జలగం వెంగళరావు
వికీపీడియా నుండి
ఆంధ్ర ప్రదేశ్ కు 6 వ ముఖ్యమంత్రి, జలగం వెంగళరావు. నక్సలైట్లను ఉక్కుపాదంతో అణచి వేసిన ముఖ్యమంత్రిగా ఆయన దేశవ్యాప్తంగా ప్రసిద్ధిచెందాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిపదవులు నిర్వహించాడు.
తన 20 వ ఏట నిజాముకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. ఆ రోజుల్లో కాంగ్రెసు పార్టీ నిర్వహించిన సరిహద్దు క్యాంపుల్లో పాల్గొన్నాడు. రెండు సార్లు జైలుకు వెళ్ళాడు. 1952 లో శాసనసభ కు స్వతంత్రుడిగా పోటీ చేసి ఓడిపోయాడు. 1952 నుండి 1962 వరకు ఆయన కాంగ్రెసు పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. 1962లో కాంగ్రెసు పార్టీ తరపున ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుండి గెలిచి శాసనసభలో ప్రవేశించాడు. ఆ తరువాత 1978 వరకు మరో మూడు సార్లు సత్తుపల్లి నియోజకవర్గానికి శాసనసభలో ప్రాతినిధ్యం వహించాడు. 1967లో పంచాయితీరాజ్ ఛాంబరు చైర్మనుగా ఎన్నికయ్యాడు.
కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో 1969 నుండి 1971 వరకు హోం మంత్రిగాను, పి.వి.నరసింహారావు మంత్రివర్గంలో 1972-73 లో పరిశ్రమల మంత్రిగాను పనిచేసాడు. జై ఆంధ్ర ఉద్యమ ఫలితంగా రాష్ట్రంలో విధించిన రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన తరువాత వెంగళరావు ముఖ్యమంత్రి పదవికి ఎంపికయ్యాడు. ఆయన పాలనా కాలంలోనే ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ (ఆత్యయిక పరిస్థితి)ని విధించింది. ముఖ్యమంత్రిగా వెంగళరావు మంచి పరిపాలకుడిగా పేరుతెచ్చుకున్నాడు. ఆయన సాధించిన కార్యాలలో ముఖ్యమైనవి:
- నక్సలైటు ఉద్యమాన్ని కఠినంగా అణచివేసాడు. ఎన్‌కౌంటర్ల వ్యాప్తికి కారకుడిగా విమర్శలు తెచ్చుకున్నాడు.
- తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాదులో నిలదొక్కుకొనేందుకు తగు చేయూతనిచ్చాడు.
- మొదటి ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించాడు. అప్పటికి కొన్ని సంవత్సరాల ముందే ముగిసిన ప్రత్యేక తెలంగాణా, జై ఆంధ్ర ఉద్యమాల నేపథ్యంలో ఈ సభలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కాంగ్రెసు పార్టీ చీలిపోయి కాంగ్రెసు (ఐ) ఏర్పడినపుడు, వెంగళరావు కొన్నాళ్ళు పార్టీకి దూరమయ్యాడు. మళ్ళీ 1984 లో కాంగ్రెసుకు తిరిగి వచ్చి, 1984, 1991 మధ్య ఖమ్మం నియోజకవర్గం నుండి లోక్‌సభకు రెండుసార్లు ప్రాతినిధ్యం వహించాడు. 1986 నుండి 1989 వరకు కేంద్ర పరిశ్రమల మంత్రిగా పనిచేసాడు.
1999 జూన్ 12 న హైదరాబాదులో జలగం వెంగళరావు మరణించాడు. ఆయనకు ఇద్దరు కుమారులు - ప్రసాదరావు, వెంకటరావు. వీరిద్దరూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు జలగం వెంకటరావు 2004 లో సత్తుపల్లి నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు.
[మార్చు] వనరులు, మూలాలు
- తెలుగు సినిమా పరిశ్రమకు జలగం సేవ- గుడిపూడి శ్రీహరి ఇంటర్వ్యూ
- సత్తుపల్లి నియోజకవర్గంలో జలగం విజయాలు
- ఎన్కౌంటర్లపై వార్తలు
- మరణం, సంతాపం
- జలగం మృతికి పార్లమెంటు సంతాపం
[మార్చు] బయటి లింకులు
ఇంతకు ముందు ఉన్నవారు: పి.వి.నరసింహారావు |
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి 10/12/1973—06/03/1978 |
తరువాత వచ్చినవారు: డా.మర్రి చెన్నారెడ్డి |