జగదేకవీరుని కధ
వికీపీడియా నుండి
జగదేకవీరుని కధ (1961) | |
దర్శకత్వం | కె.వి. రెడ్డి |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, బి. సరోజాదేవి |
సంగీతం | పెండ్యాల నాగేశ్వర రావు |
నిర్మాణ సంస్థ | విజయ ప్రొడక్షన్స్. |
భాష | తెలుగు |
[మార్చు] పాట వెనుక కథ
శివశంకరీ...శివానందలహరి పాట ఎంత పెద్ద విజయమో సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ పాట వెనుక ఎందరు హేమాహేమీలు శ్రమపడ్డారు. పాట రచయత పింగళి నాగేంద్రరావు, స్వరకర్త పెండ్యాల, గాత్రం అందించిన ఘంటసాల, దర్శకుడు కె.వి.రెడ్డిల సమష్టి కృషి ఫలితమే శివశంకరీ పాట. ఇందరు ప్రతిభావంతులు ఈ పాటకు చిత్రిక పడితే నటరత్న నందమూరి తారకరామారావు వెండితెరపై తన నటనతో జీవంపోశారు. దర్శకుడు కె.వి.రెడ్డి గారు అప్పటికే సినిమాలో అన్ని పాటల రికార్డింగ్, చిత్రీకరణ పూర్తి చేశారు. కధకు కీలకమైన సన్నివేశానికి సంబధించిన పాట మాత్రమే మిగిలి ఉంది. కధానాయకుడు తన గానంతో గండశిలను కరిగించే సన్నివేశంలో వచ్చే పాట అది. సన్నివేశాన్ని సంగీత దర్శకుడు పెండ్యాలకు కె.వి.రెడ్డి వివరిస్తూ ‘మనం ఇప్పుడు చేయాల్సిన పాట సినిమాకు గుండెకాయ లాంటిది. సంగీతంలో తాన్‌సేన్, ఓంకారనాథ్ ఠాగూర్ వంటి ఎందరో ప్రయోగాలు చేశారు. అంతెందుకు. నారద, తుంబురుల మధ్య వివాదం వచ్చినప్పుడు హనుమంతుడు పాడితే శిలలు కరిగాయట. అంతటి ఎఫెక్ట్ మన పాటకు తీసుకురావాలి. "జగదల ప్రతాప్" సినిమా మన కధకు ప్రేరణ. ఒకసారి ఆ సినిమా చూసి రండి’ అన్నారు. పెండ్యాల గారు చిన్నగా నవ్వి ‘ట్యూన్ మనం సొంతంగానే చేద్దాం’ అన్నారు. పింగళి వారు వెంటనే కలం పట్టి ‘శివశంకరీ శివానందలహరి’ అని రాసిచ్చారు. దానికి పెండ్యాల కూర్చిన దర్బార్ రాగం చివరకు ఓకే అయింది. మరుసటి రోజు పెండ్యాల వారు పూర్తి పాట రాసిచ్చారు. పెండ్యాల వారు పాడి వినిపించారు. పాట పూర్తయ్యే సరికి సరిగ్గా 13 నిమిషాలు పట్టింది. ఆరున్నర నిమిషాలకు పాట కుదించమని దర్శకుడు సూచించడంతో పెండ్యాల ఆ పాటను ఆరున్నర నిమిషాలకు కుదించి ఘంటసాల వెంకటేశ్వరరావుకు వినిపించారు. ఆయన ఆనందానికి అవధులు లేవు. ఈ పాట నేను తప్పనిసరిగా పాడతాను. ఎన్ని రిహార్సల్స్ అయినా సరే అంటూ 15 రోజుల పాటు ఘంటసాల రిహార్సల్స్‌కు హాజరయ్యారు. అనంతరం పాట రికార్డింగ్ కూడా పూర్తయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే పాటకు అనుగుణంగా ఎన్టీఆర్ చక్కటి హావభావాలు ప్రదర్శించవలసి ఉండడంతో ఆయన కూడా నాలుగు రోజుల పాటు రిహార్సల్స్ చేసారు. పాట చిత్రీకరణ సెట్స్ మీదకు వచ్చింది. ఎన్టీఆర్ పాటకు అనుగుణంగా చక్కని పెదాల కదలికతో యూనిట్ మొత్తాన్ని మంత్రముగ్ధుల్ని చేశారు. వెండితెరపై ఆ పాటకు, ఎన్టీఆర్ అభినయ కౌశలానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం 1961లో విడుదలైంది.