అష్ఫాకుల్లా ఖాన్
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
అష్ఫాకుల్లా ఖాన్ (అక్టోబర్ 22, 1900 - డిసెంబర్ 19, 1927) భారతీయ స్వంతంత్ర సమరయోధుడు.
విషయ సూచిక |
[మార్చు] బాల్యము
అష్ఫాకుల్లా ఖాన్ ఉత్తర ప్రదేశ్ లోని షాజహాన్‌పూర్ లో జన్మించాడు. ఈయన తండ్రి షఫీకుర్ రెహమాన్ పొలీసు శాఖలో పనిచేసేవాడు. తల్లి పేరు మజ్హరున్నీసా. అష్ఫాకుల్లా ఈ దంపుతుల ఆరుగురు సంతానములో చివరివాడు. మహాత్మా గాంధీ సహాయనిరాకరణోద్యమము ప్రారంభించినప్పుడు అష్ఫాక్ పాఠాశాలలో చదువుతున్నాడు.
[మార్చు] సహాయనిరాకరణోద్యమము
మహాత్మాగాంధీ, చౌరీ చౌరా ఉదంతము తర్వాత సహాయనిరాకరణోద్యమము నిలిపివేయడముతో అనేక మంది భారతీయ యువకులు నిరాశ చెందారు[1]. అలాంటి యువకులలో అష్ఫాక్ ఒకడు. ఈయన భారతదేశాన్ని వీలయినంత త్వరగా పరాయి పాలన నుండి విముక్తము చేయాలన్న తపనతో, అతివాద ఉద్యమకారులతో చేరాడు. ఈ సమయములోనే ఈయనకు షాజహాన్‌పూర్ కు చెందిన ప్రముఖ ఉద్యమకారుడు రాంప్రసాద్ బిస్మిల్ తో పరిచయమేర్పడింది.
[మార్చు] రాంప్రసాద్ బిస్మిల్ తో స్నేహము
హిందూ మతము యొక్క గొప్పతనము గురించి ఇతర మతస్థులకు భోధించడానికి వెనుకాడని ఆర్య సమాజ్ సభ్యుడైన రాంప్రసాద్ బిస్మిల్ తో సాంప్రదాయ ముస్లిం మతస్థుడైన అష్ఫాకుల్లా ఖాన్ యొక్క స్నేహము కొంత విభిన్నమైనదే. అయినా వారిద్దరి సమిష్టి లక్ష్యము ఒకటే, భారత స్వాతంత్ర్యము. దీనితో ఇద్దరు మంచి మిత్రులయ్యారు. ఇద్దరూ ఒకే రోజు, కాకపోతే వేర్వేరు జైళ్లలో భారతదేశ స్వాతంత్ర్యము కోసం ప్రాణాలు అర్పించారు [2].
[మార్చు] కాకోరీ రైలు దోపిడి
తమ సాయుధ ఉద్యమానికి ఊపునివ్వడానికి, సాయుధ పోరాటానికి కావలసిన ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి కొనుగోలు చేయడానికి ఉద్యమకారులు 1925, ఆగష్టు 8 న షాజహాన్‌పూర్లో ఒక సభను నిర్వహించారు. చాలా తర్జనబర్జనల తర్వాత ఆ సభలో రైళ్లలో రవాణా చేసే ప్రభుత్వ కోశాగారాన్ని దోచుకోవాలని నిర్ణయించారు. ఆగష్టు 9న అష్ఫాకుల్లా ఖాన్ మరియు రాంప్రసాద్ బిస్మిల్, రాజేంద్ర లాహిరి, ఠాకూర్ రోషన్ సింగ్, సచీంద్ర బక్షీ, చంద్రశేఖర్ ఆజాద్, కేశవ్ చక్రవర్తి, బన్వారీ లాల్, ముకుంది లాల్ మరియు మన్మధనాథ్ గుప్త లు కలిసి కాకోరీ గ్రామము వద్ద ప్రభుత్వ ధనమును తీసుకెళుతున్న రైలును దోచుకున్నారు.
సెప్టెంబర్ 26, 1925 ఉదయాన పొలీసులు రాంప్రసాద్ బిస్మిల్ ను పట్టుకున్నారు. అష్ఫాక్ మాత్రము పోలీసులకు దొరకలేదు. ఆయన అజ్ఞాతములో బీహార్ నుండి బనారస్ కు వెళ్లి అక్కడ 10 నెలలపాటు ఒక ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేశాడు. అజ్ఞాతములో మరెంతో కాలము ఉండలేక దేశానికి ఉపయోగపడుతుందని విదేశాలకు వెళ్లి ఇంజనీరింగు చదవాలని నిశ్చయించి, దేశాన్ని వదిలి వెల్లడానికి మార్గాలు అన్వేషిస్తూ ఢిల్లీ చేరాడు. అక్కడ ఒక పఠాన్ స్నేహితున్ని ఆశ్రయించాడు. కానీ అదే స్నేహితుడు అష్ఫాక్ ను వెన్నుపోటు పొడిచి పోలీసులకు ఆయన జాడ తెలియజేసాడు "[3].
అష్ఫాకుల్లా ఖాన్‌ను ఫైజాబాద్ జైల్లో బంధించి కేసు నమోదు చేశారు. అష్ఫాక్ పెద్దన్న రియాసతుల్లా ఖాన్ చివరి వరకు అష్ఫాక్ తరఫు న్యాయవాదిగా వాదించాడు. జైలులో ఉండగా ఈయన్ ఖురాన్ పఠనము చేసేవాడు. కాకోరీ దోపిడి కేసు రాంప్రసాద్ బిస్మిల్, అస్ఫాకుల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి మరియు రోషన్ లకు మరణ శిక్ష్, మిగిలిన వారికి జీవిత ఖైదు విధించడముతో ముగిసినది.
[మార్చు] మరణము
అష్ఫాకుల్లా ఖాన్ ను 1927, డిసెంబర్ 19 న ఉరితీశారు. షాజహాన్‌పూర్ లోని ఈయన సమాధి ఇప్పుడు ఒక స్మారక స్థలమైనది. కొందరు చరిత్రకారులు అష్ఫాకుల్లా ఖానే రాజద్రోహ నేరముపై ఉరితీయబడిన తొలి ముస్లిం అని భావిస్తారు. ఈయన దేశానికి తన చివరి సందేశములో "నా దేశ స్వాతంత్రం కోసం ఉరికంభమెక్కిన ప్రప్రధమ ముస్లింనైనందుకు నేను గర్వపడుతున్నాను" అని రాశాడు.
[మార్చు] మీడియా చిత్రీకరణ
అష్ఫాకుల్లా ఖాన్ మరియు ఈయన సహచరులు చేసిన పనులను 2006లో విడుదలైన రంగ్‌దే బసంతీ అను హిందీ సినిమాలో చిత్రీకరించారు. ఈ చిత్రములో అష్ఫాకుల్లా ఖాన్ పాత్రను కునాల్ కపూర్ పోషించాడు [4] .