ప్రొద్దుటూరు
వికీపీడియా నుండి
ఖమ్మం జిల్లా, చింతకాని (ఖమ్మం జిల్లా మండలం) మండలానికి చెందిన గ్రామము కోసం ప్రొద్దుటూరు (చింతకాకాని మండలం) చూడండి.
ప్రొద్దుటూరు మండలం | |
జిల్లా: | కడప |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | ప్రొద్దుటూరు |
గ్రామాలు: | 15 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 225.398 వేలు |
పురుషులు: | 113.112 వేలు |
స్త్రీలు: | 112.286 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 69.07 % |
పురుషులు: | 80.47 % |
స్త్రీలు: | 57.62 % |
చూడండి: కడప జిల్లా మండలాలు |
ప్రొద్దుటూరు పట్టణం, భారత దేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో, కడప జిల్లాలో కడప పట్టణానికి 55 కి మీ ల దూరంలో ఉన్న ప్రముఖ వ్యాపార కేంద్రం. ప్రొద్దుటూరు ప్రముఖ యాత్రాస్థలం కూడా.
ఇక్కడి రామేశ్వరాలయములో శ్రీరాముడు, అగస్తీశ్వరాలయములో అగస్త్య మహర్షి సంప్రోక్షణ జరిపారని ఒక కథనం. పెన్నా నది ఒడ్డున శ్రీ కృష్ణదేవ రాయలు నిర్మించిన ముక్తి రామలింగేశ్వర స్వామి ఉన్నది. అద్భుత కళారీతులతో ప్రసిద్ధి కెక్కిన కన్యకా పరమేశ్వరి దేవాలయం . ప్రొద్దుటూరులో దసరా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుతారు.
ప్రొద్దుటూరు లోని మరొక విశిష్టత ఇక్కడ భారీ ఎత్తున సాగే బంగారు, వెండి నగల వ్యాపారం. ఈ నగల వ్యాపారంలో ప్రొద్దుటూరు బాగా ప్రసిద్ధి చెందింది. అందుకే ప్రొద్దుటూరును రెండవ బొంబాయి అంటారు.
విషయ సూచిక |
[మార్చు] ముక్తి రామేశ్వరం
ముక్తి రామేశ్వరం కడప జిల్లా లోని ప్రొద్దుటూరు పట్టణం లో ఉంది. ముక్తి రామేశ్వరాలయం పెన్నా నది గా పిలువబడే పినాకినీ నది ఒడ్డున ఉంది. ఇక్కడికి సమీపంలో, ఆలయం నుంచి 14 కి.మీ. దూరంలో గల ఎర్రగుంట్లలో రైల్వే స్టేషన్ ఉంది. ప్రొద్దుటూరు నుంచి, ఎర్రగుంట్ల నుంచి యాత్రీకులను ఆలయం దగ్గరకు తీసుకు వెళ్ళడానికి చాలా బస్సులు తిరుగుతున్నాయి.
[మార్చు] స్థల పురాణము
పురాణ కథల ప్రకారం లంకాధిపతియైన రావణుడు సాక్షాత్తూ బ్రహ్మ మనుమడు. అందు చేత బ్రాహ్మణుడు. శ్రీ రాముడు రావణుడిని సంహరించిన తర్వాత ఒక బ్రాహ్మణుడిని చంపినందుకు బ్రహ్మ హత్యా పాతకం రాముడిని ఒక పిల్లి రూపంలో వెంటబడింది. దానినుంచి విముక్తుడు కావడానికి శ్రీ రాముడు దండకారణ్యంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలనుకొన్నాడు. పినాకినీ నదీ తీరాన గల ఈ ప్రాంతాన్ని పవిత్రమైనదిగా భావించి ఇక్కడే శివలింగ ప్రతిష్ఠ చేయడానికి నిశ్చయించుకొన్నాడు. ముహూర్తం నిర్ణయించి, కాశీ నుంచి శివలింగాన్ని తెమ్మని హనుమంతుడిని పంపగా, హనుమంతుడు సకాలంలో తిరిగి రాలేక పోయాడు. దాంతో రాముడే పెన్నా నది లోని ఇసుక తో ఒక లింగాన్ని తయరు చేసి ప్రతిష్ఠించాడు. అది సైకత లింగం (=ఇసుక