పాకాల తిరుమల్ రెడ్డి
వికీపీడియా నుండి
పాకాల తిరుమల్ రెడ్డి చిత్రకళారంగంల పి.టి.రెడ్డి గా చిరపరిచితుడు. చిత్రకళారంగంల అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ప్రముఖులల్ల పి.టి.రెడ్డి ముఖ్యుడు.ఆరు దశాబ్దాలుగా చిత్రకళారంగంల అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు ఆయన. మరణించే వరకు కుంచెలను రంగరించిన తెలంగాణ చిత్రకారుడాయన. కరీంనగర్ జిల్లా అన్నవరం గ్రామంల 1915 జనవరి 4న జన్మించిండు. 1942ల బొంబాయి సర్ జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి చిత్రకళల మొదటి ర్యాంకుతో డిప్లొమా పొందిండు. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాలల్లనే కాక ఆస్ట్రేలియా, యు.కె, జపాన్, పశ్చిమ జర్మనీ తదితర విదేశాల్లో సైతం చిత్రకళాప్రదర్శనలు నిర్వహించిండు.
ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీ విశిష్ట సభ్యునిగా, కార్యదర్శిగా, అధ్యక్షుడిగా అనేక హోదాల్ల పని చేసిండు. అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులెన్నో అందుకున్నడు. హైదరాబాదులోని నారాయణగూడా లోని తన నివాసాన్ని ఒక పెద్ద చిత్రకళా ప్రదర్శనా నిలయంగా తీర్చిదిద్దిన పి.టి.రెడ్డి చిరస్మరణీయుడు. తెలంగాణ జీవితం, ఘర్షణ, పల్లెటూరు రైతు, చిక్కిన స్త్రీ, ఆందోళనలు అన్నీ కలిసిపోయిన రంగుల నైపుణ్యం ఆయనది. హైదరాబాద్, బొంబాయి వీధులు, ఆర్థిక, రాజకీయ, సాంఘిక ప్రభావాలు, మార్మిక, తాంత్రిక, శృంగార భావనల సమ్మిశ్రితం ఆయన కళ. కర్రతో,రాతితో ఆయన మలిచిన శిల్పాలు ప్రత్యేకం. అక్టోబర్ 21,1996న ఆయన మరణించిండు.