రాష్ట్రపతి పాలన
వికీపీడియా నుండి
భారతదేశంలో ఏదైనా రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని రద్దుచేసి, రాష్ట్రాన్ని నేరుగా కేంద్ర ప్రభుత్వ పాలనలోకి తీసుకురావడాన్ని రాష్ట్రపతి పాలన అంటారు. భారత రాజ్యాంగం లోని 356 వ అధికరణం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఈ అధికారం సంక్రమించింది. దీని ప్రకారం - రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందిందని భావించినపుడు, దేశంలోని ఏ రాష్ట్రం లోనైనా రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. రాష్ట్రంలోని పరిస్థితిపై గవర్నరు నివేదికపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రపతి ప్రతినిధిగా రాష్ట్ర గవర్నరు పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తారు.
[మార్చు] కొన్ని నియమాలు
- రాష్ట్రపతి పాలన విధించినపుడు రాష్ట్ర శాసనసభను రద్దు చేయవచ్చు లేదా తాత్కలికంగా అచేతన స్థితిలో ఉంచవచ్చు.
- రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శాసనసభలో తగినంత ఆధిక్యత ఏ పార్టీకి గాని, కూటమికి గాని లేకపోయినపుడు కూడా రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. రాజ్యాంగం ప్రకారం శాసనసభ సమావేశాల ముగింపుకు, తదుపర్ సమావేశాల మొదలుకు మధ్య 6 నెలలకు మించి అంతరం ఉండరాదు.
- రాష్ట్రపతి పాలన 6 నెలలకు మించి విధించరాదు. అయితే 6 నెలల వ్యవధి తరువాత మరో 6 నెలల కాలానికి పొడిగించవచ్చు. ఈ విధంగా ఎన్ని సార్లైనా పొడిగించవచ్చు.
- రాష్ట్రపతి పాలనలో రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన ఏ అధికారాన్ని రద్దు చేసే అధికారం మాత్రం రాష్ట్రపతికి లేదు.
- రాష్ట్రపతి పాలన విధింపును పార్లమెంటు నిర్ధారించాలి.
[మార్చు] వివాదాలు
రాష్ట్రపతి పాలన విధింపు అనేక వివాదాలకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పర్టీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను ఈ కారణంగా తొలగించడమనేది జరుగుతూ వచ్చింది.
1993 లో కర్ణాటకలో ఎస్.ఆర్.బొమ్మై ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రపతి పాలన విధించినపుడు, సుప్రీం కోర్టు ఆ నిర్ణయాన్ని తప్పు పట్టింది.