామంలో పలనాటి యుద్ధ గాథలు పేర్కొనటమేగాక ఓరుగల్లు నగరములో వీరచరిత్రను గానం చేయటం, అక్కడి యువకులు ప్రేరణ పొందటం , ఓరుగల్లు ఇళ్లలో పలనాటి యుద్ధ చిత్రాలు చిత్రించబడి ఉండటాన్ని వర్ణిస్తుంది. ఈ క్రీడాభిరామానికి మూల సంస్కృత గంథమైన ప్రేమాభిరామాన్ని రావిపాటి త్రిపురాంతకకవి పలనాటి యుద్ధం జరిగిన తరువాత 50-60 సంవత్సరాలకు వ్రాశాడు. పలనాటి యుద్ధంలో ఓడిపోయిన బ్రహ్మనాయుని అనుయాయులు ఓరుగల్లు చేరి కాకతీయుల కొలువులో చేరారు. కనుక ఓరుగల్లులో పలనాటి వీరగాథ బాగా ప్రచారములోకి వచ్చినది. ఇదే విషయము ప్రేమాభిరామంలో కూడా పేర్కొనబడినది. కారంపూడిలో యుద్ధం జరిగిన స్థలం గుర్తించబడినది. యుద్ధంలో మరణించిన వీరులకు గుడి కట్టి ఉన్నది. పలనాటిలో ఆ వీరులకు పేరు పేరునా ప్రతి సంవతరం పూజలు జరుగుచున్నవి. కనుక పలనాటి యుద్ధం యదార్ధ చారిత్రక సంఘటనే అని చెప్పవచ్చు.
[మార్చు] సాహిత్యములో పల్నాటి యుద్ధము
పల్నాటి వీరుల చరిత్రను తొలిసారి శ్రీనాథుడు మూడు వందల సంవత్సరాల తర్వాత మంజరీ ద్విపద కావ్యముగా రచించాడు. ఇది ఆయన చివరి రచన. శ్రీనాథుని తర్వాత కొండయ్య, మల్లయ్య (16వ శతాబ్దము) అను కవులు రచించారు. ఆ తర్వాత 1862 ప్రాంతములో ముదిగొండ వీరభద్రకవి ఈ కథను వీర భాగవతము అను పేరుతో మనోహరమైన పద్యకావ్యముగా రచించాడు.
పల్నాటి వీరచరిత్రలో బాలచంద్రుని యుద్ధ ఘట్టము మాత్రమే శ్రీనాథుడు రచించాడని పరిశోధకుల అభిప్రాయము. మిగిలిన కథా భాగాలు కొండయ్య,మల్లయ్య రచించినవి. శ్రీనాథుడు పూర్తి గ్రంథము రచించిఉంటే అది కాలగర్భములో కలిసిపోయిందేమో తెలియదు. అక్కిరాజు ఉమాకాంతం మొట్టమొదట పల్నాటి వీరచరిత్ర యొక్క ప్రతులు సంపాదించి, సంస్కరించి 1911 లో అచ్చువేయించాడు. కొండయ్య, మల్లయ్య రచనలను కూడా చేర్చి సంపూర్ణ గ్రంథాన్ని సంస్కరించి 1961 లో ఆచార్య పింగళి లక్ష్మీకాంతం ప్రచురించాడు.
[మార్చు] మూలములు
- సమగ్ర ఆంధ్రదేశ చరిత్ర - సంస్కృతి రెండవ భాగం రచన: ముప్పాళ్ళ హనుమంతరావు
- పల్నాటి వీరచరిత్ర - రెంటాల గోపాలకృష్ణ (1971)