ఎం.ఎస్.సుబ్బలక్ష్మి
వికీపీడియా నుండి
అభిమానులు ప్రేమగా ఎం.ఎస్ అని పిలిచుకొనే మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి
ఆమె పాడకపోతే దేవుళ్ళక్కూడా తెల్లవారదు!?
ఆమె పాట వినబడకపోతే దేశమే తానైన ఏ పల్లే లేవదు !?
తన సుప్రభాత గీతంతో భగవంతుణ్ణి నిదురలేపే ఆ సంగీత ఆధ్యాత్మిక స్వరం ఆమెకు ఒకవరం.
" కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్థ నరశార్దూల కర్తవ్యం దైవ మాహ్నికరమ్ .....
.....అంటూ సాగే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం తెలుగువాడి గుండెల్లో భక్తిభావాల్ని కలిగిస్తుంది. ఆమె పాటలు వింటుంటే మనసు ప్రశాంతంగా,హాయిగా వుంటుంది.
విషయ సూచిక |
[మార్చు] బాల్యము
తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య అయ్యర్ , ప్రముఖ వీణావాద్య విద్యాంసురాలు షణ్ముఖవడివు అమ్మల్ కు 1916 సెప్టెంబర్ 16 న జన్మించింది తల్లి ఆమె ఆది గురువు. పదేళ్ళప్రాయం నుంచే సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. అయితే ఆమెలో భక్తితత్వానికి బీజం వేసింది మాత్రం ఆమె తండ్రి అయ్యర్. సుబ్బలక్ష్మి శుద్ధ సంప్రదాయ కుటుంబంలో జన్మించింది కనుక తన జీవితకాలమంతా ఆమె భారతీయ సంప్రదాయాన్ని, సంస్కారాన్ని అమితంగా ప్రేమించింది. బాల్యంలో పాఠశాలలో అకారణంగా టీచరు కొట్టడంతో చిన్నతనంలోనే బడికి వెళ్ళడం మానేసిన సుబ్బలక్ష్మి తన అక్క, అన్నదమ్ములతో కలసి సంగీత సాధన చేసి,సెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యర్ వద్ద సంగీతంలో శిక్షణ పొంది తన ప్రతిభకు స్పష్టమైన రూపునిచ్చి,తదనంతర కాలంలో జాతి గర్వించతగ్గ అంతర్జాతీయ సంగీత సామ్రాజ్ఙిగా ఎదిగింది. 1926 లో 10 సంవత్సరాల వయసులో గుడిలో పాటలు పాడడంతో తన తొలి సంగీత ప్రదర్శన మొదలైంది. నాటినుండి సంగీత ప్రియులను తన మధుర స్వరంతో సంగీతంలో ఓలలాడిస్తూనే ఉంది.అప్పుడే తను మొట్టమొదటిసారిగా హెచ్.ఎం.వి. కోసం 'ఆల్బమ్ ' అందించింది.
[మార్చు] జీవితం
సుబ్బలక్ష్మిలోని ప్రతిభను గుర్తించిన తల్లి మధురై నుంచి చెన్నైకి మకాం మార్చటంతో ఆమె జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. ఆమె 1933 లో మదరాసు సంగీత అకాడెమీలో తన మొట్ట మొదటి సంగీత కచేరీకి శ్రీకారం చుట్టింది. సంగీతపరంగా సుబ్బలక్ష్మి జీవితంలో ఇది ఒక మలుపైతే తన గురువు, మార్గదర్శి, ఆనంద వికటన్ పత్రిక సీనియర్ ఎగ్జిక్యూటివ్ , స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది అయిన త్యాగరాజన్ సదాశివన్ తో 1940 లో ఆమె ప్రేమవివాహం మరో ముఖ్యమైన మలుపు. 1938 సంవత్సరంలో సేవాసదనం సినిమా ద్వారా సుబ్బలక్ష్మి సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టింది. సదాశివన్ సినీ నిర్మాత కూడ కావడంతో సుబ్బలక్ష్మి సినీ సంగీత జీవితానికి ఎటువంటి అడ్డంకులు ఎదురు కాలేదు. తమిళ సినిమాలలో గాయనిగా తెరపై కూడా కనిపించి ప్రేక్షకులను అలరించింది. 1940 వ సంవత్సరంలో శకుంతలై అన్న తమిళ సినిమాలో ఆమె తొలిసారిగా గాయక నటిగా తెరపై కనిపించింది. 1945 వ సంవత్సరంలో నిర్మించబడిన 'మీరా' చిత్రం హిందీలో పునర్నిర్మించబడి కూడా విజయవంతం కావడంతో సుబ్బలక్ష్మి పేరు భారతదేశమంతటికీ సుపరిచితమయింది. 'మీరా' సినిమాలోని ఆమె నటనకు, గాన మాధుర్యానికి జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి. అది ఆమె ఆఖరి సినిమా. భక్తిగాయనిగా సుబ్బలక్ష్మి పేరు ప్రఖ్యాతులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంలో సదాశివన్ కృషి ఎంతో వుంది.
