దాశరథి కృష్ణమాచార్య
వికీపీడియా నుండి
తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య (Dasaradhi Krishnamacharya). దాశరథి గా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి.
విషయ సూచిక |
[మార్చు] జీవిత విశేషాలు
దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22 న వరంగల్ జిల్లా గూడూరు గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం ఈ గ్రామం ఖమ్మం జిల్లాలో ఉంది. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషను, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బియ్యే చదివాడు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. చిన్నతనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించాడు.
ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేసాడు. కథలు, నాటికలు, సినిమా పాటలుకవితలు రాసాడు.
నిజాం పాలనలో రకరకాల హింసలనుభవిస్తున్న తెలంగాణాను చూసి చలించిపోయాడు. పీడిత ప్రజల గొంతుగా మారి నినదించాడు.
రైతుదే తెలంగాణము రైతుదే.ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని గర్జించాడు.
దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోవోయ్, తెగిపోనోయ్ |
అని నిజామును సూటిగా గద్దిస్తూ రచనలు చేసాడు.
ఆంధ్రమహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం చేత జైలు శిక్ష అనుభవించాడు. నిజామాబాదు లోని ఇందూరు కోటలో ఆయన్ని మరో 150 మందితో ఖైదు చేసి ఉంచింది, నిజాము ప్రభుత్వం. ఆయనతోపాటు ఖైదులో వట్టికోట ఆళ్వారుస్వామి కూడా ఉన్నాడు. పళ్ళు తోముకోవడానికిచ్చే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బలు తిన్నాడు. మంచి ఉపన్యాసకుడు. భావప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో ఒకడు. 1953 లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడుగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించాడు. ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా 1977 ఆగష్టు 15 నుండి 1983 వరకు పనిచేసాడు. రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు గెల్చుకున్నాడు. అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తల్లి మీద, తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి.
1987 నవంబర్ 5 న దాశరథి మరణించాడు.
[మార్చు] రచనలు
- కవితా సంపుటాలు
- అగ్నిధార
- మహాంధ్రోదయం
- 'రుద్రవీణ
- 'మార్పు నా తీర్పు
- 'ఆలోచనాలోచనాలు
- ధ్వజమెత్తిన ప్రజ
- కవితా పుష్పకం: ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
- తిమిరంతో సమరం: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
- పుస్తకాలు
- సినిమా రచనలు: 1961లో ఇద్దరు మిత్రులు సినిమాలో పాటలు రాయడంతో ఆయన సినీరంగ ప్రవేశం చేసాడు.
[మార్చు] మచ్చుకు కొన్ని దాశరథి రచనలు
తెలుగుజాతి ఆత్మకథ లాగా ఉంటుంది కింది పద్యం..
- ఎవరు కాకతి ! ఎవరు రుద్రమ !
- ఎవరు రాయలు ! ఎవరు సింగన !
- అంతా నేనే ! అన్నీ నేనే !
- అలుగు నేనే ! పులుగు నేనే !
- వెలుగు నేనే ! తెలుగు నేనే !
నిజాము పాలన గురించి..
- ఓ నిజాము పిశాచమా, కానరాడు
- నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
- తీగలను తెంపి అగ్నిలో దింపినావు
- నా తెలంగాణ కోటి రతనాల వీణ
1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా..
- ఆంధ్ర రాష్ట్రము వచ్చె
- మహాంధ్ర రాష్ట్రమేరుపడువేళ
- పొలిమేర చేరపిలిచె