సంపత్ కుమార్
వికీపీడియా నుండి
ఆంధ్ర జాలరి ఆచార్య డి.వై.సంపత్ కుమార్
ఒక సముద్రం -
ఒడ్డున పేద జాలరి -
అతనిలో ఆశ,పట్టుదల -
ఎదురు తిరిగే నిస్పృహ ఆటుపోటులు-
ఎగిసిపడే కెరటాలూ , నాటుపడవా ,అతని సహచరులు -
పేదల శరీర కష్టానికి భాష్యం చెప్పే ఈ దృశ్యం- ఆంధ్ర, ఆంధ్రేతర రంగస్థలాల మీద అవతరించి,ఒక ప్రత్యేకతను సంతరించుకుని జానపద నృత్యరీతికి ప్రోదిచేసింది .అతి సామాన్యంగా కనిపించే ఈ దృశ్యం నృత్యనాటిక రూపాన్ని పొందింది సంపత్ కుమార్ మనస్సులో.కాగా,ఆంధ్రా జాలరికి పర్యాయ పదంగా సంపత్ కుమార్, ఆయనకు బిరుదుగా "ఆంధ్ర జాలరి" కలగలిసిపోయారు.
[మార్చు] ఆంధ్ర జాలరి సృష్టి
1957వ సంవత్సరం న్యూఢిల్లీలో ప్రజా నాట్యమండలి ఐ.పి.టి.ఏ. వారి అధ్వర్యంలో అఖిల భారత నృత్య పోటీలు జరిగాయి . ప్రజా నాట్యమండలి ఉద్యమకర్త ప్రముఖ చలనచిత్ర నిర్మాత, దర్శకుడైన గరికిపాటి రాజారావు , సంపత్ కుమార్‌ను ఆ పోటీల్లో పాల్గొనమని ప్రేరేపించాడు. అయితే కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశం కలిగించారు . సాధారణంగా ఒక నృత్యం ప్రదర్శించాలంటే చాలా మంది సహకారం అవసరమవుతుంది. అటువంటిది కేవలం ఇద్దరితో ఏ అంశం చేయాలో అనే ఆలోచనలో పడ్డ సంపత్ కుమార్‌కి సరోజిని నాయుడు వ్రాసిన " కోరమండల్ ఫిషర్స్" అనే ఆంగ్ల కవిత మదిలో మెదిలింది. ఆ ఆలోచన అతన్ని భీమిలికి తీసుకుపోయింది. అక్కడ సముద్ర తీరాన సాగరమే సంసారంగా, దినదిన గండంగా దినాలు గడిపే నిరుపేద జాలరుల జీవన సమరాన్ని, భావగర్భితంగా ఏ సాహిత్యము లేకుండా కేవలం " మైమ్ " తో ప్రదర్శించే మహత్తర భావం రూపుదాల్చుకుంది. అవసరార్థం, పోటీకొరకు, సరదాగా కూర్చిన ఈ నృత్యం ఇతి వృత్తపరంగాను , సాంకేతికపరం గాను అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుందని ఆనాడు ఎవరూ ఊహించలేదు. కేవలం తబలా శబ్ద తరంగాలతో, అలలు, తూఫాను హోరు, ఉరుములు, మెరుపుల సృష్టితో , ప్రేక్షకుల్ని మైమరిపింపజేసే ఈప్రత్యేక తరహా నృత్య రూపకం అవతరించి, ఒక అధ్బుతమైన కళాఖండమై విరాజిల్లింది.