చారు మజుందార్
వికీపీడియా నుండి
సి.ఎం. గా సుప్రసిద్ధుడైన చారు మజుందార్ నక్సల్బరీ ఉద్యమ రూపశిల్పి. CPI(ML) పార్టీకి సంస్థాపక ప్రధాన కార్యదర్శి. ఆయన ప్రేరణ వల్ల ఎంతో మంది యువకులు విప్లవోద్యమంలకి దుంకింరు. కార్మికులతో, కర్షకులతో అనుసంధానమై వాళ్ళ పోరాటాలల్ల పాల్గొన్నవారే చివరిదాకా విప్లవకారులుగా నిలబడగలుగుతారని ఆయన యువతకి చెప్పిండు. ఆయన మరణించిన జూలై 28 వ తారీకును భారతదేశంలోని యావత్ మార్క్సిస్టు-లెనినిస్టు ఉద్యమం అమరవీరుల దినంగా పాటిస్తుంది.
విషయ సూచిక |
[మార్చు] బాల్యం
చారు మజుందార్ 1918 ల సిలిగురిలోని ఒక జమీందారు కుటుంబంల జన్మించిండు. విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన పెట్టి-బూర్జువా జాతీయ విప్లవకారులచే ప్రభావితుడై అనుశీలన్ గ్రూపుకి అనుబంధ సంస్థ అయిన బెంగాల్ విద్యార్థి సంఘంల (All Bengal Students Association) సభ్యునిగా చేరిండు. న్యాయవాది అయిన ఆయన తండ్రి కాంగ్రెస్‌ల చురుకైన స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన తల్లి ఆమె కాలానికి ప్రగతిశీల భావాలు కలది. 1937-38 ల ఆయన కళాశాల విద్యను వదిలిపెట్టి, కాంగ్రెస్ కార్యకర్తగా బీడీ కార్మికులను, ఇతరులను సంఘటిత పరిచిండు.
[మార్చు] CPI ల
కొన్ని సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ని వదిలిపెట్టి CPIల చేరి రైతు సంఘంల పని చేసిండు. మొదట జల్‌పైగురి రైతులతో పని చేసి వారిల సర్వసమ్మతమైన నాయకునిగా పేరు తెచ్చుకున్నడు. ప్రభుత్వం ఆయన మీద అరెస్టు వారెంటు జారీ చేయగా ఆయన అజ్ఞాతంలకి వెళ్ళిండు. రెండవ ప్రపంచ యుద్ధం మొదలవ్వంగనే CPI పార్టీ నిషేధించబడింది. రైతులతో రహస్య కార్యకలాపాలు నిర్వహించి, 1942 ల CPI జల్‌పైగురి జిల్లా కార్యవర్గంల సభ్యుడయ్యిండు. 1943 ల పెద్ద కరువు వచ్చినపుడు, జల్‌పైగురిల పంటలను స్వాధీనపర్చుకోడానికి అందరినీ సంఘటితపరిచిండు. 1946ల 'తెభాగ ' ఉద్యమంల పాల్గొని, ఉత్తర బెంగాల్ రైతు పోరాటాలను నిర్వహించిండు. ఈ ఉద్యమం ఆయనపై ప్రగాఢ ప్రభావం చూపి, సాయుధ రైతాంగ విప్లవోద్యమంపై ఆయన ఆలోచనలకు స్పష్టతనేర్పరచింది. తర్వాత ఆయన డార్జిలింగ్ జిల్లాల తేయాకు కార్మికులతో పని చేసిండు.
1984ల CPI నిషేధించబడగా ఆయన తర్వాతి మూడు సంవత్సరాలు జైలుల గడిపిండు. 1954 జనవరిల జల్‌పైగురికి చెందిన CPI సభ్యురాలు లీల మజుందార్ సేన్‌గుప్తను ఆయన వివాహమాడిండు. ఆయన కార్యకలాపాలకు కేంద్రమైన సిలిగురికి వాళ్ళు వెళ్ళింరు. పూర్వీకుల ఆస్తి పోగొట్టుకొని అనారోగ్యంతో ఉన్న ఆయన తండ్రి, అవివాహిత అయిన ఆయన చెల్లెలు ఆర్థిక ఇబ్బందుల మధ్య అక్కడే జీవించింరు. రైతాంగ పోరాటం తగ్గుముఖం పట్టడంతో తేయాకు కార్మికులు, రిక్షా కార్మికులను సంఘటితపర్చడానికి ఆయన కృషి చేసిండు. 1956ల పాల్‌ఘాట్ కాంగ్రెస్ తర్వాత, పార్టీతో ఆయనకున్న అభిప్రాయ భేదాలు పెరిగినయి. ఆయనకున్న ఇబ్బందికర పరిస్థితులకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు తోడైనయి. కాని అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంల జరుగుతున్న పెద్ద చర్చ (The Great Debate) ఆయనకు ఉత్తేజాన్ని ఇచ్చింది. ఇండో-చైనా యుద్ధం సందర్భంగా ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళిండు.