లింగం)గా పేరుగాంచింది. కాశీ నుంచి ఆలస్యంగా తిరిగి వచ్చిన హనుమంతుడు అది చూసి నొచ్చుకున్నాడు. దాంతో శ్రీ రాముడు అతడికి సంతోషం కలిగేటట్లు సైకత లింగానికి ఎదురుగా కొంత దూరంలో హనుమంతుడు కాశీ నుంచి తెచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. అందుకే ఆక్షేత్రాల్ని రామలింగేశ్వర క్షేత్రమ్, హనుమ క్షేత్రం అని పిలుస్తారు. రాముడు మొదటి పూజ కాశీ లింగానికీ, తరువాతి పూజ సైకత లింగానికీ జరిగేటట్లు అనుగ్రహించాడు. ఈ ప్రతిష్ఠలు అయిన తర్వాత పిల్లి పెన్నా నది ఒడ్డు దాకా నడిచి అదృశ్యమైందట. పిల్లి పాదాల గుర్తులు అక్కడ ఉన్నాయంటారు. పిల్లి నదిలో దిగిన చోటును "పిల్లి గుండం" అంటారు. రామలింగేశ్వర స్వామికి ప్రక్కన రాజరాజేశ్వరి, శ్రీ చక్రం ప్రతిష్ఠించారు. ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, సుబ్రహ్మణ్యస్వామి ఉన్నారు. చైత్ర మాసంలో పౌర్ణమి నుండి పది రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీక సోమవారాల్లో భక్తులు విశేషంగా వస్తారు. ఈ ఆలయానికి, ప్రక్కన, వెనుక ఇద్దరు మునుల ఆలయాలున్నాయి. స్థలపురాణం ప్రకారం శ్రీ రాముడు శివ లింగాన్ని ప్రొద్దు పొడవక ముందే తయారు చేసి ప్రతిష్ఠించాడు. అందుకే ఈ ఊరిని ప్రొద్దుటూరు అంటారు. ఈ క్షేత్ర ప్రతిష్ఠతో రాముడు బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తిని పొందాడు. అందుకే ఈ క్షేత్రాన్ని ముక్తి రామేశ్వరం అంటారు.
[మార్చు] ఆలయ చరిత్ర
శాసనాల ప్రకారం శ్రీ కృష్ణదేవరాయలు ఈ దేవాలయం మీద ఐదు అంతస్థుల గోపురం నిర్మించాడు. గోపురం చుట్టూరా చెక్కిన అనేక మంది దేవతల అందమైన విగ్రహాలు ఆ నాటి శిల్పుల పనితనాన్నీ, సామర్థ్యాన్నీ చెప్పకనే చెబుతాయి. స్థలపురాణం ప్రకారం శ్రీ రాముడు శివ లింగాన్ని ప్రొద్దు పొడవక ముందే తయారు చేసి ప్రతిష్ఠించాడు. అందుకే ఈ ఊరిని ప్రొద్దుటూరు అంటారు.
[మార్చు] రామలింగేశ్వర ఆలయము
ఈ క్షేత్ర దైవం లింగరూపంలో ఉండే శ్రీ రామలింగేశ్వరుడు. ఈ శివ లింగాన్ని ప్రతిష్ఠించింది శ్రీ రాముడు. అందుకే దీనికి రామేశ్వరమని పేరు. 56 అంగుళాల ఎత్తుండే ఈ లింగం మీద శ్రీ రాముడి వేలి ముద్రలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడికి కొన్ని అడుగుల దూరంలోనే శ్రీ హనుమత్ లింగేశ్వర క్షేత్రముంది. హన్మంతుడు కాశీ నుంచి తీసుకు వచ్చిన శివ లింగాన్ని శ్రీ రాముడు ప్రతిష్ఠించింది ఇక్కడే. శ్రీ రామలింగేశ్వర ఆలయం ప్రక్కనే శ్రీ రాజరాజేశ్వరీ ఆలయం కూడా ఉంది. ఇక్కడ శ్రీ ఆది శంకరాచార్యులు పూజించిన "శ్రీ చక్ర యంత్రం" ఉంది. ఈ చక్ర ప్రభావం వల్లే ఈ పట్టణం బాగా అభివృద్ధి చెందిందని ప్రొద్దుటూరు వాసులు బలంగా విశ్వసిస్తారు. ఈ శ్రీ చక్ర యంత్రాన్ని పూజించిన వారికి కోరికలన్నీ తీరి జీవితంలో సుఖశాంతులు కలుగుతాయని ఒక నమ్మకముంది.
