వేమూరి గగ్గయ్య
వికీపీడియా నుండి
వేమూరి గగ్గయ్య మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా నటుడు. దుష్టపాత్రలు ధరించేవాళ్లకు ప్రేక్షకాదరణా, ప్రేక్షకారాధనా వుండవన్న నిజాన్ని అబద్ధం చేసిన వేమూరి గగ్గయ్య నాటి చిత్రాల మహోజ్జ్వలతార! రౌద్రపాత్రధారణకు మార్గదర్శి.
ఈయన 15 ఆగస్టు 1895 తేదీన గుంటూరు జిల్లా వేమూరు లో జన్మించారు. సినిమాలలో రాక ముందు ప్రసిద్ధి చెందిన రంగస్థల నటుడైన గగ్గయ్య క్రూర పాత్రలకు పెట్టింది పేరు. సినిమా నటుడైన తర్వాత, ప్రేక్షకజనం విడిగా గగ్గయ్యని చూడాలని ఉబలాటపడేవారు, వెంటపడేవారు. అంతకు ముందు సినిమాలు చూసి వచ్చినవాళ్లు ఊరికే పేరు చెప్పుకుని ఊరుకునేవారు గాని గగ్గయ్యతో ఊరుకోలేదు. ఒక విధంగా తారారాధన గగ్గయ్యతోనే మొదలైందని చెప్పవచ్చు.
విషయ సూచిక |
[మార్చు] నాటక రంగంలో
ఆయన చిన్నతనంలో సంగీత సాధనతో మొదలైన కళాభిమానం - నటనవైపు తిరిగింది. తానుగా నటనను అభ్యసించి, ధాటిగా పెద్దశ్రుతితో పద్యాలు ఆలపించడంలో దిట్ట అనిపించుకుని సురభివారి నాటకాల్లో పాత్రలు ధరించడంతో నటజీవితం ఆరంభించారు గగ్గయ్య. నాటకాలతో ఊళ్లూ, దేశాలూ తిరిగారు. ఒక్క రంగూన్‌లోనే పదిమాసాలపాటు వుండి నాటకాలు ప్రదర్శించారుట!
తర్వాత తెనాలి వచ్చి ఫస్టుకంపెనీ అనే నాటక సంస్థలో చేరి, పాత్రధారణ చేశారు. మైలవరం కంపెనీ మహానందరెడ్డి బృందం గగ్గయ్యగారి నటనాశక్తిని బాగా వినియోగించుకున్నాయి. నాటకాల్లో నటిస్తున్నా సాధన మానలేదు. కంఠానికి పదునుపట్టి, తారాస్థాయిలో పద్యం చదవడం అలవాటు చేసుకున్నారు. మైకులూ, స్పీకర్లూ అన్నవి ఎరగని రోజులు గనక, పాత్రధారులందరూ గట్టిగా పద్యాలు చదవడం, సంభాషణలు చెప్పడం వున్నా - గగ్గయ్యగారి గాత్రం మాత్రం - ఎంత దూరానికో వినిపించేదట! దుష్టపాత్రలు అభినయించడం ఆరంభించిన దగ్గర్నుంచి ఆ పాత్రధారణకు ఆయనే సాటి! యముడుగానో, కంసుడుగానో, ఆయన రంగప్రవేశం చెయ్యడంతోటే - ప్రేక్షకులు కరతాళధ్వనులు చేసేవారు.
ఖంగుమనే కంఠంతో, ప్రతి అక్షరాన్నీ సుస్పష్టంగా పలుకుతూ, భావయుక్తంగానూ, రాగయుక్తంగానూ పాడి వన్స్‌మోర్‌లు కురిపించుకునేవారు వేమూరివారు. ఆయనది పెద్ద శరీరం కాదు, కాని పాత్రలో గంభీరాకృతితో ‘పర్వతప్రమాణం’లో కనిపించేవారు. కళ్లు పెద్దవి శరీరం కాదు, కాని పాత్రలో కణకణలాడుతున్న చింతనిప్పుల్లా - అంతంత కళ్లు కనిపించేవి. అందుకనే అందరూ ముందు వరుసల్లో కూచునే గగ్గయ్య నాటకాలు చూడాలని చెప్పుకునేవారు.
