అవధానము
వికీపీడియా నుండి
![]() |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
అవధానం అనేది తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట ప్రక్రియ. సంస్కృతం, తెలుగు కాకుండా వేరే ఏ భాష లోనూ ఈ ప్రక్రియ ఉన్నట్లు కనపడదు. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కుంటూ, ఆశువుగా పద్యాలు చెప్తూ - వీటన్నిటినీ ఏక కాలంలో - అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానం.
విషయ సూచిక |
[మార్చు] అవధానం స్వరూపం
కవి యొక్క ఆశుకవిత్వ గరిమకు, సాహితీ పటిమకు, ధారణా శక్తికి (గుర్తుంచుకోగల శక్తి, memorising ability), పాండితీ ప్రకర్షకు అవధానం అత్యున్నత పరీక్ష. సాంప్రదాయికంగా జరిగే "అష్టావధానం" లో 8 మంది పృఛ్ఛకులు (ప్రశ్నలు అడిగే వారు) అవధాని చుట్టూ చేరి వివిధ రకాలైన ప్రశ్నలు (పాండిత్యాన్ని పరీక్షించేవి కొన్ని, అవధాని సహనాన్ని పరీక్షించేవి మరి కొన్ని) అడుగుతూ ఉంటారు. పృఛ్ఛకులు కూడా పాండిత్య పరంగా ఉద్దండులైన వారే ఉంటారు.
ఎందరో కవి పండితులు అవధాన ప్రక్రియను జయప్రదంగా చేసి పండితుల మన్ననలను పొందారు. అవధానం విజయవంతంగా చేసిన వారిని అవధాని అని అంటారు. ఏక కాలంలో తెలుగు, సంస్కృతం - రెండు భాషల లోనూ అవధానం చేసిన పండితులు ఉన్నారు. అవధానాలు చాలా రకాలు. ముఖ్యంగా అవధానాలను వేదసంబంధ, సాహిత్య, సాహిత్యేతర అవధానాలుగా వర్గీకరించవచ్చు.
- వేదసంబంధ అవధానాలు: స్వరావధానం, అక్షరావధానం
- సాహిత్య అవధానాలు: అష్టావధానం, శతావధానం, సహస్రావధానం... ఇలా 20దాకా ఉనాయి.
- సాహిత్యేతర అవధానాలు: శతకలశావధానం, శభ్దావధానం, రామయణ, భగవద్గీత అవధానాలు. ఇవి ధారణ సంబంధమైనవి. అంటే ఒక్కసారి చదివి లేదా విని గుర్తుంచుకోవడం ద్వారా మళ్లీ చెప్పేవి.
- సాంకేతిక అవధానాలు: నేత్రావధానం, అంగుష్టావధానం మొదలగునవి.
- శాస్త్ర సంబద్ధ అవధానాలు: గణితావధానం, జ్యోతిష్యావధానం, వైద్యావధానం, అక్షరగణితావధానం
- కళా సంబద్ధ అవధానాలు: చిత్రకళావధానం, నాట్యావధానం, సంగీతాష్టావధానం, చతురంగావధానం, ధ్వన్యవధానం
[మార్చు] అష్టావధానము
ఇందు ఎనిమిది ప్రక్రియలు ఒకేసారి చెయ్యవలెను, కనీస సమయము నాలుగు గంటలు. ఆ ఎనిమిది ప్రక్రియలు
- కావ్య పాఠము
- కవిత్వము
- శాస్త్రార్దము
- ఆకాశపురాణము
- లోకాభిరామాయణము
- వ్యస్తాక్షరి
- చదరంగము
- పుష్ప గణనము
ఇవే కాకుండా కొంతమంది సమస్యాపూరణం, దత్తపది, వర్ణన, ఆశువు, నిషిద్ధాక్షరి, అప్రస్తుత ప్రసంగం, వివర్గాక్షరి, నిర్దిష్టాక్షరి, ఘంటా గణనం, పురాణ పఠనం, సహ పఠనం, కావ్యోక్తి, ఇచ్ఛాంక శ్లోకం మొదలగు వాటిలో ఎనిమిది ప్రక్రియలు ఎన్నుకుంటారు. చివర్లో "ధారణ"తో అవధానం ముగుస్తుంది. ధారణ అనగా అన్ని పద్యాలను అవధాని చివర్లో చెప్పవలసి వుంటుంది.