[మార్చు] శిల్పకళ
ముక్తి రామలింగేశ్వరాలయం సువిశాలమైన స్థలంలో నిర్మించిన పెద్ద ఆలయం. అందమైన శిల్పాలతో అలరారే ఐదంతస్థుల రాజగోపురం చూపరులకు కనువిందు చేస్తుంది.ఈ ఆలయం చుట్టూ రక్షణ కోసం నిర్మించిన తలుపులతో బలమైన గోడలున్నాయి. ఈ ఆలయ గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడని ప్రతీతి. కుమారస్వామి, దుర్గా దేవి, నాట్య గణపతి, శివపార్వతులు, గరుడ వాహనం మీదుండే విష్ణువు, కాళీయ మర్ధనం చేసే కృష్ణుడు మొదలైన విగ్రహాలు పూర్వ కాలపు శిల్పుల కళానైపుణ్యానికి నిదర్శనాలుగా ఉన్నాయి.
[మార్చు] అగస్త్యేశ్వరాలయం
ప్రొద్దుటూరు లో అగస్త్యేశ్వరాలయముంది.ఈ ఆలయాన్ని నందిచోళుడు నిర్మించాడు. సాళువ నరసనాయకుడు అభివృద్ధి చేశాడు. ఈ ఆలయం సాహిత్య సాంస్కృతిక కార్యక్రమ్మలకు కాణాచిగా ఉండేది. మహా కవి పుట్టపర్తి నారాయణాచార్యులు ఈ ఆలయంలోనే 'శివతాండవం' కావ్యాన్ని వ్రాశాడు. ఈ ఆలయానికి ఎత్తైన ప్రాకారాలున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో అగస్త్యేశ్వరుడు, రాజరాజేశ్వరి, భీమలింగేశ్వరుడు, సుందరేశ్వరుడు, కోదండరామస్వామి ఆలయాలున్నాయి. అగస్త్యేశ్వరుడు మూడడుగుల లింగాకారంలో ఉన్నాడు. అంతరాలయంలో వీరభద్రుడు, కార్తికేయుడు, గణపతి ఉన్నారు. అలయానికి ముందు పుష్కరిణి ఉండేది. దానిని పూడ్చి మార్కెట్ కాంప్లెక్సు నిర్మించారు. ప్రతి సంవత్సరం అగస్త్యేశ్వర స్వామికి వైశాఖ శుద్ధ సప్తమి నుంచి పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. రాజరాజేశ్వరీ దేవికి ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకూ దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
[మార్చు] కన్యకా పరమేశ్వరీ ఆలయం
ప్రొద్దుటూరు నగర కీర్తికి తలమానికం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం. వాసవి వైశ్య కుల దేవత అయినా అందరూ ఈమెను దర్శిస్తూ ఉంటారు. క్రీ.శ. 1890 లో ఈ దేవాలయాన్ని స్థాపించారు.కామిశెట్టి కొండయ్య అనే వైశ్యునికి వాసవి కలలో కనిపించి తన కోసం దేవాలయం నిర్మించవలసిందిగా ఆదేశించింది. ఆయన, మరికొందరు వైశ్య ప్రముఖులు కలిసి ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. దసరా ఉత్సవాలలో మైసూరు తర్వాత ప్రొద్దుటూరునే చెప్పుకోవాలి.
ఆలయానికి ఎత్తైన గాలిగోపురం ఉంది. ముఖ ద్వారాలు శిల్పకళతో విరాజిల్లుతున్నాయి. పురాణగాథలు తెలిపే శిల్పాలు మనోహరంగా ఉన్నాయి. వాసవి జన్మ వృత్తాంతం తెలిపే ఛాయాచిత్రాలున్నాయి. మహాత్మా గాంధీ(1929 లో), శృంగేరీ పీఠాధిపతులు, కంచి కామకోటి పీఠాధిపతులు మొదలగు ప్రముఖులు ఈ ఆలయాన్ని దర్శించారు.
