శారదా చట్టం
వికీపీడియా నుండి
బాల్య వివాహాలను నిషేధిస్తూ భారత ప్రభుత్వం చేసిన చట్టమే, శారదా చట్టం. 1927 లో హర్‌బిలాస్ శార్‌దా (Harbilas Sarda) అనే ప్రైవేటు సభ్యుడు అప్పటి కేంద్ర శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు తదుపరి చట్టంగా రూపొందింది. ఆయన పేరు మీద దీనికి శారదా చట్టం అనే పేరు వచ్చింది.
విషయ సూచిక |
[మార్చు] నేపథ్యం
పూర్వం భారత్‌లో బాల్యవివాహాలు విస్తృతంగా జరిగేవి. ఊహ తెలియని పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు జరిగేవి. 1921 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశంలో 12 'నెలల' లోపు వయసు గల పెళ్ళయిన ఆడపిల్లలు 600 మంది ఉన్నారని తేలింది. ఈ వార్తకు నిర్ఘాంతపోయిన మహాత్మా గాంధీ దీన్ని నిషేధించే విధంగా ఒక బిల్లును ప్రవేశపెట్టాలని అప్పటి కేంద్ర శాసనసభ సభ్యుడైన హర్‌బిలాస్ శార్దా ను కోరాడు[1]. (అప్పటికే కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంఘసంస్కర్తలెందరో బాల్య వివాహాల నిషేధానికై కృషి చేస్తూ ఉన్నారు.) ఆ విధంగా గాంధీ సూచనపై 1927 ఫిబ్రవరి 1 న కేంద్ర శాసనసభలో బాల్య వివాహాల నిరోధ చట్టం ప్రవేశపెట్టబడింది. అదే శారదా చట్టం. 1929 సెప్టెంబర్ 19 న ఈ బిల్లు సభ ఆమోదం పొంది, చట్టమయింది. 1930 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చింది.
[మార్చు] చట్టం వివరాలు
ఈ చట్టం ప్రకారం బాలురకు 18 ఏళ్ళు, బాలికలకు 14 ఏళ్ళు పెళ్ళి వయసుగా నిశ్చయించింది. అయితే బాల్య వివాహాలను నిషేధించలేదు. ఇది కేవలం 'నిరోధ' చట్టం మాత్రమే. ఆ తరువాత ఈ చట్టాన్ని మూడు సార్లు సవరించారు. 1949 లో బాలికల వయసు 15 ఏళ్ళుగాను, 1956 లో 16 ఏళ్ళుగాను సవరించారు. చివరగా 1978 లో బాలుర వయసు 21 ఏళ్ళు గాను, బాలికల వయసు 18 ఏళ్ళు గాను సవరించారు.
[మార్చు] చట్టం పరిణామాలు
ఈ చట్టం కేవలం నిరోధకమే గాని బాల్య వివాహాలు జరిపించే వారిని శిక్షించే వసతులు ఇందులో లేవు. అందుచేత బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టలేక పోయింది. శారదా చట్టం అనేక విమర్శలు ఎదుర్కొంది. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో జరిగిన ఒక సదస్సుకు యావద్భారతం నుంచి 500 మందికి పైగా పండితులు హాజరయ్యారు. వల్లూరి సూర్యనారాయణరావు (1866-1937) ఆ సదస్సు తీర్మానాలపై అప్పట్లో సంధించిన విమర్శనాస్త్రం 2006 ఫిబ్రవరి 25న ఆంధ్రజ్యోతిలో తిరిగి ప్రచురితమైంది.