ప్రతాపరుద్ర గజపతి
వికీపీడియా నుండి
ప్రతాపరుద్ర గజపతి 1497 నుండి 1540 వరకు ఉత్తరాంధ్ర మరియు ఒరిస్సా ప్రాంతాలను పాలించిన గజపతి వంశ చక్రవర్తి.
శ్రీ కృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడైన వెంటనే 1510లో గజపతి దక్షిణ ప్రాంతాలను రక్షించుకోవడానికి సైన్యము తరలించాడు. ఇదే అదనుగా బెంగాల్ సుల్తాన్ హుస్సేన్ షా ఒరిస్సాపై దండెత్తి ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయములోని విగ్రహాలను ధ్వంసము చేశాడు. ప్రతాపరుద్రుడు హుటాహుటిన బెంగాల్ సుల్తాన్ను ఎదిరించడానికి ఉత్తరానికి తిరిగి వచ్చినా హుస్సేన్ షా షరతులు అంగీకరించక తప్పలేదు.
1513లో కృష్ణదేవరాయలు, ప్రతాపరుద్ర గజపతి పై యుద్ధము ప్రకటించి దండెత్తినాడు. ఆరు సంవత్సరాల పోరాటము తరువాత 1519 లో రాయలకు తన కూతురు జగన్మోహిని (తుక్కా) నిచ్చి వివాహము చేసి సంధి చేసుకున్నాడు. సంధితో విజయనగర సామ్రాజ్యము వలన ముప్పుతొలగిపోయినా బహుమనీ సుల్తానులతో పోరాడవలసి వచ్చినది. విజయనగరములో బందీగా ఉన్న ప్రతాపరుద్రుని పెద్ద కుమారుడు వీరభద్ర గజపతి చెరలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
సమకాలిక ఒరియా మరియు బెంగాళీ రచనలు ప్రతాపరుద్రునికి భానుమతి, విద్యుకాంతి, గౌరి మరియు చంద్రకళ అని నలుగురు భార్యలని చెబుతున్నాయి. అయితే సరస్వతీ విలాసము ప్రకారము ప్రతాపరుద్రునికి ముగ్గురు భార్యలు. వారి పేర్లు పద్మ, ఇళా మరియు లక్ష్మి.
ప్రతాపరుద్రుడు కళా పోషకుడు. ఈయన పాలనా యుగాన్ని ఒరియా సాహిత్యానికి సువర్ణ దశగా భావిస్తారు. ఈయన ఆస్థానములో ఒరియా కవులతో పాటు అనేక తెలుగు కవులు కూడా ఉన్నారు. ఈయన పూరీ జగన్నాథ ఆలయములోని సభా మండపాన్ని నిర్మింపజేశాడు.
ప్రతాపరుద్ర గజపతి 1540లో మరణించాడు.
[మార్చు] మూలాలు
- ద హిస్టరీ ఆఫ్ ద గజపతి కింగ్స్ ఆఫ్ ఒరిస్సా - ప్రభాత్ ముఖర్జీ