ఏ.పి.జె.అబ్దుల్ కలామ్
వికీపీడియా నుండి
పుట్టినరోజు: | అక్టోబర్ 15, 1931 |
---|---|
పుట్టిన ప్రదేశము: | ధనుష్కోడి, రామేశ్వరం, తమిళనాడు, భారత దేశము |
భారత రాష్ట్రపతి | |
పదవీ క్రమంలో: | 11 వ రాష్ట్రపతి |
పదవీ స్వీకారం: | జూలై 25, 2002 |
మునుపటి రాష్ట్రపతి: | కె.ఆర్.నారాయణన్ |
సాధారణంగా ఏ. పి.జె. అబ్దుల్ కలామ్ అని పిలవబడే డాక్టర్ అవుల్ పకిర్ జైనుల్ అబిదీన్ అబ్దుల్ కలామ్ (జననం అక్టోబర్ 15, 1931, రామేశ్వరం, తమిళనాడు, భారత దేశం), ప్రస్తుతం భారత రాష్ట్రపతి. అంతే గాక ఆయన భారత దేశపు ప్రముఖ శాస్త్ర వేత్త మరియు ఇంజనీరు కూడా.
[మార్చు] జీవితం
ప్రస్తుత తమిళనాడు రాష్ట్రంలోని ధనుష్కోడి లో ఒక మధ్యతరగతి ముస్లిమ్ కుటుంబంలో పుట్టిన ఆయన 1958 లో మద్రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగు లో పట్టా పుచ్చుకున్నాడు. పట్టభద్రుడైన తర్వాత ఆయన భారత దేశపు రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డి.ఆర్.డి.ఒ. లో ఒక విఫలమైన హోవర్ క్రాఫ్ట్ (hovercraft) ప్రాజెక్టు మీద పనిచేయడానికి చేరాడు. 1962 లో ఆయన (భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ)ఇస్రో కు మారాడు. అక్కడ ఆయన ఇతర శాస్త్ర వేత్తలతో కలసి అనేక కృత్రిమ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించాడు. భూమి నుంచి తక్కువ ఎత్తులో ఎగిరే (near earth orbit) రోహిణి ఉపగ్రహాన్ని జూలై 1980 లో విజయవంతంగా కక్ష్యలోకి వదిలిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III) ని అభివృద్ధి చేయడంలో ప్రాజెక్టు డైరెక్టరు గా ఆయన కృషి ఎంతో ఉంది.
1982 లో, ఆయన DRDO కు డైరెక్టరు గా తిరిగి వచ్చి, గైడెడ్ మిస్సైల్ (guided missile)ల మీద దృష్టి కేంద్రీకరించాడు. అగ్ని మరియు పృధ్వి మిస్సైళ్ళ అభివృద్ధి, ప్రయోగాలకు ఆయనే బాధ్యుడు. దీంతో ఆయనకు భారత దేశపు "మిస్సైల్ మాన్" అని పేరు వచ్చింది.
జూలై 1992 లో ఆయన భారత దేశపు రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారు అయ్యాడు. భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారుగా ఆయనకు క్యాబినెట్ మంత్రి హోదా వచ్చింది. ఆయన కృషి ఫలితంగానే 1998 లో పోఖ్రాన్-II అణుపరీక్షలు విజయవంతంగా జరిగాయి. ఈ అణు పరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చాయి.
భారత దేశపు మూడు అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ భూషణ్ (1981 లో); పద్మ విభూషణ్(1990 లో); మరియు భారత రత్న (1997 లో) లతో బాటు కనీసం ముప్ఫై విశ్వవిద్యాలయాలనుంచి గౌరవ డాక్టరేట్లు, పొందిన ఏకైక వ్యక్తి డా. కలామ్.
జూలై 18, 2002 న కలామ్ బ్రహ్మాండమైన మెజారిటీతో (90% పైగా ఓట్లతో)భారత రాష్ట్రపతిగా ఎన్నికై, జూలై 25న పదవీ స్వీకారం చేశాడు. ఆయన్ను ఆ పదవికి తమ అభ్యర్థిగా నిలబెట్టింది అప్పటి అధికార పక్షమైన నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (NDA) కాగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు పార్టీ తన మద్దతు తెలిపింది. ఆ పోటీలో ఆయన ఏకైక ప్రత్యర్థి వామపక్షవాదులు తమ అభ్యర్థిగా నిలబెట్టిన 87-ఏళ్ళ లక్ష్మీ సెహగల్, రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA)లో సుభాష్ చంద్ర బోస్ నాయకత్వం క్రింద మహిళా విభాగానికి నేతృత్వం వహించిన వీర వనిత గా ప్రసిద్ధురాలు.
