ఆంధ్ర ప్రదేశ్
వికీపీడియా నుండి
ఆంధ్ర ప్రదేశ్ | |
రాజధాని - Coordinates |
హైదరాబాదు - |
పెద్ద నగరము | హైదరాబాదు |
జనాభా (2001) - జనసాంద్రత |
75,727,000 (5వది) - 275/చ.కి.మీ |
విస్తీర్ణము - జిల్లాలు |
275,068 చ.కి.మీ (4వది) - 23 |
సమయ ప్రాంతం | IST (UTC +5:30) |
అవతరణ - గవర్నరు - ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
నవంబర్ 1 1956 - రామేశ్వర్ ఠాకూర్ - వై. యస్. రాజ శేఖర్ రెడ్డి - ఒకేసభ (294) |
అధికార బాష (లు) | తెలుగు, ఉర్దూ |
పొడిపదం (ISO) | IN-AP |
వెబ్‌సైటు: www.aponline.gov.in | |
ఆంధ్ర ప్రదేశ్ రాజముద్ర |
ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం లోని ఒక రాష్ట్రం. దీనికి ఉత్తరాన మహారాష్ట్ర, చత్తీసుగఢ్, ఒరిస్సా రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ భారత దేశంలో ఐదవ అతి పెద్ద రాష్ట్రమై ఉత్తర, దక్షిణాలకు వారధిలా వ్యవహరిస్తున్నది. ఈ రాష్ట్రం లోని ముఖ్యమైన నదులు గోదావరి, కృష్ణ.
ఆంధ్రప్రదేశ్ 12o37', 19o54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76o46', 84o46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82o30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ గుండా పోతుంది.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
- ప్రధాన వ్యాసము: ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
ఆంధ్రులు వింధ్యపర్వత దక్షిణ భాగానికి తరలి వెళ్ళి, ద్రావిడులతో కలసిన ఆర్యులుగా క్రీ.పూ. 7వ శతాబ్దపు సంస్కృత రచనలు వర్ణిస్తున్నాయి. మౌర్య చక్రవర్తి అశోకుని మరణానంతరం (క్రీ.పూ 232) ఆంధ్రులు ప్రసిద్ధికెక్కారు. నవీన చరిత్రకారులు ఆంధ్రుల చరిత్ర ఆనాటినుండి మొదలైనట్లుగా లెక్కిస్తున్నారు. ఆంధ్ర (శాతవాహన), శాక, ఇక్ష్వాకు, తూర్పు చాళుక్య, కాకతీయ, విజయనగర, కుతుబ్ షాహి, హైదరాబాదు నిజాం లు మొదలైన వంశాలకు చెందిన రాజులు ఆంధ్ర దేశాన్ని పరిపాలించారు. క్రీ.శ 17వ శతాబ్దములో బ్రిటీషు వారు కోస్తా ఆంధ్రను నిజామ్ వద్ద గెలుచుకొని మద్రాసు రాష్ట్రములో(మద్రాసు ప్రెసిడెన్సీ) కలుపుకున్నారు. హైదరాబాదు నిజామ్ బ్రిటిషు ఆధిక్యతను గుర్తించి తెలంగాణ ప్రాంతానికి పరిమితమైనారు.
[మార్చు] భారత దేశ స్వాతంత్రానంతరము
1947లో భారత దేశానికి ఆంగ్లేయుల నుండి స్వాతంత్రం వచ్చిన తరువాత నిజాము, హైదరాబాదు సంస్థానాన్ని తమ పాలనలోనే ఉంచుకోవటానికి ప్రయత్నించాడు. పోలీసు చర్య ద్వారా హైదరాబాదు 1948లో భారత దేశంలో విలీనమై, హైదరాబాదు రాష్ట్రంగా అవతరించింది.
అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్ష, ఫలితంగా ఆయన మరణంతో, ప్రత్యేక రాష్ట్ర పోరాటం ఒక కొలిక్కి వచ్చి 1953 అక్టోబర్ 1న మద్రాసు రాష్ట్రంలోని ఉత్తరాన ఉన్న 11 జిల్లాలను కలుపుకొని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. కర్నూలును రాజధానిగ చేసి, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేసారు. టంగుటూరి ప్రకాశం పంతులు మొట్టమొదటి ముఖ్యమంత్రి.
ఆంధ్ర ప్రజల కోరికపై 1956, నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రం లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను హైదరాబాదు రాష్ట్రంలో కలిపి ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చేసారు. కొత్త రాష్ట్రానికి హైదరాబాదు రాజధానిగా అవతరించింది. 1960 వ సంవత్సరంలో పటాస్కర్ కమీషన్ తీర్పుమూలంగా చిత్తూరు జిల్లా తిరుత్తణి తాలూకాలోని ఎక్కువ భాగాన్ని తమిళనాడు కిచ్చేసి, తమిళనాడుకు చెందిన తిరువళ్లూర్ తాలూకాలోని కొన్ని గ్రామాలను ఆంధ్ర ప్రదేశ్ లో చేర్చారు. ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భవించినప్పుడు 20 జిల్లాలే ఉన్నాయి. తరువాత, 1970 ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా, 1978 ఆగష్టు 12న రంగారెడ్డి జిల్లా, 1979 జూన్ 1న విజయనగరం జిల్లాలు ఏర్పడడంతో మొత్తం 23 జిల్లాలయ్యాయి.
[మార్చు] రాజకీయాలు
నీలం సంజీవరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రి. 1982 వరకు అన్నీ కాంగ్రెసు ప్రభుత్వాలే ఆంద్ర ప్రదేశ్ ను పరిపాలించాయి. 1982 వరకు కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలము పనిచేసారు. ఆయన తరువాత పి.వి.నరసింహారావు ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేసారు. తరువాతి కాలంలో ఆయన భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసారు
అయితే 1982 వరకు రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెసుకు ఉన్న బలాన్ని సవాలు చేయటానికి నందమూరి తారక రామారావు అదే సంవత్సరములో తెలుగుదేశం అనే పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. స్థాపించిన తొమ్మిది నెలలలోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టడంతో ఒక బుడతడి దెబ్బకు వస్తాదు కుప్పకూలినట్లయింది.
భారత జాతీయ కాంగ్రెసు(భాజాకా) కు చెందిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి. 2004 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉధృతంగా పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అనే కొత్త పార్టీతో కలిసి పోటీ చేసింది. కాంగ్రెసు, తెరాస కూటమి పదవిలోకి రావడముతో, తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
[మార్చు] భౌగోళిక పరిస్థితి
ఆంధ్ర ప్రదేశ్ లో మూడు ముఖ్య ప్రాంతములు కలవు: కోస్తా ఆంధ్ర, తెలంగాణ మరియు రాయలసీమ. రాష్ట్రములో 23 జిల్లాలు కలవు. హైదరాబాదు, రాష్ట్ర రాజధాని మరియు అతి పెద్ద నగరము. ఇతర ముఖ్య నగరాలు కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ, కడప, తిరుపతి మరియు గుంటూరు. గోదావరి, కృష్ణ వంటి మహానదులు రాష్టంలో ప్రవహిస్తూ కొన్ని లక్షల హెక్టేరుల భూమి సాగు చేయుటకు తోడ్పడుతున్నాయి.
[మార్చు] శాసన వ్యవస్థ
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ లో 294 స్థానాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ కు పార్లమెంటులో 60 సీట్లు కలవు - రాజ్యసభలో 18 మరియు లోక్‌సభ లో 42.
[మార్చు] జిల్లాలు
ఆంధ్ర ప్రదేశ్ లో 23 జిల్లాలు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు చూడండి.
కడప జిల్లా సమాచారం కోసం కడప సమాచార సర్వస్వంచూడండి.