నాటకంలో ఎవరున్నా లేకపోయినా, గగ్గయ్య వున్నారని తెలిస్తే చాలు - గ్రామాలనుంచి ప్రజలు బళ్లమీద తరలివచ్చేవారనీ, నాటకాల్లో నటిస్తున్నప్పుడే ఆయనకు ‘స్టేజిస్టార్’గా గుర్తింపు వుండేదనీ, - చెబుతారు. రంగస్థలంమీద ధరించిన క్రూరపాత్రలే సినిమాల్లోనూ వరించాయి. ఆ పాత్రలకి గగ్గయ్య, గగ్గయ్యకి ఆ పాత్రలూ అలా ఇమిడిపోయాయి.
[మార్చు] సినీ జీవితం
[మార్చు] మొదటి సినిమా
ఈస్టిండియావారి సావిత్రి (1933)లో యమధర్మరాజు పాత్రతో గగ్గయ్య సినిమారంగప్రవేశం జరిగింది. ఆయన సావిత్రి నాటకంలో యముడిపాత్ర సమర్థంగా పోషించారు గనక, సినిమాల్లోకి తీసుకున్నారు. ఆచిత్రంలోని పో బాల పొమ్మికన్, ఈ మృగారణ్యమున రావలదు, రా తగదు, రాచనదు పో బాల పొమ్మికన్ అని లయబద్ధంగా మాటలు విరుస్తూ విసుర్తూ కోపకంఠంతో సావిత్రిని ఉద్దేశిస్తూ పాడిన పాటకి - ప్రేక్షకులు లయబద్ధంగా చప్పట్లు కొట్టి వెర్రెత్తిపోయారు. అది సినిమా అని తెలిసినా, ఆయన చదివిన పద్యాలకి ‘వన్స్‌మోర్’లు కొట్టారు. ఆ చిత్రం తొలి తెలుగు చిత్రం భక్తప్రహ్లాద (1931) కంటే విజయవంతం కావడంతో ప్రజల పాలిట యముడైన యమధర్మరాజు ప్రేక్షకులకు చేరువైనాడు!
[మార్చు] ఇతర సినిమాలు
శ్రీకృష్ణలీలలు (1935)లో కంసుడి పాత్ర ఇంకా ఆకర్షించింది. ధిక్కారమును సైతునా కుటిలజనధిక్కారము సైతునా అని కంసుడి క్రోధకంఠంతో పాడిన పాటను ప్రజలు పాడుకునేవారు. ద్రౌపదీ వస్త్రాపహరణం (1936) లో శిశుపాలుడుగా ఆయన స్నానంబు సలుపు లేజవరాండ్ర చీరెలు కాజేసినందుకా అని చదివిన పద్యాలూ, చెప్పిన సంభాషణలూ ఆ సినిమాలు చూసినవారందరికీ ఇంకా గుర్తున్నాయి. సతీ తులసి (1936) లో జలంధరుడు, భక్త మార్కండేయ (1936)లో యముడు, జరాసంధ (1938) లో జరాసంధుడు, మైరావణ (1940)లో మైరావణుడు, దక్షయజ్ఞం (1941) లో దక్షుడు, భక్తప్రహ్లాద (1942) లో హిరణ్యకశిపుడు - ఇలా అన్ని క్రూరపాత్రలూ ఆయనే.
అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా తొలిచిత్రం సీతారామ జననం (1944) లో గగ్గయ్య రెండు పాత్రలు ధరించారు - రావణుడూ, పరశురాముడూ. నాటకాల్లో నటిస్తున్నప్పుడే ఆయన పద్యాల్నీ, పదాల్నీ గ్రామఫోను కంపెనీలు రికార్డు చేసి, విరివిగా అమ్మి విపరీతంగా సొమ్ముచేసుకున్నాయి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా - అవే సినిమా పాటలు మళ్లీ రికార్డులుగా వస్తే అవీ అలాగే ఆకర్షించాయి. మొదట్లో ఆయన హరికథలు కూడా చెప్పేవారనీ, సినిమా నటుడైన తర్వాత కూడా చెప్పేవారనీ ఆయన్ని ఎరిగివున్నవాళ్లు చెబుతారు.
[మార్చు] స్వభావం
అంతటి క్రూరపాత్రధారీ బయట మాత్రం సౌమ్యుడు! మామూలు మాట అతి సరళం. గగ్గయ్యగారి కుమారుడు రామయ్య కూడా ప్రసిద్ధుడైన రంగస్థల నటుడు. చిత్రాల్లో కూడా నటించారు. గగ్గయ్యగారు ధరించిన పాత్రలకీ, ఆయన గుణగణాలకీ ఏమీ సంబంధం లేదనీ, ఎన్నో గుప్తదానాలు చేశారనీ, ఎందరో పేదవారి పిల్లలకి చదువు చెప్పించారనీ - రామయ్య చెబుతూవుంటారు. విశేషంగా కనిపించేది ఏమిటంటే - ఎక్కువగా దైవదూషణ చేసే పాత్రలే ధరించినా, గగ్గయ్య గొప్ప దైవభక్తుడు. దైవకార్యాలమీద అమిత శ్రద్ధాభక్తులుండేవి. దైవకార్యాల నిమిత్తం ఎవరొచ్చి ఏమి అడిగినా సంతోషంగా సహాయం చేసేవారు.
ఆ రోజుల్లో ఎవరైనా గట్టిగా మాట్లాడితే ‘గగ్గయ్య కంఠం’ అనేవారు. కోపిష్టి గురించి చెప్పడంలో ‘ఆయనా? కోపంలో గగ్గయ్యే!’ అనేవారు. అలా కోపానికీ, గంభీరకఠానికీ గగ్గయ్య మారుపేరుగా కీర్తిపొందారు. ఆయన పెద్దగా చదువుకోలేదు. కాని, నాటకాలకు జీవితాన్ని మళ్లించుకున్న తర్వాత, కావ్యాలూ, ప్రబంధాలూ, పురాణాలూ చదివి భాషనీ, భావాన్నీ క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు.
తమిళనాటకాల్లో క్రూరపాత్రధారుల్లో మేటి అనిపించుకున్న ఆర్.యస్. మనోహర్, తనకి తెలుగు రాకపోయినా గగ్గయ్య నాటకాలు చూసే తాను ప్రభావితుడినయ్యాననీ - తన రౌద్రపాత్రధారణకు ఆయనే స్ఫూర్తి అనీ - చెప్పడం ఘనత
[మార్చు] మరణం
30 డిసెంబర్ 1955 తేదీన సహజ మరణం పొందినప్పుడు అటు నాటకరంగం, ఇటు సినిమారంగం, ప్రేక్షక సమూహం ఎంతగానో విలపించాయి.
[మార్చు] నటించిన సినిమాలు
- భక్త శిరియాళ (1948)
- గరుడ గర్వభంగం (1943)
- భక్త ప్రహ్లాద (1942)
- సీతారామ జననం(1942) ---> రావణాసురుని పాత్ర
- దక్షయజ్ఞం(1941)
- చండిక (1940) ---> గిరిరాజు పాత్ర
- మైరావణ (1940)
- జరాసంధ (1938)
- మార్కండేయ (1938)
- మోహినీరుక్మాంగద (1937)
- ద్రౌపదీ వస్త్రాపహరణం (1936) ---> శిశుపాలుని పాత్ర
- సతీ తులసి (1936)
- శ్రీకృష్ణ లీలలు (1935) ---> కంసుని పాత్ర
- సీతా కల్యాణం (1934)
- సావిత్రి (1933) ---> యముని పాత్ర