[మార్చు] శతావధానము
వంద మంది పృచ్చకులు అడిగే ప్రశ్నలకు, సమస్యలకు ఒక్కొక్క పాదాన్ని పూరించి మరలా ఆ వంద మంది అయిపోయిన తరువాత రెండవ పాదాన్ని, ఆ తరువాత మూడవ పాదాన్ని, ఆ తరువాత ఎవరి ఇష్టాన్ని బట్టి వారి పాదాన్ని పూరించవలెను
[మార్చు] సహస్రావధానము
[మార్చు] ద్వి సహస్రావధానము
[మార్చు] త్రి సహస్రావధానము
[మార్చు] పంచ సహస్రావధానము
[మార్చు] నాట్యావధానము
[మార్చు] గణితావధానము
[మార్చు] ఘంటావధానము
[మార్చు] నేత్రావధానము, అంగుష్టావధానము, అక్షరముష్టికావధానం
ఇందులో ఇద్దరు అవధానులు ఎదురెదురుగా కూర్చుని ఉంటారు. పృక్షకులు మొదటి అవధానికి ఒక కాగితంపై విషయం రాసిస్తారు. అతడు దానిని చదివి రెండవ అవధానికి తన కనుసైగల ద్వారా చెప్పాలి. దాన్ని ఆయన అర్థం చేసుకుని బయటకు చదవాలి. ఇలా చేయడానికి ఆ జంట తెలుగులో ప్రతి అక్షరానికి ఒక్కో గుర్తును పెట్టుకుంటారు. తిరుపతి కవులు, కొప్పరపు కవులు ఈ నేత్రావధానంలో సిద్దహస్తులు.
కళ్లతో కాకుండా బొటనవేలితో భావాలను చెప్పితే అది అంగుష్టావధానం, పిడికిలితో చేస్తే అక్షరముష్టికావధానం. ఇంకా పుష్పావధానం, ఖడ్గావధానం, గమనావధానం... లాంటివి 13దాకా ఉన్నాయి. వీటిని సాంకేతిక అవధానాలు అంటారు.
ఇలాంటి అవధానాలను చేయడానికి జంట అవధానులు తప్పనిసరి. అది ఆ ఇద్దరికి మాత్రమే సాధ్యమవుతుంది. వారిలో ఎవరు లేకపోయినా రెండోవారు మరొకరితో కలసి చేయలేరు.
[మార్చు] అవధానం లోని ప్రక్రియలు
[మార్చు] పుష్ప గణనము
పుష్ప గణనము అనగా అవధానికి తగిలేలా అప్పుడప్పుడు పూలు విసురుతుంటారు. ఆయన ఆ పూల సంఖ్యను లెక్కించి మొత్తం ఎన్ని పూలు విసిరారో చివర్లో చెప్పాల్సి ఉంటుంది.
[మార్చు] ఆశువు
ఆశువు లేదా ఆశుకవిత్వం, ఇది ప్రజలను విశేషంగా ఆకర్షించే ప్రక్రియ. అగ్గిపుల్ల నుంచి అంతరిక్షం దాకా దేని మీదైనా ఆశువు గా పద్యమో దండకమో చెప్పమంటారు పృచ్ఛకులు. అవధాని చతురత, ధార ఇక్కడ ప్రదర్శించాల్సి ఉంటుంది.
[మార్చు] నిషిద్ధాక్షరి
నిషిద్ధాక్షరి అంటే పృచ్ఛకుడు ముందుగానే ఏయే అక్షరాలు నిషిద్ధమో నిర్దేశిస్తాడు. ఉదాహరణకు, మేడసాని మోహన్ గారిని ఒకసారి క, చ, ట, త, ప అనే అక్షరాలు లేకుండా సీతాకల్యాణం గురించి చెప్పమన్నారు. ఆయన ఈ విధంగా చెప్పారు.
సరసనిధిరామభధ్రుడు
ధరణిజ ఎదలోన మధుర ధారణుడయ్యన్
సురులెల్ల హర్షమందిరి
విరాజమాన సువిలాస విభవ మెసగిన్
[మార్చు] నిర్దిష్టాక్షరి
నిర్దిష్టాక్షరి అనగా నిర్దేశించబడిన అక్షరాలుగలదని అర్థం. దీనిలో 32 గళ్లుంటాయి. పృక్షకుడు బేసి స్థానాల్లో గానీ, సరి స్థానాల్లో గాని ఇష్టానుసారం అక్షరాలను రాసిస్తాడు. అవధాని మిగిలిన ఖాలీలను పూరించి కోరిన దేవతా స్తుతిని పూర్తి చేస్తాడు.
[మార్చు] ఘంటా గణనం
ఘంటా గణనం అనగా అప్పుడప్పుడు గంట కొడుతుంటారు. అవధాని ఆ సంఖ్యను లెక్కించి మొత్తం ఎన్ని గంటలు కొట్టారో చివర్లో చెప్పాల్సి ఉంటుంది.