[మార్చు] CPI(M) ల
CPI పార్టీ చీలికతో CPI(M)ల చేరినా, ముఖ్యమైన సైద్ధాంతిక ప్రశ్నలపై నాయకత్వం తప్పించుకుంటునట్టు ఆయన భావించిండు. 1964-65 ల ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు కమ్యూనిజం మరియు మావో ఆలోచన గురించి అధ్యయనం చేయడానికి, రాయడానికి సమయాన్ని వినియోగించిండు. 1965-67 వరకు ఆయన రచనలల్ల, ఉపన్యాసాలల్ల నమోదు చేయబడిన ఆయన భావాలు ఈ సమయంలనే ఏర్పడ్డయి. అవే తర్వాత చారిత్రక ఎనిమిది పత్రాలు(Historic Eight Documents)గా పిలువబడి నక్సల్బరి ఉద్యమానికి రాజకీయ-సైద్ధాంతిక మూలం అయినయి.1967ల నక్సల్బరీ ఉద్యమం మొదలైన తర్వాత పోలీసులకి పట్టుబడకుండా చారు మజుందార్ అజ్ఞాతంలకి పోయిండు. కొన్ని వారాల తర్వాత ఆయన ఇట్లా రాసిండు, "వందలాది నక్సల్బరీలు భారతదేశంల నిప్పు రాజుకుంటున్నయి...నక్సల్బరీ చావలేదు,నక్సల్బరీకి చావు లేదు."
[మార్చు] CPI(ML) ఏర్పాటు
మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనను వ్యాపింపజేస్తూ, దీని మూలంగా అన్ని కమ్యూనిస్టు విప్లవకారులను ఏకం చేస్తూ, నక్సల్బరీ తరహా రైతాంగ విప్లవ పోరాటాలను వృద్ధి చేసే లక్ష్యంతో ఏప్రిల్ 1969ల CPI(ML) ఏర్పడింది. మే 1970, CPI(ML) కాంగ్రెస్ సమావేశంల ఏర్పడిన కేంద్రకమిటీకి ఆయన ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డడు. తర్వాత కాలంల ఇద్దరు కేంద్రకమిటీ సభ్యులు మాయం చేయబడినా, చాలా మంది ముఖ్య నాయకులు చంపబడినా, అనారోగ్యంతో ఉన్న ఆయన పోలీసులనుండి తప్పించుకోగలిగిండు.
[మార్చు] పోలీసు నిర్బంధంల మరణం
జూలై 16, 1972న, కొరియర్‌ని చిత్రహింసలు చేయగా తెలిసిన సమాచారంతో ఆయన కలకత్తాలోని ఒక స్థావరంల పట్టుబడ్డడు. పట్టుబడిన సమయంల ఆయన గుండెజబ్బు వలన తీవ్ర అనారోగ్యంతో బాధపదుతున్నడు. పోలీసు నిర్బంధంల ఆయన ఉన్న పది రోజులు ఆయనను చూడడానికి ఆయన న్యాయవాదిని కాని, కుటుంబ సభ్యులని కాని, వైద్యున్ని కాని పోలీసులు అనుమతించలేదు. 1972 జూలై 28 తెల్లవారుఝామున 4 గంటలకు, చారు మజుందార్ లాల్‌బజార్ పోలీస్ నిర్బంధంల మరణించిండు. ఆయన శవాన్ని కూడా ప్రభుత్వం కుటుంబానికి అందజేయలేదు. పోలీసులు కుటుంబ సభ్యులతో శవాన్ని ఒక దహనవాటికకు తీసుకపోయి, సమీప బంధువులను కూడా రానివ్వకుండా కట్టుదిట్టం చేసి ఆయన శవాన్ని దహనం చేసింరు. ఆయన మరణంతో భారత దేశంల విప్లవోద్యమ మొదటి ఘట్టం ముగిసింది.