హార్డ్‌వేర్
వికీపీడియా నుండి
చేతితో ముట్టుకోడానికిగాని, పట్టుకోడానికికాని వీలైన భాగాలన్నీ స్థూలకాయం (hardware) నిర్వచనంలో ఇముడుతాయి. ఉదాహరణకి, కంప్యూటరు కొనగానే మన చేతులతొ తడిమి చూడడానికి వీలైనవి ముఖ్యంగా మూడు: (1) కంప్యూటర్ యొక్క అంతర్భాగాలన్నిటిని కప్పుతూ పైకి కనిపించే రేకు పెట్టె లాంటిది ఒకటి, (2) మనం రాసేవి, చూసేవి కనపడడానికి వీలుగా ఒక గాజు తెర (దీన్నే monitor అంటారు), దానితోపాటు టైపు చెయ్యడానికి వీలైన ఒక మీటల ఫలకము (దీనినే keyboard అంటారు), వగైరా, (3) వీటన్నిటిని అనుసంధించడానికి తీగలు. ఇవీ బయటకి కనిపించే స్థూలకాయం యొక్క ముఖ్య భాగాలు.
ఆ రేకు పెట్టెని తెరచి చూస్తే అందులో అసలైన, సిసలైన స్థూలకాయం కనిపిస్తుంది. మన శరీరపు చర్మాన్ని ఒలిచి లోపలికి తొంగి చూస్తే గుండె, మెదడు మొదలైన అవయవాలలాగే, ఈ పెట్టెలో ఎన్నో ముఖ్యమైన అవయవాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.
స్థూలకాయం (hardware) లో ముఖ్యాతి ముఖ్యమైన భాగాన్ని మైక్రోప్రోసెసర్ అంటారు. మైక్రోప్రోసెసర్ అంటే సూక్ష్మ మైన కంప్యూటరు అని అర్ధం. పూర్వం గదంతా ఆక్రమించేసిన కంప్యూటరు ఇప్పుడు వేలి గోరంత మేర ఆక్రమిస్తుంది కనుక దీనికి ఈ పేరు వచ్చింది. దీనిని మన మెదడుతో పోల్చవచ్చు.
దీని తర్వాత చెప్పుకోదగ్గది కొట్టు. ఈ కొట్టులో రెండు రకాలు. ఒకటి రాం (ROM), రెండోది రేం (RAM). ROM లో ఉన్న దత్తాంశాలని కంప్యూటరు చదవ గలదు కానీ, చెరిపేసి కొత్తవి రాయ లేదు. RAM లో ఉన్న దత్తాంశాలని కంప్యూటరు చదవనూ గలదు, ఉన్నవాటిని చెరిపేసి కొత్తవి రాయనూ గలదు. ఛిన్న ఉపమానం. మనం పుట్టినప్పుడు మన లలాట ఫలకం మీద బ్రహ్మదేవుడు రాసినదాని ప్రకారం మన జీవితం నడుస్తుందని మనం అనుకుంటాం కదా.ఈ లలాట లిఖితం ROM లాంటిది. అదే ఎవరైనా వారింటికి దారి చెప్పినప్పుడు కాని, వారి టెలిఫోను నంబరు చెప్పినప్పుడు కాని అది మనం మెదడులో దాచుకుంటాం. అవసరం తీరిపోయిన తర్వాత అది చెరిపేసి (మరచిపోయి), ఆ స్థానంలో మరొక విషయం “రాసుకుంటాం”. అలాగన్న మాట.
ఈ రెండింటి తర్వాత చెప్పుకోదగ్గది తీగలు. ఈ తీగల కట్టలనే ఇంగ్లీషులో bus అంటారు. వీటిని మనం పట్టాలు లేదా పటకాలు అందాం. ఊళ్ళ మధ్య ప్రయాణం చెయ్యడానికి రైలు పట్టాలు ఉపయోగపడ్డట్లే రేకు పెట్టెలో ఉన్న మైక్రోప్రోసెసర్ ని, రామ్ నీ రేమ్ నీ కలపడానికే కాకుండా, పెట్టె బయట ఉన్న గాజు తెరనీ, మీటల ఫలకాన్నీ కలపడానికీ, ఇంకా అనేక కార్యాలకి ఈ తీగల రహదారిని వాడతారు.
పెట్టె లోపల ఏముంటుంది?
