క్రైస్తవ మతము
వికీపీడియా నుండి
క్రైస్తవ మతము
క్రైస్తవం ప్రపంచంలోని అతి పెద్ద మతం. క్రీస్తును కేంద్రగా చేసుకొని ఏక దైవారాధనను ప్రబోధిస్తుందీ మతం. నజరేయుడైన యేసు జీవితం అంటే ఆయన జననం, ప్రబోధం, శ్రమ, మరణ పునరుత్థానాల పై నిర్మించ బడిన తూర్పు దేశ మతం. పరిశుద్ధ గ్రంధమైన బైబిల్లోని రెండో భాగమైన క్రొత్త నిబంధనలో యేసు జీవితం, బోధలతొ పాటు క్రైస్త విశ్వాసానికి సంబంధించిన అనేక విషయాలు వివరించబడ్డాయి. యేసు దేవుని కుమారుడని, పాత నిబంధనలో ప్రవచింప బడిన మెస్సయ్యా అని క్రైస్తవులు నమ్ముతారు. 2001వ సంవత్సరపు అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తగా క్రైస్తవాన్ని అనుసరించే వాళ్ళు 210 కోట్ల మంది ఉన్నారు. అమెరికా, ఐరోపా ఖండాలలోనూ, ఫిలిప్పీన్ ద్వీపాలు, ఓషియానియాలో ఇంకా ఆఫ్రికా ఖండంలోని అత్యధిక భాగంలో క్రైస్తవం ప్రాముఖ్యమైన అతి పెద్ద మతం. ఆసియా ఖండంలో ప్రత్యేకించి చైనా, దక్షిణ కొరియాలోనూ, దక్షిణ ఆఫ్రికాలోనూ వేగంగా వ్యాప్తి చెందుతున్న మతం.
యేసు పునరుత్థానం చెందిన ఏభై రోజుల తర్వాత వచ్చిన పెంతెకోస్తు అనే పండుగ దినాన క్రైస్తవం ఒక సమాజంగా ఏర్పడిందని అపోస్తలుల కార్యాల గ్రంధం పేర్కొంటుంది. తొలుత యూదా మతంలో ఒక శాఖగా మొదలైన ఇది అనతికాలంలోనే ఒక ప్రత్యేక మతంగా ఆవిర్భవించింది. యూదుల మత గ్రంధమైన హెబ్రీ బైబిల్ను విశ్వసిస్తూ దాన్ని పాత నిబంధనగా క్రైస్తవులు పేర్కొంటారు. యూదా మరియు మహమ్మదీయ మతాలతో పాటు క్రైస్తవం కూడా “అబ్రహాము సంబంధిత" మతంగా పేర్కొన బడుతుంది. అపోస్తలుల కార్యాల గ్రంధం 11వ అధ్యాయం 26వ వచనం ప్రకారం అంతియొకయలోని శిష్యులు మొట్ట మొదటి సారిగా క్రైస్తవులని పిలువ బడ్డారు.
క్రైస్తవులని పిలువబడుతున్న వాళ్ళు సిద్ధాంత పరంగా, ఆచారాల పరంగా వేరు వేరు సమూహాలుగా తమలో తాము విడిపోయారు. డినామినేషనులు అని పిలువబడే ఈ క్రైస్తవ మత శాఖలను వారనుసరిస్తున్న సంప్రదాయాల ననుసరించి మూడు ప్రధాన శాఖలుగా విభజించొచ్చు 1. రోమన్ కతోలిక సంఘం 2. సనాతన తూర్పు సంఘం 3. ప్రొటెస్టెంట్ సంఘం.
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
వర్గాలు: మొలక | క్రైస్తవ మతము | మతములు