కట్టమంచి రామలింగారెడ్డి
వికీపీడియా నుండి
డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి ఎనలేని ప్రతిభావంతుడు. ఆయన మేధావి మాత్రమే కాదు, పండితుడు. వక్త మాత్రమే కాదు రచయిత, ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు. ఇంతటి ప్రతిభా పాటవాలు ఒక వ్యక్తిలో కానరావడం నిజంగా అరుదే. కట్టమంచి రామలింగారెడ్డి (సీఆర్‌రెడ్డి) విద్య, సాహిత్య, రాజకీయ రంగాలలో త్రివిక్రమమూర్తి.
విషయ సూచిక |
[మార్చు] బాల్యం
రామలింగారెడ్డి గారు పుట్టింది చిత్తూరు పట్టణం కట్టమంచిలోనే. ఆంధ్ర మహాపురుషుల్లో అగ్రశ్రేణికి చెందిన ఈ కవి కోవిదుడు 1880 డిసెంబరు 10న జన్మించాడు. సుబ్రమణ్యంరెడ్డి, నారాయణమ్మ దంపతులకు మూడో సంతానంగా సీఆర్‌రెడ్డి జన్మించారు. సుబ్రమణ్యంరెడ్డి సోదరుడు పెద్దరామస్వామిరెడ్డి రామలింగారెడ్డిని దత్త పుత్రుడుగా స్వీకరించారు.
[మార్చు] చదువు
సీఆర్‌రెడ్డి అయిదో ఏట అక్షరభ్యాసం ప్రారంభించారు. వీధి బడిలో చదువు. చిన్న వయస్సులోనే భారతాన్ని, అమర బాల రామాయణాన్ని చదివేవారు. 1890లో ప్రస్తుత పీసీఆర్ పేరుతో ఉన్న చిత్తూరు బోర్డు హైస్కూల్‌లో మొదటిఫారంలో చేరారు. పరీక్షల్లో ఉన్నత శ్రేణి సాధించేవారు. మదరాసు క్రైస్తవ కళాశాలలో ఉన్నతాభ్యాసం. 1899లో నవ్య కావ్యరచన పోటీలో ముసలమ్మ మరణం లఘు కావ్యాన్ని రచించి బహుమతి పొందారు. సాహిత్యరంగంలో సరికొత్త భావాలకు, నూతన ఆలోచన రీతులకు మనోవికాసాత్మకమైన విమర్శలకు కట్టమంచి దోహదపడ్డారు. ఒకవైపు తెలుగు కవితను మరో వైపు కవితా విమర్శను నూతన శోభతో కొత్తకాంతులతో ఆవిష్కరించిన సాహితీమూర్తి. సంభాషణలతో దెబ్బకు దెబ్బ తీయగల నేర్పు, వాదనాచాతుర్యం ఆయన శైలి. హాస్య ప్రియత్వం, ఛలోక్తులు, చమత్కార సంభాషణ నైపుణ్యం వంటి లక్షణాలతో అందరినీ ఆకట్టుకునేవారు. 1902లో బీఏ పరీక్షలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకాలను పొందారు.
[మార్చు] పురస్కారాలు
భారత ప్రభుత్వపు విద్యార్థి వేతనంతో కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయంలో, సెయింట్స్ జాన్స్ కళాశాలలో ప్రవేశించి పలు పురస్కారాలు అందుకున్నారు. 1903లో ఆయన తెలివి తేటలకు, సామర్థ్యానికి గుర్తింపుగా రైట్ బహుమతి లభించింది. 1904లో విద్వాంసుడు పురస్కారం అందుకున్నారు. 1905లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో యూనియన్ లిబరల్ క్లబ్ కార్యదర్శిగా ఎన్నికై ఉపన్యాసాలు ఇచ్చి ఆంగ్లేయుల ప్రశంసలు అందుకొన్నారు. భారతీయుడుగా ఇలాంటి అసాధారణ గౌరవం దక్కడం అదే ప్రథమం. 1906లో ఎంఏ పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. బరోడా సంస్థానాదీశుడు గాయ్‌క్వాడ్ సయోజీరావు సీఆర్‌రెడ్డి ప్రతిభను గుర్తించి అమెరికా పంపారు. 1908న స్వదేశానికి వచ్చాక బరోడా కళాశాలలో ఆచార్యునిగా చేరారు. ఆ తర్వాత మైసూరు మహారాజ కళాశాలలో ఆచార్య పదవి స్వీకరించారు. మైసూరు ప్రభుత్వం విద్యాశాఖాధికారిగా నియమించింది.
[మార్చు] రాజకీయ జీవితం
1921లో తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. జస్టిస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1923లో చిత్తూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జిల్లా బోర్డు అధ్యక్షునిగా పని చేశారు. ఇలా తన ప్రస్థానం కొనసాగింది.
[మార్చు] సీఆర్‌రెడ్డి విగ్రహాలు
సీఆర్‌రెడ్డి 1951 ఫిబ్రవరి 24న అనారోగ్యంతో మద్రాసులో మరణించారు. తమిళనాడుతోపాటు రాష్ట్రంలో పలుచోట్ల విగ్రహాలున్నాయి. ఆయన జన్మించిన పట్టణంలో మాత్రం విగ్రహం ఏర్పాటు చేయలేకపోయారు. ఈ లోటును ప్రముఖ డాక్టరు, సీఆర్‌రెడ్డి మెమోరియల్ ట్రస్టు అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, కార్యదర్శి కేశవరెడ్డి తీర్చడానికి సన్నాహాలు పూర్తి చేశారు. కలెక్టరు బంగ్లా ఎదురుగా సర్కిల్‌లో విగ్రహాన్ని నెలకొల్పారు.
[మార్చు] పదవులు
1926లో డాక్టర్ సీఆర్‌రెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలి ఉపాధ్యాక్షునిగా నియమితులయ్యారు. ప్రభుత్వ దమన నీతికి నిరసనగా 1930లో రాజీనామా చేశారు. 1936లో ప్రభుత్వం మళ్లీ ఆయనకు ఆ పదవిని అప్పగించింది.