కొని ఇంటికి పట్టుకొచ్చిన కంప్యూటరు లోపల ఏముంటుందనే కుతూహలం ఉంటే, ఈ తరువాయి చదవండి.
పెట్టె మూత జాగ్రత్తగా తీసి, తెలిసీ తెలియకుండా దేనినీ ముట్టుకోకుండా జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ దిగువ వర్ణించిన భాగాలుకనిపిస్తాయి.
Power Supply: కంప్యూటరుకి కావలసిన విద్యుత్తు అంతా ఈ పెట్టె సరఫరా చేస్తుంది. ఈ పెట్టెలో ముఖ్యంగా ఒక transformer ఉంటుంది. మన ఇంట్లో ఉన్న వోల్టేజిని అవసరం మేరకి తగ్గించి మిగిలిన భాగాలకి సరఫరా చెయ్యడమే ఈ పెట్టె చేసే పని.
Hard Drive: పైకి కనిపించదు కానీ, లోపలకి చూడగలిగితే ఇది ఒక దొంతిగా అమర్చిన గ్రామఫోను పళ్ళేల మాదిరి ఉంటుంది. గ్రామఫోను రికార్డుల మీద మనం పాటలు “రాసుకుని” అవసరం వచ్చినప్పుడు తిరిగి పాడించుకుని ఎలా వింటామో అలాగే ఈ పళ్ళేలమీద దత్తాంశాలు రాసుకుని అవసరం వెంబడి తిరిగి "పాటలు వేసుకుని" వాడుకోవచ్చు.
Floppy Drive: ఈ రోజులలో దీని వాడకం బాగా తగ్గి పోయింది. దీనికీ hard drive కీ ఒకే ఒక చిన్న తేడా. దీంట్లో పళ్ళేలని మనం బయటకి తీసి మనతో పట్టుకు పోయి, మరో కంప్యూటర్‌లో దోపి వాడుకోవచ్చు.
Microprocessor: కావలిస్తే దీనిని సూక్ష్మ సంకలని అని తెలుగులో అనొచ్చు. నిజానికి ఇదీ అసలైన సిసలైన కంప్యూటరు. పైకి చూడడానికి చిన్న పలక ముక్కలా, చిన్న చిల్ల పెంకులా ఉంటుంది కాని దీని కట్టడి అధ్యయనం చెయ్యడానికి చాల దీక్ష ఉండాలి
Ports: నదులమీద, సముద్రం మీద రేవులు చేసే పని ఏమిటి? జలభాగం మీది రహదారులని భూభాగం మీది రహదారులతో కలపడం. అదే విధంగా కంప్యూటరు లోపలి రహదారులని బయటి మార్గాలతో అనుసంధించడానికి వాడే సాధనాలే పోర్టులు. వీటిని తెలుగులో రేవులు అని అనొచ్చు. గోడ మీద ఎలట్రీ ప్లగ్ చేసే పని కూడా ఇదే – ఇంట్లో ఉన్న విద్యుత్ ఉపకరణాలని బయటి నుండి సరఫరా అయే విద్యుత్తు తో కలపడానికి ప్లగ్ వాడతాం. అదే విధంగా కంప్యూటర్ ని బయట ఉన్న ప్రింటర్‌తో, మీటల ఫలకంతో, మోడెమ్ తో, ఇంటర్‌నెట్ తో, …, కలపడానికి ఈ రేవులని వాడతారు.
BIOS: లేదా Basic Input/Output System. కంప్యూటర్ యొక్క స్థూలకాయానికీ, సూక్ష్మ కాయానికీ మధ్య ఉండే మధ్యవర్తి లాంటిది. సూక్ష్మ కాయం లో ముఖ్యాతి ముఖ్యమైన Operating System ఉత్తర్వులు జారీ చేస్తూ ఉంటే ఏయే ఉత్తర్వులు ఏయే సూక్ష్మ కాయపు భాగాన్ని చేరాలో ఈ BIOS పర్యవేక్షణ లో జరుగుతాయి.
అమాంబాపతులు: పైన చెప్పిన ముఖ్య భాగాలేకాకుండా కంప్యూటర్ లో ఇంకా ఎన్నో చిన్న చిన్న అంతర్భాగాలు ఉంటాయి. ఎన్నో చిన్న చిన్న అంతర్భాగాలు ఉంటాయి.