కోరాడ నరసింహారావు
వికీపీడియా నుండి
కోరాడ నరసింహారావు ప్రఖ్యాత కూచిపూడి నాట్యాచార్యుడు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని పవర్‌పేట వాస్తవ్యుడైన కోరాడ సామాన్య రైతు కుటుంబంలో జన్మించి, 12 ఏటనే పలు నాట్యరీతులను ఆకళింపు చేసుకున్నాడు. 1960లలో ప్యారిస్‌లో జరిగిన విశ్వ నాట్యోత్సవాలలో కోరాడ ప్రదర్శించిన కూచిపూడి దశావతారాల ప్రదర్శనకు ప్రపంచ ఉత్తమ పురుష నర్తకుడిగా బహుమతి పొంది జగద్విఖ్యాతుడయ్యాడు.
కోరాడ నరసింహారావు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ వంటి ప్రముఖుల సమక్షంలో నాట్యం చేయడమే కాక 23 దేశాల్లో కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించాడు. భారతదేశ మొట్టమొదటి మిస్ ఇండియా 'పద్మభూషణ్' ఇంద్రాణి రెహమాన్, పద్మ విభూషణ్ యామిని కృష్ణమూర్తి, వైజయంతి మాల, రీటా చటర్జీ, గోపీకృష్ణ, హేమమాలిని, శాంతారామ్‌లకు కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇచ్చాడు. గిరిజా కళ్యాణం, వేదాంతం రాఘవయ్య నిర్మించిన రహస్యం చిత్రాల్లో నటించారు. కోరాడ నరసింహారావును భరత కళాప్రపూర్ణ, కళాసరస్వతి లాంటి బిరుదులతో పాటు కేంద్ర, ర్రాష్ట ప్రభుత్వాలు అనేక సత్కారాలు, పురస్కారాలతో గౌరవించాయి. నాట్యరంగంలో ఆయన విశిష్ట సేవలకు గాను కేంద్ర సంగీత నాటక అకాడమీ 2005 అవార్డును రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా 2006 మార్చి 20వ తేదీన న్యూఢిల్లీలో అందుకున్నారు.
కోరాడ తీవ్ర అస్వస్థతతో 2007 జనవరి 4 రాత్రి హైదరాబాదులో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.