[మార్చు] ఆర్ధిక రంగము
రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు వ్యవసాయం ఆయువుపట్టు. భారత దేశములోని రెండు ప్రధాన నదులు గోదావరి మరియు కృష్ణ రాష్ట్రం గుండా ప్రవహిస్తాయి. వరి, పొగాకు, ప్రత్తి, మిర్చి, మరియు చెరుకు రాష్ట్రంలో పండించే ముఖ్యమైన పంటలు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు బయోటెక్నాలజీ రంగాల్లో కొత్తపుంతలు తొక్కుతున్నది.
హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని. భారత దేశము లోనే ఐదవ పెద్ద అంతర్జాతీయ నగరము, మేలైన సంస్కృతి, ధీటైన చరిత్ర మరియు పరిశ్రమాభివృద్ధి, సాంప్రదాయము మరియు సాంకేతిక పరిజ్ఞానము సహజీవనము సాగించే విభిన్నమైన అతి కొద్ది నగరములలో హైదరాబాదు ఒకటి. గతిశీల నాయకత్వంతో రాష్ట్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఫార్మసూటికల్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్, నిర్మాణము తదితర రంగాల్లో దేశాన్ని కొత్త పరిమాణములోకి నడుపుతూ అపరిమిత వ్యాపార అవకాశాలకు ఆలవాలముగా ఉద్భవించుచున్నది.
[మార్చు] సంస్కృతి
తెలుగు రాష్ట్ర అధికార భాష. ఉర్దూ మాట్లాడే ముస్లిం మైనారిటీ ముఖ్యంగా హైదరాబాదులో నివసిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కు గొప్ప సాంస్కృతిక వారసత్వము కలదు. అన్నమాచార్య, త్యాగరాజు తదితర గొప్ప కర్నాటక సంగీతకారులు తెలుగు భాషలో కృతీకరించి, భాషను ఇనుమడింప చేశారు.
నన్నయ, తిక్కన్న, మరియు ఎర్రాప్రగడ (కవిత్రయము) మహా భారత మహా కావ్యాన్ని తెలుగులోకి అనువదించారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు శ్రీ విశ్వనాధ సత్యనారాయణ, డా. సి. నారాయణ రెడ్డి మొదలైనవారు తెలుగులో ఆధునిక రచయితలు.
కూచిపూడి రాష్ట్ర శాస్త్రీయ నృత్యం.
ఆంధ్రులు గత 40 సంవత్సరాలుగా సినిమాను విపరీతముగా పెంచి పోషించారు. రాష్ట్రంలో సంవత్సరానికి సుమారు 70 సినిమాలు ఉత్పత్తి అవుతాయి. ఆదాయపరంగా తెలుగు సినిమా ఒక పెద్ద పరిశ్రమ, కానీ తక్కిన భారత దేశములో పెద్దగా గుర్తింపు పొందలేదు. రాష్ట్రం నుండి ఉద్భవించిన కొందరు ప్రముఖ కళాకారులు ఎన్.టి.రామారావు (మాజీ ముఖ్యమంత్రి), అక్కినేని నాగేశ్వరరావు ("ఏ.ఎన్.ఆర్",దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత), ఎస్.వి.రంగారావు, ఘంటసాల, డా.కె.విశ్వనాధ్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సావిత్రి, జమున, శారద, షావుకారు జానకి, మరియు జయప్రద.
ఆంధ్ర ప్రదేశ్ లో పలు సంగ్రహాలయాలు (మ్యూజియం) కలవు, అందులో సాలార్ జంగ్ మ్యూజియం, పురావస్తుశాఖ మ్యూజియం ముఖ్యమైనవి. వీనిలో పలు శిల్పాలు, చిత్రాలు, హిందూ మరియు బౌద్ధ మత శిల్పాలు, కళాఖండాల సేకరణలు ప్రదర్శంచబడినవి. ఈ రెండు సంగ్రహాలయాలు హైదరాబాదులో ఉన్నవి.