[మార్చు] అప్రస్తుత ప్రసంగం
అవధాని ఏకాగ్రతను చెడగొట్టడానికి అప్రస్తుత ప్రసంగి (పృక్షకులలో ఒకరు) చేయని ప్రయత్నం ఉండదు. ఉదాహరణకు ఒక సభలో ఒకాయన "అవధాని గారూ, భర్త భోజనం చేస్తున్నాడు భార్య వడ్డిస్తోంది. భర్త పశువ అన్నాడు. భార్య కోతి అంది. వారి మాటల్లో ఆంతర్యమేమిటి" అని అడిగారు. దానికి అవధాని... "పళ్లెం నిండా శుభ్రంగా వడ్డించవే" అని భర్త అంటే "కోరినంత తినండి" అని భార్య జవాబిచ్చింది అని చెప్పారు. "హనుమంతుని తోక పెద్దదా-ద్రౌపతి కోక పెద్దదా" వంటివి మరికొన్ని ఉదాహరణలు. అవధాని, అప్రస్తుత ప్రసంగి విసిరే ఛలోక్తులూ చెణుకులకు తడుముకోకుండా చెప్పగలిగితేనే సభ శోభిస్తుంది. ఎందుకంటే, పద్యాలూ ఛందస్సుల గురించి తెలియని వారిని ఆకట్టుకునేది ఈ అప్రస్తుత ప్రసంగమే.
[మార్చు] కొందరు అవధానులు
- అవధాని జగన్నాథ పండిత రాయలు మొఘల్ చక్రవర్తి షాజహాన్ నే తన ధారణా శక్తితో మెప్పించిన దిట్ట.
- తిరుపతి వెంకట కవులు గా ప్రసిద్ధులై జంటకవులు దివాకర్ల తిరుపతి శాస్త్రి (1871-1919) మరియు చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి (1870-1950) - వీరు అవధాన ప్రక్రియకు తమ కాలంలో జీవం పోసి ఎనలేని ప్రజాదరణ సాధించారు. వీరి పాండిత్యాన్ని, చమత్కార చతురతను గూర్చి ఇప్పటికీ సాహితీ ప్రియులు కధలు కధలుగా చెప్పుకొంటారు.
- కొప్పరపు సోదర కవులు - (కొప్పురపు వేంకట సుబ్బరాయ కవి, వేంకట రమణ కవి) తిరుపతి వెంకట కవుల సమకాలీనులు. మెరుపు వేగంతో పద్యాల్లడం వీరి ప్రత్యేకత.
- వెంకట రామకృష్ణ కవులు - తిరుపతి వెంకట కవుల సమకాలీనులు
- పిసుపాటి చిదంబరశాస్త్రి - 1930-40 లలోని గొప్ప అవధానులలో ఒకరు
- వేంకట రామకృష్ణ కవులు - ప్రఖ్యాత జంట కవులు
- రాజశేఖర వేంకట కవులు - ప్రఖ్యాత జంట కవులు
- పల్నాటి సోదరులు - ప్రఖ్యాత జంట కవులు
- దేవులపల్లి సోదర కవులు - వీరు ముగ్గురు
ఆధునిక కాలంలో
- డాక్టర్ గరికిపాటి నరసింహారావు . వేయి మంది పృచ్ఛకులతో అవధానం చేసి 'మహా సహస్రావధాని' అనీ, ముందు చెప్పిన వేలాది పద్యాలు క్రమంలో మళ్ళీ చెప్పి 'ధారణా బ్రహ్మ రాక్షసుడు' అనీ బిరుదులు పొందాడు.
- డాక్టర్ మేడసాని కృష్ణమోహన్. (జననం ఏప్రిల్ 19, 1954) అష్టావధానాలు, శతావధానాలు, ఒక సహస్రావధానం చేశాడు. ఇటీవలే పంచసహస్రావధానం నిర్వహించి సాహితీ చరిత్రలో అపూర్వ ఘట్టాన్ని సాక్షాత్కరించాడు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ గా సేవలందిస్తున్నారు.
- డాక్టర్ మాడగుల నాగఫణి శర్మ. తెలుగులోను, సంస్కృతంలోను కూడా అవధానాలు నిర్వహించగల దిట్ట.
- కడిమళ్ళ వరప్రసాద్. అష్ట, శతావధానాలు నిర్వహించాడు. కోట లక్ష్మీనరసింహంతో కలిసి సహస్రావధానం నిర్వహించాడు.
- అష్టకల నరసింహరామ శర్మ. అవధాన ప్రక్రియపై విశేష పరిశోధన జరిపాడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. 150పైగా అవధానాలు చేశాడు .
- డాక్టర్ రాళ్ళబండి కవితా ప్రసాద్ వివిధ నూతన ప్రక్రియలు ప్రవేశపెట్టాడు.500పైగా అవధానాలు చేశాడు.
- డాక్టర్ ఆర్.గణేష్ 17పైగా భాషలలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. 8 భాషలలో 500పైగా అవధానాలు చేశాడు.