జై ఆంధ్ర ఉద్యమం
వికీపీడియా నుండి
మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము చల్లారిన దశలో, ముల్కీ నిబంధనలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పర్యవసానంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి దారితీసింది. దానిపేరే జై ఆంధ్ర ఉద్యమం.
[మార్చు] నేపథ్యం
మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ముగిసిన తొలినాళ్ళవి. అప్పటికే ముల్కీ నిబంధనలపై సుప్రీం కోర్టులో కేసు విచారణలో ఉంది. హైదరాబాదు సంస్థానంలో 1915 లో నిజాము జారీ చేసిన ఒక ఫర్మానా ప్రకారం ముల్కీ నియమాలు అమలు లోకి వచ్చాయి. వీటి ప్రకారం హైదరాబాదు సంస్థానంలో పుట్టిన వారు కాని, హైదరాబాదులో కనీసం 15 ఏళ్ళుగా నివసిస్తూ, తమ ప్రాంతానికి తిరిగి వెళ్ళమని అఫిడవిట్టు ఇచ్చిన వారు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు. స్వాతంత్ర్యానికి పూర్వమే అమల్లో ఉన్న ఈ నియమాలు రాజ్యాంగబద్ధమే అని 1971 అక్టోబర్ లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు అన్యాయమని, తమ రాష్ట్ర రాజధానిలోనే తాము రెండవ తరగతి పౌరులుగా మారామనే ఆవేదనతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఉద్యమించారు.
[మార్చు] ఉద్యమ ప్రస్థానం
కేంద్రప్రభుత్వం రాజీ ప్రతిపాదనగా ఈ నిబంధనల కాలపరిమితి రాజధానిలో 1977 వరకు, మిగతా తెలంగాణ్లో 1980 వరకు మాత్రమే అమల్లో ఉంటాయని శాసనం చేసింది. అయితే ఈ ప్రతిపాదన ఆంధ్ర ప్రాంతం వారికి రుచించలేదు. విద్యార్థులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యోగులు నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. శాసనసభ స్పీకరు బి.వి.సుబ్బారెడ్డి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ ప్రాంత శాసనసభ్యులంతా తిరుపతి లో సమావేశమై చర్చించారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన అత్యధిక మంత్రులు రాజీనామా చేసారు.
ఉద్యమం హింసాత్మకంగా జరిగింది. సమైక్యవాదులపై దాడులు జరిగాయి. కమ్యూనిస్టు పార్టీ బహిరంగంగా ఉద్యమాన్ని వ్యతిరేకించింది. రాష్ట్ర విభజన రాష్ట్రహితం కాదని వాదించింది. ఆ పార్టీ పత్రిక విశాలాంధ్ర దినపత్రిక లో ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యాసాలు రాసింది. ఉద్యమకారులు పత్రిక ఆఫీసుపై దాడులు చేస్తామని బెదిరించారు.
[మార్చు] పరిష్కారం
జనవరి 10 న కాంగ్రెసు పార్టీ తమ ముఖ్యమంత్రి, పి.వి.నరసింహారావు చేత రాజీనామా చేయించి రాష్ట్రపతి పాలన విధించింది. ఉద్యమం పట్ల కేంద్రప్రభుత్వం దృఢంగా వ్యవహరించింది. ఉద్యమం ఆపివేయడానికి ఆరు సూత్రాల పథకాన్ని ప్రతిపాదించింది. ఆ పథకం ఇది:
- ముల్కీనిబంధనలు, తెలంగాణ ప్రాంతీయ సంఘం రద్దు చేస్తారు.
- నాన్ గజిటెడ్ ఉద్యోగాలు, సివిలు అసిస్టెంటు సర్జను ఉద్యోగాలు స్థానికులకు మాత్రమే ఇస్తారు.
- ప్రభుత్వోద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక ఉన్నతాధికార సంఘాన్ని నియమిస్తారు.
- వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కొరకు రాష్ట్రాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తారు.
- హైదరాబాదు లో కేంద్రవిశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి దోహదం చేస్తారు.
- పై సూత్రాలను చేరుస్తూ రాజ్యాంగసవరణ చేస్తారు.
ఉద్యమ కార్యాచరణ సంఘం ఈ పథకాన్ని ఆమోదించింది. 1973 డిసెంబర్ లో పార్లమెంటు ఈ ప్రణాళికను 33 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చింది. కేంద్రం రాష్ట్రపతి పాలన తొలగించి జలగం వెంగళరావు నాయకత్వంలో తిరిగి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసింది.