జయలలిత
వికీపీడియా నుండి
జయలలిత జయరామన్ (ఫిబ్రవరి 24, 1948) తమిళనాడు రాష్ట్రపు మాజీ ముఖ్యమంత్రి, తమిళ, తెలుగు సినీనటి. తమిళ నాడు ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం యొక్క ప్రధాన కార్యదర్శి. ఈమె 2006 మేలో జరిగిన ఎన్నికలలో పరాజయము పొందినది. అయినా పార్టీవారు తమ మిత్రపక్షాలతో కలిసి శాసన సభలో 1977 తరువాత అత్యంత పటిష్టమైన ప్రతిపక్షముగా నిలవగల సీట్లను సంపాదించారు. ఈమే ప్రస్తుత తమిళ నాడు శాసనసభ ప్రతిపక్ష అధ్యక్షురాలు. అభిమానులు జయలలితను అమ్మ అని, పురచ్చి తలైవి (క్రాంతియుత నాయకురాలు) అని పిలుస్తుంటారు.
జయలలిత అసలు పేరు కోమలవల్లి. ఈమె అలనాటి సినీ నటి సంధ్య కూతురు. మైసూరులో జన్మించిన జయలలిత రాజకీయ రంగప్రవేశానికి మునుపు తమిళ చిత్ర రంగములో విజయవంతమైన సినీ నటి. కుటుంబ పరిస్థితులవలన ఈమె తల్లి బలవంతముతో తన 15వ యేట సినిమా రంగములో ప్రవేశించినది. జయలలిత తొలి సినిమా చిన్నడ గొంబె కన్నడ చిత్రము పెద్ద హిట్టయ్యింది. ఈమె తొలి తెలుగు సినిమా మనుషులు మమతలు ఈమెను పెద్దతార స్థాయికి తీసుకెళ్లింది. 1972లో తమిళనాడు ప్రభుత్వము జయలలితను కళైమామణి పురస్కారముతో సత్కరించినది.