సురభి నాటక సమాజం
వికీపీడియా నుండి
ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక సమాజం 1885 లో కడప జిల్లా సురభి గ్రామంలో 'కీచక వధ'నాటక ప్రదర్శనతో మొదలయ్యింది. ఈ సమాజ వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు.
1885 లో వనారస సోదరులు వనారస గోవింద రావు మరియు వనారస చిన్నరామయ్య కలిసి కడప జిల్లా చక్రాయపేట మండలములోని సురభి రెడ్డివారిపల్లెలో శ్రీ శారదా వినోదిని నాటక సభను ప్రారంభించారు. సురభిలో ప్రారంభమైన ఈ నాటక సభ కాలక్రమేణ సురభి నాటక సంఘముగా ప్రసిద్ధి చెందినది. రంగస్థలముపై స్త్రీ పాత్రలను స్త్రీలచే ధరింపచేసిన తొలి నాటక బృందము సురభినే. నాటకములోని పాత్రధారులందరూ ఒకే కుటుంబములోని సభ్యులవడము చేత స్త్రీలకు చెడ్డపేరు వస్తుందనే భయము ఉండేది కాదు. బృందములోని సభ్యులకు రంగస్థలమే జీవితముగా సాగేది.
స్థాపించిన కొద్దిరోజులలోనే ఈ సమాజము త్వరితగతిన విస్తరించి 50 వేర్వేరు బృందములుగా వృద్ధిచెందినది. ప్రతి బృందము దాదాపు 30 మందికి పైగా సభ్యులతో స్వయము సమృద్ధిగా ఉండేవి. వనారస గోవింద రావుకు ముగ్గురు కుమారులు పదిమంది కుమార్తెలు. వీరి కుటుంబము వ్యాపించిన కొలది బృందములు కూడా వ్యాపించినవి. సినిమా మరియు టివీల ఆగమనముతో 1974 కల్లా బృందముల సంఖ్య 16కు క్షీణించినది. 1982 నాటికి కేవలము నాలుగు సురభి నాటక బృందాలు మాత్రమే మనుగడలో ఉన్నవి. ప్రస్తుతము ఆంధ్ర దేశములో సురభి నాటక కళాసంఘము ఆధ్వర్యములో ఐదు నాటక బృందములు పనిచేస్తున్నవి.
వీటిలో అన్నింటికంటే పెద్దదైన శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి 1937 లో గోవిందరావు ఐదవ కూతురు సుభద్రమ్మ మరియు ఆమె భర్త ఆర్.వెంకట్రావు చే స్థాపించబడినది. ప్రస్తుతము ఆ బృందములో వీరి కుమారులు భోజరాజు, బాబ్జి మరియు గణపతి రావులు మరియు వారి కుటుంబములు అంతా కలిపి 62 మంది సభ్యులు కలరు.
తొలితెలుగు సినీనటీమణి సురభి కమలాబాయి సురభి కళాకారుల కుటుంబములో పుట్టి పెరిగినదే.