కలామ్ శాకాహారం మాత్రమే తీసుకోవడం, మద్యపానానికి దూరంగా ఉండడం, బ్రహ్మచర్యం పాటించడం ద్వారా ఖచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణను పాటిస్తారు. ఆయన తన కుటుంబం విశ్వసించే ఇస్లామ్ పవిత్ర మతగ్రంథం ఖురాన్ తో బాటు, హిందువుల ప్రధాన పవిత్ర గ్రంథమైన భగవద్గీతను కూడా చదువుతాడు. ఇటీవల భారత దేశంలో (ముఖ్యంగా గుజరాత్ లో) తలెత్తిన మతఘర్షణలను ఆయన మాన్పివేయగలరని అందరూ ఆశిస్తున్నారు. కలామ్ తాను తిరుక్కురళ్ లో చెప్పిన మార్గాన్ని అనుసరిస్తున్నానని చాలా సార్లు పేర్కొన్నాడు. ఆయన దాదాపు తను చేసే ప్రతి ప్రసంగంలోనూ కనీసం ఒక్క"కురళ్" నైనా ప్రస్తావిస్తాడు.
కలామ్ రాజకీయంగా భారత దేశం అంతర్జాతీయ సంబంధాలలో మరింత దృఢమైన నిర్ణయాలు తీసుకుని నిర్ణయాత్మక పాత్ర పోషించాలని కోరుతున్నాడు. తాను సుదీర్ఘ కాలం కృషి చేసి అభివృద్ధి చేసిన అణ్వాయుధ కార్యక్రమం, కాబోయే ప్రపంచ ప్రబల శక్తిగా భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేసే సాధనాల్లో ఒకటిగా ఆయన భావిస్తున్నాడు.
ఆయన భారత దేశపు యువతను వెన్ను తట్టి ప్రోత్సహించే ఉద్దేశ్యంతో పాఠకుల్నిఉత్తేజితుల్ని చేసే తన ఆత్మ కథ వింగ్స్ ఆఫ్ ఫైర్ లాంటి పుస్తకాలు అనేకం వ్రాశాడు. 2020 సంవత్సరానికల్లా భారత దేశాన్ని ఒక వైజ్ఞానిక ప్రబల శక్తిగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను ఆయన చాలా బలంగా ముందుకు తెస్తున్నాడు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆయన చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. బయో ఇంప్లాంట్స్ (bio-implants) వాడడం ద్వారా తెలివిని పెంచడానికి ఒక పరిశోధనా కార్యక్రమాన్ని ఆయన ప్రతిపాదించాడు. ఆయన ప్రొప్రైటరీ సాఫ్టు వేర్ కంటే ఓపెన్ సోర్సు సాఫ్టు వేర్ నే సమర్థిస్తాడు. ఓపెన్ సోర్సు సాఫ్టు వేర్ ను పెద్ద ఎత్తున వాడడం ద్వారానే సమాచార విప్లవం ఫలాలు ఎక్కువ మందికి అందుతాయని ఆయన విశ్వాసం.
[మార్చు] పుస్తకాలు
- ఇండియా 2020 - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, వై.ఎస్.రాజన్ (పెంగ్విన్ బుక్స్ ఆఫ్ ఇండియా, 2003) ISBN 0140278338
- ఇగ్నైటెడ్ మైండ్స్: అన్లీషింగ్ ద పవర్ వితిన్ ఇండియా by ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (పెంగ్విన్ బుక్స్, 2003) ISBN 0143029827
- ఇండియా-మై-డ్రీం - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (Excel Books, 2004) ISBN 817446350X
- ఎన్విజనింగ్ ఎన్ ఎంపవర్డ్ నేషన్ : టెక్నాలజీ ఫర్ సొసైటల్ ట్రాన్స్ఫర్మేషన్ - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (టాటా మెక్‌గ్రా-హిల్ పబ్లిషింగ్ కంపెనీ లిమిటెడ్, 2004) ISBN 0070531544
- జీవితచరిత్రలు
- వింగ్స్ ఆఫ్ ఫైర్: ఎన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, అరుణ్ తివారీ (ఓరియంట్ లాంగ్మన్, 1999) ISBN 8173711461
- సైంటిస్ట్ టు ప్రెసిడెంట్ - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (గ్యాన్ పబ్లిషింగ్ హౌస్, 2003) ISBN 8121208076
- ఎటర్నల్ క్వెస్ట్: లైఫ్ అండ్ టైంస్ ఆఫ్ డా. అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం - ఎస్.చంద్ర (పెంటగాన్ పబ్లిషర్స్, 2002) ISBN 8186830553
- ప్రెసిడెంట్ ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ - ఆర్.కె.ప్రుథి (అన్మోల్ పబ్లికేషన్స్, 2002) ISBN 8126113448
- ఏ.పి.జె.అబ్దుల్ కలామ్: ది విజనరీ ఆఫ్ ఇండియా' - కె.భూషన్, జీ.కట్యాల్ (ఏ.పీ.హెచ్.పబ్లిషింగ్ కార్పోరేషన్, 2002) ISBN 817648380X
[మార్చు] బయటి లింకులు
మూస:వికివ్యాఖ్య
- భారత అధ్యక్షుని అధికారిక వెబ్సైట్లో కలామ్ గురించి
- అబ్దుల్ కలామ్ - 20వశతాబ్దములో ప్రముఖ తమిళులు
- రాష్ట్రపతిగా ఎన్నకైనప్పటి బీ.బీ.సీ వ్యాసము
- భారత అధ్యక్షుని అధికారిక వెబ్సైటు
ఇంతకు ముందు ఉన్నవారు: కె.ఆర్.నారాయణన్ |
భారత రాష్ట్రపతి 2002 జూలై 25 నుండి |
తరువాత వచ్చినవారు: --- |