సుమన్
వికీపీడియా నుండి
సుమన్ గా తెలుగు సినిమాకు సుపరిచితుడైన సుమన్ తల్వార్ (1959, ఆగష్టు 28) తెలుగు సినీరంగ నటుడు. ఈయన నీచల్ కులం సినిమాతో రంగప్రవేశము చేసి తెలుగు, తమిళ, కన్నడ మరియు ఆంగ్ల భాషలలో 150కి పైగా సినిమాలలో నటించాడు.
కరాటే (షాట్‌కన్ శైలి)లో నిష్ణాతుడైన సుమన్ తెలుగులో పెద్ద యాక్షన్ హీరో అయ్యాడు. ఈయన అన్నమయ్య సినిమాలో పోషించిన వెంకటేశ్వర స్వామి పాత్ర, శ్రీరామదాసు చిత్రములో పోషించిన రాముని పాత్ర మరపురానివి.
సుమన్ 1959, ఆగష్టు 28న మద్రాసులో జన్మించాడు. ఈయన తల్లి, కేసరీ చందర్ మద్రాసులోని యెతిరాజు మహిళా కళాశాలకు ప్రిన్సిపాలుగా పనిచేసినది. తండ్రి సుశీల్ చందర్ మద్రాసులోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లో పనిచేసేవాడు. వీరి స్వస్థలము మంగుళూరు. మాతృభాష తుళు. సుమన్ బాల్యములో మద్రాసులోని చర్చ్‌పార్క్ కాన్వెంటులో కిండర్గార్టెన్ చేరాడు. పాఠశాల విద్య బీసెంట్ థియొసోఫికల్ ఉన్నత పాఠశాలలో జరిగినది. ఆ తరువాత పచ్చయప్ప కళాశాలలో ఆంగ్ల సాహిత్యములో బీ.ఏ పట్టభదృడయ్యాడు. ఈయన తుళు, ఆంగ్లము, తమిళము, తెలుగు,కన్నడ మరియు హిందీ బాషలలో ధారాళంగా మాట్లాడగలడు. సుమన్ హెచ్.ఏ.ఎస్.శాస్త్రి వద్ద సంస్కృతము అభ్యసించాడు. ఇవేకాక ఈయన వీణ మరియు గిటార్ లను వాయించగలడు. ఈయనకు కరటే లో బ్లాక్‌బెల్ట్ ఉన్నది. అంతేకాక ఈయన గోపాల్ గురుక్కళ్ వద్ద కలరిపయట్టు అభ్యసించాడు.
హైదరాబాదులో స్థిరపడిన సుమన్ ప్రముఖ తెలుగు నాటక రచయిత డి.వి.నరసరాజు యొక్క మనుమరాలు శిరీషను వివాహము చేసుకొన్నాడు. వీరికి ఎనిమిదేళ్ల పాప, అఖిలజ ప్రత్యూష.