ఆంధ్ర ప్రదేశ్ జల వనరులు
వికీపీడియా నుండి
సహజ సిద్ధమైన జలవనరుల విషయంలో భారత దేశంలోని సుసంపన్నమైన రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ ఒకటి. కృష్ణా, గోదావరి వంటి పెద్ద నదులతో పాటు, మంజీర, శబరి, పెన్న వంటి చిన్న నదులు రాష్ట్రానికి నీటి అవసరాలను తీరుస్తున్నాయి. వందలాదిగా ఉన్న వాగులు, వంకలు కూడా సహజ సిద్ధ జలవనరులలో ముఖ్యమైనవి.
వీటికి తోడు వేలాది మానవ నిర్మిత జలవనరులు కూడా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. శతాబ్దాల క్రితం ఆనాటి పాలకులు తవ్వించిన చెరువులు ఈనాటికీ ప్రజావసరాలను తీరుస్తున్నాయి. కాకతీయులు, విజయనగర రాజులు తవ్వించిన చెరువులు ఈనాటికీ ఉపయోగంలో ఉన్నాయి.
ఆధునిక కాలంలో సహజ సిద్ధమైన జలవనరులను ప్రభావవంతంగా వాడుకొనేందుకు ప్రభుత్వాలు ఎన్నో బృహత్పథకాలను చేపట్టి విజయం సాధించాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఇటువంటి పెద్ద ప్రాజెక్టులే. ఇంకా ఎన్నో ఇతర ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో నిర్మాణంలో ఉన్నాయి.
అలాగే వర్షపు నీటిని వృధాగా పోనీయకుండా చిన్న ఆనకట్టలు కట్టి ప్రజల తాగినీటి, సాగునీటి అవసరాలను తీర్చే మార్గాలను కూడా అనుసరిస్తున్నారు. చెక్‌డాములు, వాటర్‌షెడ్లు ఈ కోవ లోకి వస్తాయి.
జలవనరులను ముఖ్యంగా రెండు భాగాలుగా విభజించవచ్చు. అవి:
- సహజ వనరులు
- నదులు, వాగులు, వంకలు
- మానవ నిర్మిత వనరులు
- చెరువులు, దొరువులు, బావులు, నూతులు, చెక్‌డాములు, వాటర్‌షెడ్లు, కాలువలు, నదీలోయ ప్రాజెక్టులు