కొమర్రాజు లక్ష్మణరావు
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాత, విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకుడు కొమర్రాజు లక్ష్మణరావు. 1877 లో కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో లక్ష్మణరావు జన్మించాడు. ప్రముఖ రచయిత్రి బండారు అచ్చమాంబ ఆయనకు అక్క. ప్రాథమిక విద్యను భువనగిరిలో పూర్తిచేసి, నాగపూరులో బి.ఎ. చదివాడు. లక్ష్మణరావు బాల్యము, యవ్వనము మహారాష్ట్రలో గడిచాయి. అక్కా,బావల వద్ద నాగపూరు లో ఉంటూ మరాఠీ భాషను నేర్చుకున్నాడు. మరాఠీ భాషలో వ్యాసాలు, పద్యాలు రాసాడు. మౌరోపంత్ అనే కవి రచించిన కర్ణపర్వాన్ని ఆయన పరిష్కరించాడు. తెలుగు, మరాఠీ, ఇంగ్లీషు మాత్రమే కాదు. ఇంకా ఆయన సంస్కృతము, బెంగాలీ, ఉర్దూ, హిందీ భాషలలోను ప్రావీణ్యము సంపాదించారు.
నాగపూరులో ఉంటూనే తెలుగు పత్రికలలో వ్యాసాలను వ్రాసేవారు. "హిందూ మహా యుగము", "ముస్లిమ్ మహాయుగము" "శివాజీ చరిత్రము" వంటి ఆయన వ్యాసాలు "లక్ష్మణరావు వ్యాసావళి" పేరుతో ప్రచురితమైనాయి. మహారాష్ట్రలో విద్యాభ్యాసమైన తరువాత ఆయనకు మునగాల రాజా వారు నాయని వెంకటరంగారావు గారి సంస్థానములో ఉద్యోగము లభించింది. రాజావారు అభ్యుదయ భావాలు కలిగినవారు. తెలుగు భాషాభిమాని. వారి సఖ్యతవల్ల కొమర్రాజు గారికి తెలుగు భాషాభివృద్ధికి మంచి ప్రోత్సాహము లభించింది.
1901 లో కొమర్రాజు లక్ష్మణరావు గారు, రాజా నాయని వెంకటరంగారావు గారు, రావిచెట్టు రంగారావుగారు కలసి హైదరాబాదులో "శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయము" ను స్థాపించినారు. తెలుగు బాషకు ఈ సంస్థ ద్వారా ఎంతో సేవ జరిగినది.
1905 లో కొమర్రాజు లక్ష్మణరావు గారు విజ్ఞాన చంద్రికా మండలిని స్థాపించినారు. తెలుగులో సైన్సు, చరిత్ర వంటి విషయాలలో పుస్తకాలు ప్రచురించుట వారి లక్ష్యము. తరువాత ఈ సంస్థను మద్రాసుకు మార్చారు.తెలుగులో ఒక సంపూర్ణ విజ్ఞాన సర్వస్వమును తయారుచేసే మహత్కార్యమును వారు ప్రారంభించారు. దానికి మల్లంపల్లి గారు, రాయప్రోలు సుబ్బారావు గారు ఆయనకు తోడు నిలిచారు. రేయింబవళ్ళు శ్రమించి, మూడు సంపుటములు ప్రచురించారు. ఇందులో సైన్సు, భాష, ఖగోళశాస్త్రము, చరిత్ర, కళ వంటి వివిధ విషయాలపై ఆయన 40 వ్యాసాలను కూర్చారు.
ఈ శ్రమలో ఆయన ఆరోగ్యము బాగా దెబ్బ తిన్నది. 1923 లో, చిన్న వయసులోనే ఆయన పరమపదించారు.
తెలుగు భాషకు ఆయన చేసిన సేవ మరువరానిది. ప్రత్యేకించి ఈ "తెలుగు వికీపీడియా" కార్యక్రమము కొనసాగుతున్న నేపథ్యములో ఆయనను స్మరించుకొనుట మన కర్తవ్యము.