డిజిటల్ కంప్యూటర్
వికీపీడియా నుండి
అంక కలన యంత్రాలు (digital computers ఇప్పుడు బాగా వాడుక లోకి వచ్చేయి కనుక, ఇవేమిటో వివరించి చెప్పక్కరలేదు. మనం ఈ రోజుల్లో విస్తారంగా వాడే PC అనేది personal computer కి హ్రస్వ నామధేయం. వీటిని తెలుగులో సొంత కంప్యూటర్లు అని అనొచ్చు. మరి సొంతం కాని కంప్యూటర్లు ఏమిటో? పూర్వం ఈ కలన యంత్రాలు చాల భారీగా ఉండేవి. ఒకొక్క యంత్రానికి ఒకొక్క పెద్ద గది కావలసి వచ్చేది. పైపెచ్చు ఒకొక్కటి కోట్ల కొద్ది రూపాయలు ఖరీదు చేసేది. ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన అధిస్థాపన కనుక ఈ యంత్రాన్ని ఎంతోమంది ఉమ్మడిగా వాడుకొనే వారు. ఇటువంటి ఉమ్మడి యంత్రాలు ఇప్పుడూ ఉన్నాయి. ఇంటింటా సొంత గ్రంధాలయం ఉన్న నాడు ఊరిలో ఉన్న పెద్ద గ్రంధాలయం అవసరం ఎల తగ్గి పోతుందో అలాగే ఈ ఉమ్మడి కంప్యూటర్లని తోసిపుచ్చి ప్రతి ఇంటా సొంత కంప్యూటర్లు వెలిసేయి.
పెద్దదైనా, చిన్నదైనా కంప్యూటరు పనిచేసే పద్ధతి ఒక్కటే. సిద్ధాంతమూ ఒక్కటే. నేను కాలేజీలో చదువుకునే రోజుల నాటి పెద్ద కంప్యూటర్ల కంటె నేటి బుల్లి కంప్యూటర్లు చాల రెట్లు శక్తి వంతమైనవీ, చవకైనవీ.
కంప్యూటర్లని రెండు విభిన్న కోణాల నుండి అధ్యయనం చెయ్య వచ్చు. మనిషికి స్థూలమైన భౌతిక శరీరం, కంటికి కనిపించని సూక్ష్మమైన ఆత్మ ఉన్నట్లే కంప్యూటర్లకి స్థూలకాయం (హార్డ్‌వేర్), సూక్ష్మకాయం (software) అని రెండు భాగాలు ఉన్నాయి. సూక్ష్మ కాయం నివసించడానికి స్థూలకాయం కావాలి. అలాగే సూక్ష్మ కాయం లేక పోతే స్థూలకాయం ప్రాణం లేని కట్టె లాంటిది.