వల్లంపాటి వెంకటసుబ్బయ్య
వికీపీడియా నుండి
వల్లంపాటి వెంకటసుబ్బయ్య ప్రముఖ సాహితీ విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
వల్లంపాటి 1937 మార్చి 15 న చిత్తూరు జిల్లా రొంపిచర్ల లో జన్మించాడు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా వృత్తిని ప్రారంభించి, ఇంగ్లీషులో ఎం.ఏ చేసి, తరువాత హైదరాబాదు లోని సెంటర్ ఫర్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ నుంచి ఎం.లిట్ పొందాడు. మదనపల్లె బీసెంట్ థియేసాఫికల్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసాడు.
వల్లంపాటి కథకుడిగా తన రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టాడు. పరిష్కారం, మిథ్య మొదలైన కథానికలు 40 దాకా ప్రచురించాడు. ఆయన రాసిన ఇంధ్రధనస్సు, దూర తీరాలు నవలలు ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో బహుమతులు పొందాయి. వల్లంపాటి సాహితీ విమర్శకుడిగా సుప్రసిద్ధుడు. ఆయన రాసిన కథా శిల్పం, నవలాశిల్పం, విమర్శా శిల్పం పుస్తకాలు తెలుగు సాహిత్య విమర్శకు ప్రామాణికాలు. అనువాదకుడిగా కుడా ఆయన ప్రసిద్ధుడే. ఇంగ్లీషు నుంచి, కన్నడం నుంచి తెలుగులోకి ఎన్నో గ్రంధాలు, కథలను అనువదించాడు. తస్లీమా నస్రీన్ రచించిన లజ్జ, బ్రిటిష్ రచయిత ఇ.హెచ్.కార్ రచించిన చరిత్ర అంటే ఏమిటి...? ఆయన చేసిన అనువాద రచనలలో కొన్ని.
ఆయన రాసిన కథాశిల్పం రచనకు 1999 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇదే పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథంగా ఎంపిక చేసి, సత్కరించింది.
2007 జనవరి 2 న వల్లంపాటి మదనపల్లెలో మరణించాడు.