పి.లీల
వికీపీడియా నుండి
పొరయత్తు లీల ప్రముఖ దక్షిణభారత నేపథ్యగాయని. మళయాళ చిత్ర రంగములో ప్రప్రధమ నేపథ్యగాయని. ఈమె తమిళ, మళయాళ, తెలుగు భాషల్లో ఆమె 15వేలకుపైగా పాటలు పాడింది. తెలుగులో లవకుశ, మాయాబజారు, పాండవవనవాసం, రాజమకుటం, గుండమ్మకథ, చిరంజీవులు తదితర సినిమాల్లో ఆమె పాడిన ఎన్నో పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి.
లీల 1934లో కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన చిత్తూర్ లో సంగీతాసక్తి ఉన్న కుటుంబములో జన్మించింది. ఈమె సినిమాలలో రాకమునుపే శాస్త్రీయ సంగీతములో శిక్షణ పొందినది. ఈమె తన పదమూడో యేట 1947లో విడుదలైన తమిళ చిత్రము కంకణం తో సినీరంగప్రవేశం చేసినది. ఈమె పాడిన మొదటి పాట హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి స్వరపరిచిన శ్రీ వరలక్ష్మీ..అంటూ మొదలయ్యే స్త్రోత్రం. ఈ తరువాత తెలుగు, కన్నడ చిత్రాలలో అనేక పాటలు పాడింది. 1948లో విడుదలైన నిర్మల చిత్రముతో లీలకు తొలిసారి తన మాతృభాషైన మళయాళంలో పాడే అవకాశం వచ్చింది. తెలుగులో ఈమె తొలి చిత్రం 1949లో విడుదలైన మనదేశం.
తన సినీ జీవితములో అనేక అవార్డులు అందుకొన్న లీలకు 1969లో కేరళ ప్రభుత్వ ఉత్తమ నేపథ్యగాయకురాలు అవార్డు అందుకొన్నది. లీల అక్టోబర్ 31 2005 న చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రిలో అస్వస్థతతో చికిత్స పొందుతూ మరణించింది.