కడప జిల్లా సంస్కృతి-సంప్రదాయాలను గురించి తెలుసుకోండి.
[మార్చు] విద్యారంగము
ఆంధ్ర ప్రదేశ్ నందు ఎన్నో విశ్వవిద్యాలయములు మరియు కళాశాలలు, వాటిలో ముఖ్యమైనవి:
- ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాదు.
- ఆంధ్ర విశ్వవిద్యాలయము, విశాఖపట్నం.
- హైదరాబాదు విశ్వవిద్యాలయము, హైదరాబాదు.
- ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు.
- ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము, హైదరాబాదు.
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలేజీ, వరంగల్లు.
- జవహర్ లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయము, హైదరాబాదు.
- ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలేజీ, హైదరాబాదు.
- ఎన్.టీ.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము, విజయవాడ.
- ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము, గుంటూరు.
- శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము, తిరుపతి.
- కాకతీయ విశ్వవిద్యాలయము,వరంగల్లు.
- డా.బీ.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయము, హైదరాబాదు.
- శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము, అనంతపురం.
[మార్చు] పండుగలు
- సంక్రాంతి - జనవరి 14.
- ఉగాది తెలుగు నూతన సంవత్సరము - మార్చి/ఏప్రిల్.
- వినాయక చవితి - ఆగష్టు.
- దసరా - అక్టోబర్.
- దీపావళి - నవంబర్.
[మార్చు] పర్యాటక రంగము
ఆంధ్రలో తిరుపతి, శ్రీశైలం, శ్రీ కాళహస్తి మొదలగు పుణ్య క్షేత్రములు కలవు. తిరుపతి లోని తిరుమల తిరుపతి దేవస్థానము ప్రపంచములోకెల్ల అధిక ఐశ్వర్యము కలిగిన హిందూ దేవాలయము.
[మార్చు] ఇవికూడా చూడండి
- ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
- ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు
- హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు
- ఆంధ్ర ప్రదేశ్ అవతరణ
- ఇటీవలి చరిత్ర
- సుప్రసిద్ధ ఆంధ్రులు
- ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు
- ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్లు
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు
- Rivalry and Tribute: Society and Ritual in a Telugu Village in South India
[మార్చు] బయటి లింకులు
- ఆంధ్రప్రదేశ్.కాం
- ఆంధ్రప్రదేశ్.నెట్
- ఆంధ్రప్రదేశ్ వార్తలు
- ప్రసిద్ధ ఆంధ్రుల జాబితా
- ఆంధ్రప్రదేశ్ వార్తలు2
భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు | ![]() |
---|---|
ఆంధ్ర ప్రదేశ్ | అరుణాచల్ ప్రదేశ్ | అసోం | బీహార్ | ఛత్తీస్‌గఢ్ | గోవా | గుజరాత్ | హర్యానా | హిమాచల్ ప్రదేశ్ | జమ్మూ కాశ్మీరు | జార్ఖండ్ | కర్నాటక | కేరళ | మధ్య ప్రదేశ్ | మహారాష్ట్ర | మణిపూర్ | మేఘాలయ | మిజోరాం | నాగాలాండ్ | ఒరిస్సా | పంజాబ్ | రాజస్థాన్ | సిక్కిం | తమిళనాడు | త్రిపుర | ఉత్తరాంచల్ | ఉత్తర ప్రదేశ్ | పశ్చిమ బెంగాల్ | |
కేంద్రపాలిత ప్రాంతములు: అండమాన్ నికోబార్ దీవులు | చండీగఢ్ | దాద్రా నగరు హవేలీ | డామన్ డయ్యు | లక్షద్వీపములు | పుదుచ్చేరి | |
జాతీయ రాజధాని ప్రాంతము: ఢిల్లీ |