పేషన్స్ కూపర్
వికీపీడియా నుండి
పేషన్స్ కూపర్ (English:Patience Cooper) (1905–1983) తొలి తరము భారతీయ సినిమా నటి. కలకత్తాకు చెందిన ఆంగ్లో-ఇండియన్ కుటుంబములో జన్మించిన పేషన్స్, విజయవంతమైన మూకీ చిత్రాల్లోను, టాకీ చిత్రాల్లోను నటించి రెండిటిలో తొలి భారతీయ తారగా పేరుతెచ్చుకొన్నది.
[మార్చు] రంగస్థల జీవితము
కూపర్, బాండ్‌మాన్స్ మ్యూజికల్ కామెడీ అనే యురేషియన్ బృందములో నర్తకిగా జీవితాన్ని ప్రారంభించినది. ఆ తరువాత జమ్షెడ్జీ ఫ్రాంజీ మదన్ స్థాపించిన కొరింథియన్ స్టేజ్ కంపెనీ అనే నాటక సంస్థలో నటిగా చేసినది. ఈ సంస్థనే తర్వాత కాలములో భారతదేశములో సినిమా నిర్మాణము, పంపిణీ మరియు ప్రదర్శనలను చేపట్టిన మదన్ థియేటర్ లిమిటెడ్ గా ఆవిర్భవించింది.
[మార్చు] సినీ రంగములో
పేషన్స్ కూపర్, 1921లో తన తొలి సినిమా విష్ణు అవతార్ తో మొదలుకొని 1944 సినిమా జీవితము నుండి విరమణ పొందే ముందు నటించిన ఇరాదా (యోచన) వరకు 40కి పైగా సినిమాలలో నటించినది. కూపర్ చరచూ తన చుట్టూ ఉన్న మగాళ్ల వలన నైతిక సంధిగ్దత మధ్య కొట్టుమిట్టాడే అమాయక అమ్మాయి పాత్రలను పోషించినది. భారతీయ సినిమా రంగములో మొట్టమొదటి ద్విపాత్రాభినయము చేసిన తొలి నటి కూపరే. 1923లో విడుదలైన పత్నీ ప్రతాప్ లో ఇద్దరు అక్కచెల్లెల్ల పాత్రలు పోషించినది. 1924లో విడుదలైన కాశ్మీరీ సుందరిలో తల్లీకూతుళ్ల పాత్రలు పోషించినది.