జమున
వికీపీడియా నుండి
జమున, తెలుగు సినిమా నటి. తెలుగు మాతృభాషకాకపోయినా తెలుగునేలలో పెరిగి, తెలుగు చలన చిత్రంలో అరుదైన కథానాయికగా గుర్తింపు పొందిన తార.
జమున పుట్టింది హంపీలో. బాల్యం గడిచింది గుంటూరు జిల్లా దుగ్గిరాలలో. జమునకు ముందుగా నిర్ణయించిన పేరు జనాబాయి. జన్మ నక్షత్రం రీత్యా ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్కులు చెప్పడంతో మధ్యలో 'ము' అక్షరం చేర్చి జమునగా మార్చారు. ఉత్తరాదివారు యమునను జమునగా పిలవడంతో ఆమెకు ఆ పేరు ఉంచారు. సినిమా కోసం ప్రత్యేకంగా ఆమె పేరు మార్చలేదు. సినీనటుడు జగ్గయ్యదీ అదే గ్రామం కావడంతొ జమున కుటుంబానికి జగ్గయ్యతో కొంత పరిచయం ఉంది. సహజంగా బెరుకు అంటూ లేని జమున స్కూలులొ చదివేకాలంలో నాటకాలపై ఆకర్షితురాలయ్యింది.
తెనాలి సమీపంలోని మండూరు గ్రామంలో 'ఖిల్జీ రాజ్య పతనం ' అనే నాటిక ప్రదర్శన కోసం ప్రత్యేకంగా జగ్గయ్య జమున ఎంపిక చేసుకుని తీసుకువెళ్ళాడు. ఇదే నాటికలో మరో ప్రముఖ నటుడు గుమ్మడి కూడా నటించాడు. నాటకాలలో ఆమె ప్రతిభ నలుమూలలకూ పాకడం వల్ల సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. బి.వి.రామానందం తీసిన పుట్టిల్లు ఆమె తొలిచిత్రం.
ఆ తరువాత అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, నందమూరి తారక రామారావు తదితర నటుల సరసన నాయికగా నటించింది. ఎన్ని పాత్రలలో నటించినా ఆమెకు బాగ పేరు తెచ్చింది సత్యభామ పాత్రే. ఆ పాత్రలో ఇప్పటిటికీ ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము అన్నట్టుగా నటించిందీమె. వినాయకచవితి చిత్రంలో మొదటి సారి సత్యభామలొ జమున కనిపిస్తుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో కూడా అదే పాత్ర వేసింది. ఈ సినిమాలో సత్యభామ ఆహార్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని పాత్రే ఆమెకు పేరు తెచ్చింది.
సినీతారలుగా ఉండి, రాజకీయాలలో ప్రవేశించి రాణించిన కథానాయికలలో ఆమె అగ్రస్థానంలో ఉంటారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ అంటే ఉన్న అభిమానం, గౌరవం నన్ను రాజకీయాలలోకి లాక్కొచ్చాయి అని తన రాజకీయ జీవితం గురించి చెబుతుంది జమున. ఈమె తెలుగు సినిమాలే కాక తమిళ హిందీ సినిమాలలో కూడా నటించింది. ఆమె నటించిన మిస్సమ్మ, ఇల్లరికం, ఇలవేల్పు, లేతమనసులు, గుండమ్మ కథ చిత్రాలు విజయవంతమయ్యి రజతొత్సవం జరుపుకున్నాయి.