అత్తిరాల
వికీపీడియా నుండి
కడప జిల్లా రాజంపేట నుంచి నెల్లూరు వెళ్ళే మార్గంలో రాజంపేటకు 5-6 కి.మీ. దూరంలో అత్తిరాల ఉంది. ఈ క్షేత్రం బాహుదా నది ఒడ్డున వెలసింది. అత్తిరాలలో రెండు వేల సంవత్సరాల కాలం నాటి రోమన్ నాణేలు దొరికినాయి.
[మార్చు] పేరు వృత్తాంతము
ఒక సారి శివుడు తనను దూషించిన బ్రహ్మ ఐదవ తలను నరికినప్పుడు ఆ తల రాలి ఇక్కడే పడిందని, "హత్య! (తల) రాలె!" అనే మాటలే చివరకు "అత్తిరాల" అయ్యాయని అంటారు. ఇంకో కథ ప్రకారం పరశురాముడు తన తండ్రి జమదగ్ని మాట ప్రకారం తన తల్లి అయిన రేణుకను చంపుతాడు. తల్లిని చంపిన పాపం పోగొట్టుకోవడానికి పరశురాముడు బాహుదా నదిలో స్నానం చేసి ఇక్కడ ఉన్న త్రేతేశ్వర స్వామిని సేవించాడు. పరశురాముని చేతికంటిన పాపం పోగొట్టిన ఈ నదికి చెయ్యేరు అని పేరు వచ్చింది. ఈ క్షేత్రాన్ని పరశురామ క్షేత్రమనీ, హత్యరాల అనీ అంటారు.
[మార్చు] ఆలయాలు
అత్తిరాలలో త్రేతేశ్వరాలయం, కామాక్షి ఆలయం ప్రసిద్ధమైనవి. కొండ దిగువన పరశురామాలయం ఉంది. ప్రక్కనే గదాధర స్వామి ఉన్నాడు. ఇది విష్ణ్వాలయం. పరశురామాలయం మీద నృత్య భంగిమ శిల్పాలు, రామ, కృష్ణ, విష్ణు, పరశురామ శిల్పాలు ఉన్నాయి. ఇవి కాక మట్లి రాజుల కాలంలో ఉన్న ఏకా తాతయ్య విగ్రహం ఉంది. తలనొప్పితో బాధపడేవారు తమ తలతో తాతయ్య తలకు కొట్టుకుంటారు. అలా చేస్తే తలనొప్పి పోతుందని వారి విశ్వాసం. దేవగిరి యాదవరాజు అత్తిరాలను దర్శించినాడు. పొత్తపి రాజు శ్రీకంఠ చోళుడు 'మందరం' గ్రామాన్ని ఈ స్వామికి సమర్పించినాడు. భర్తలు చనిపోయిన భార్యలు, భార్యలు చనిపోయిన భర్తలు ఏడాది లోపు ఈ క్షేత్రాన్ని దర్శిస్తారు. స్త్రీలు ప్రధానంగా కామాక్షీ దేవిని దర్శిస్తారు. గుట్ట పైన జ్యోతి స్తంభం ఉంది. శివరాత్రి నాడు జ్యోతిని వెలిగిస్తారు. మాఘ మాసంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉత్సవాలు జరుగుతాయి. కార్తీక మాసంలో కూడా ఇక్కడికి చాలా మంది వచ్చి శివుడిని దర్శనం చేసుకొంటారు.