చేమకూర వెంకటకవి
వికీపీడియా నుండి
కాలము | 17 వ శతాబ్దం |
రచనలు | విజయ విలాసము సారంగధర చరిత్ర |
బిరుదులు | ??? |
అంకితమిచ్చినది | రఘునాథరాజు |
ప్రాంతము | తంజావూరు |
చేమకూర వేంకటరాజకవిని, అతడు వ్రాసిన ప్రబంధరాజాలు విజయవిలాసం, సారంగధర చరిత్రలను నోరార ప్రశంసించని కవులుగాని, పండితులుగాని, విమర్శకులుగాని ఈ మూడువందల యాభై సంవత్సరాల్లో ఆంధ్రదేశంలో ఎవ్వరూ లేరని నిరాఘాటంగ చెప్పవచ్చు. కొందరు చేమకూర పాకాన పండిందన్నారు. ఇంటిపేరు నసగా ఉన్నా కవిత్వం పసగా ఉందన్నారు కొందరు. చక్కెరమళ్ళలో అమృతం పారించి పండించిన చేమకూర అని ఒకరు అన్నారు. ఇంకొకరు కడుంగడుం గడుసువాడు అని మెచ్చారు.
చేమకూర కవిని అనేక విధాల ప్రశంసించారు. కందుకూరి వీరేశలింగముగారి వంటివారు, "అచ్చ తెలుగు పదములను పొందికగ గూర్చి కవనము చెప్పు నేర్పు ఈ కవికి కుదిరినట్లు మరియొక కవికి కుదిరిందని చెప్పవనలు వడదు ...పింగళ సూరనార్యుని ప్రభావతీ ప్రద్యుమ్నమునకు తరువాత విజయవిలాసము సర్వ విధములచేతను తెలుగులో శ్లాఘ్య కావ్యముగ నున్నది, జాతియాది చమత్కృతినిబట్టి విజయవిలాసమే శ్లామ్యతరమయినదని అనేకు లభిప్రాయపడుచున్నారు" అని ప్రశంసించినారు.
తంజావూరు నాయకరాజులలో ప్రసిద్దుడగు రఘునాథరాజు ఆస్థానంలో ఈ సరసకవి ఉండేవాడు. ఈ కవి వృత్తి రిత్యా రఘునాథుని వద్ద, క్షాత్ర ధర్మం నిర్వర్తిస్తూ రాజు సైనికులలోనో, సైనికాధికారులలోనో ఒకరిగా ఉండేవారు.