[మార్చు] అయ్యప్ప స్వామి ఆలయం
ప్రొద్డుటూరుకు కొత్త శోభ పెన్నా నదీ తీరంలో నిర్మించబడిన అయ్యప్ప స్వామి దేవాలయం. ఇక్కడి ప్రకృతి అందాలు ఒళ్ళు పులకరింప జేస్తాయి. 1991 లో విగ్రహాన్ని పంచలోహాలతో నిర్మించారు. ఈ విగ్రహం 21 అంగుళాల ఎత్తు, 110 కిలోగ్రాముల బరువు ఉంది.తిరుపతి సమీపంలోని తిరుచానూరు వాస్తవ్యులైన తిరుమలాచార్యులనే శిల్పి ఈ విగ్రహన్ని తయారు చేశాడు. శిల్ప కళా నైపుణ్యంతోనూ, గాలిగోపురాలతోనూ దేవాలయాన్ని చూడముచ్చటగా నిర్మించారు.మన రాష్ట్రంలో భారీ వ్యయంతో నిర్మించిన అయ్యప్ప దేవాలయాల్లో ఇదొకటి. (నిర్మాణ వ్యయం 60 లక్షలు.) ఆలయ ప్రాంగణంలో 22 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పు తో శివుని శిరస్సు నిర్మించారు.రాష్ట్రంలోని యాత్రికులు ఈ అయ్యప్ప స్వామిని దర్శించుకుని శబరిమల యాత్ర చేస్తారు.
ప్రొద్దుటూరు నుంచి జమ్మలమడుగు వెళ్ళే దారిలో ప్రొద్దుటూరు నానుకుని బొల్లవరం అనే చోట విజయనగర రాజులు నిర్మించిన వెంకటేశ్వర, చెన్న కేశవ, వేణుగోపాల, ఆంజనేయ స్వామి ఆలయాలున్నాయి.
దుర్భాక రాజశేఖర శతావధాని, మహాకవి గడియారం వెంకటశేష శాస్త్రి, "గణిత బ్రహ్మ" లక్కోజు సంజీవ రాయ శర్మ, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా తొలి భారతీయ సంపాదకుడు ఏ.ఎస్. రామన్ ప్రొద్దుటూరుకు చెందిన వారే.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- బొల్లవరం (గ్రామీణ)
- చౌడూరు
- దొరసానిపల్లె
- గోపవరం
- కల్లూరు
- కామనూరు
- కొత్తపల్లె
- మోడమీదిపల్లె (గ్రామీణ)
- నంగనూరుపల్లె
- పెద్దసెట్టిపల్లె
- రంగసాయిపల్లె
- రేగులపల్లె
- సర్విరెడ్డిపల్లె (నిర్జన గ్రామము)
- తల్లమాపురం
- ఉప్పరపల్లె
- యెర్రగుంట్లపల్లె
[మార్చు] బయటి లింకులు
[మార్చు] కడప జిల్లా మండలాలు
కొండాపురం | మైలవరం | పెద్దముడియం | రాజుపాలెం | దువ్వూరు | మైదుకూరు | బ్రహ్మంగారిమఠం | బి.కోడూరు | కలసపాడు | పోరుమామిళ్ల | బద్వేలు | గోపవరం | ఖాజీపేట | చాపాడు | ప్రొద్దుటూరు | జమ్మలమడుగు | ముద్దనూరు | సింహాద్రిపురం | లింగాల | పులివెందల | వేముల | తొండూరు | వీరపునాయునిపల్లె | యర్రగుంట్ల | కమలాపురం | వల్లూరు | చెన్నూరు | అట్లూరు | ఒంటిమిట్ట | సిద్ధవటం | కడప | చింతకొమ్మదిన్నె | పెండ్లిమర్రి | వేంపల్లె | చక్రాయపేట | లక్కిరెడ్డిపల్లె | రామాపురం | వీరబల్లె | రాజంపేట | నందలూరు | పెనగలూరు | చిట్వేలు | కోడూరు | ఓబులవారిపల్లె | పుల్లంపేట | టి.సుండుపల్లె | సంబేపల్లి | చిన్నమండెం | రాయచోటి | గాలివీడు | కాశి నాయన