[మార్చు] ఆమె గాత్రం, సోత్రం, గానం, గీతం
సుబ్బలక్ష్మి పాడుతుంటే స్వయంగా అమ్మవారే పాడుతున్నట్లు భావించేవారు. నిండైన విగ్రహం, భారతీయతకు ప్రతీకగా ఒంటినిండా పట్టుచీర, నుదుటి మీద ఎర్రటి కుంకుమబొట్టు, చేతుల నిండా గాజులు, కళ్లకు నిండుగా కాటుక, కొప్పు, కొప్పు నిండా మల్లెపూలు, చేతిలో తంబూర పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు. కర్నాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. గానం ధ్యానంలా సాగేది. పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలును, శాస్త్రీయ, లలిత గీతాలను, భజన్స్, జానపద గేయాలు, మరాఠీలో అభ్యాంగ్స్, దేశభక్తి గేయాలు కూడా పాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బలక్ష్మి ప్రత్యేకత. శృతి, లయ , ఆలపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళ్ళలో వ్యక్తీకరించడంతోపాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యం! ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడిన సంస్కృత భాషలోని భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బలక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు. మహత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన ' వైష్ణవ జనతో....' జె పీర్ పరాయీ జానేరే......' వంటి గీతాలకు ప్రాణం పోసిన వ్యక్తి ఆమె. ఇక్యరాజ్యసమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బలక్ష్మి. ఆ సందర్భంలో 'న్యూయార్క్ టైంస్' సుబ్బలక్ష్మిని ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా పేర్కొన్నాయి. రాయల్ ఆల్బర్ట్ హాల్, లండన్ లో ప్రదర్శన యిచ్చినపుడు ఇంగ్లండ్ రాణిని కూడా తన్మయురాలిని చేసి, ప్రశంసించేలా చేసింది.
[మార్చు] పురస్కారాలు, సన్మానాలు
తన జీవితకాలంలో సంగీత ప్రపంచంలో బహుశా ఎవరూ సాధించని, చేధించని రికార్డులు, రివార్డులు ఆమె అందుకుంది. ఆమె ఎక్కని 'శిఖరం లేదు, పొందని బహుమానం లేదు. పద్మభూషణ్ (1954) సంగీతకళానిధి (1969) పద్మవిభూషణ్ (1975) రామన్ మెగసెసె అవార్డు (1974) ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా అవార్డు(1990) వంటి పలు బహుమతులు సుబ్బలక్ష్మి గాత్రానికి దాసోహమంటూ ఆమె ముందు వాలాయి. భారతరత్న (1988) పొందిన తొలి సంగీత కళాకారిణిగా సుబ్బలక్షి చరిత్ర సృష్టించారు.
ఇంటింటా పవిత్ర సుమసుగంధాలను వెదజల్లిన ' సుప్రభాత ' గీతమై ప్రతి ఇంటా ఆధ్యాత్మిక భావనలను విరజిమ్మిన విష్ణు సహస్రనామ నిత్యస్తోత్రమై ఈ ధరణీతలాన్ని కొన్ని దశాబ్దాల పాటు పులకింపచేసిన కర్నాటక శాస్త్రీయ సంగీత స్వరధార 2004, డిసెంబర్ 11న ఆగిపోయింది.