శతక సాహిత్యము
వికీపీడియా నుండి
శతకము అనగా వంద. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే ముకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. భర్తృహరి వ్రాసిన సుభాషిత త్రిశతి సంస్కృతములో ప్రసిద్ధి చెందినది.
శతకములో ప్రతి పద్యానికీ చివరలో ఒక పదము గానీ, పదాలుగానీ, పూర్తి చరణము గానీ ఉండటం ఆనవాయితీ. ఇది ఆ రచయిత సంతకం లాంటిది. దీనిని ముకుటము అంటారు. ఉదాహరణకు విశ్వదాభిరామ వినురవేమ అనునది వేమన శతకమునకు ముకుటము, అలాగే సుమతీ అనునది సుమతీ శతకమునకు ముకుటము, అలాగే వెంకటేశ్వరా, దాశరదీ అనునవి ఇతర ఉదాహరణములు.
సాధారణంగా ఇతర కావ్య, సాహిత్య ప్రక్రియలు పండితులకు పరిమితమైనాగాని, శతకాలు మాత్రం సామాన్య ప్రజానీకంలో ఆదరణపొందినవి. ఇలా తెలుగులో శతక సాహిత్యము పామరులకూ పండితులకూ వారధిగా నిలిచింది. వీటిలో వేమన శతకానికీ, సుమతీ శతకానికీ ఉన్న ప్రాచుర్యము గురించి వేరే చెప్పాల్సిన పని లేదు.
మల్లికార్జున పండితారాధ్యుని "శివతత్వసారము" శతకవాఙ్మయమునకు ఆద్యముగా చెప్పవచ్చును. పాల్కురికి సోమన (క్రీ.శ.1300)వృషాధిప శతకము మొట్టమొదటి సంపూర్ణ శతకము. షుమారు ఈ కాలములోనే బద్దెనగారి సుమతీ శతకము, యాతావక్కుల అన్నమయ్య గారి సర్వేశ్వర శతకము వెలువడ్డాయి. వీటి ఒరవడిలోనే తెలుగులోను, కన్నడములోను శతక వాఙ్మయము చాలాకాలం కొనసాగింది.
తరువాత తెలుగులో ఎన్ని వేల శతకాలు వచ్చాయో చెప్పడం కష్టం. ఎందరో పండితులు, కవులు, ఔత్సాహిక రచయితలు వేర్వేరు అంశాలలో శతకాలు రచించారు. భక్తి (కృష్ణ శతకము), శృంగారము (భర్తృహరి), తత్వము, వేదాంతము (బమ్మెర పోతన - నారాయణ శతకము), నీతి (సుమతీ శతకము), పొగడటం, తిట్టటం, పొగడినట్టు తిట్టడం, తిట్టినట్టు పొగడడం, వర్ణించడం, బోధించడం - అన్ని విషయాలలోనూ శతకాలు వ్రాశారు. వీటిలో చాలావరకు ముద్రణకు నోచుకొనబడలేదు.
మిగిలిన సాహిత్య ప్రక్రియలకున్న అలంకారిక, లాక్షణిక నియమాలు అనే బంధాలు శతక సాహిత్యానికి లేవు. ఛందస్సుకు అనుగుణంగా ఉంటే చాలు. విషయాన్ని ఒక పద్యంలో వెళ్ళగ్రక్కవచ్చును. లేదా 10 పద్యాలలో విస్తరింప వచ్చును. కధ చెప్పాలనీ, ముగింపు ఉండాలనీ నియమం లేదు. కనుక కవి బోలెడంత స్వేచ్ఛ ఉంది. చదివేవాడికి కూడా రోజులతరబడి ఒకే గ్రంధాన్ని ఆధ్యనం చేయాల్సిన పని బడదు. కనుక ఒక్కపద్యంతోనే కవికీ, చదువరికీ అనుబంధం ఏర్పడవచ్చును. క్లుప్తంగా విషయాన్ని విడమరచి చెప్పే సాధనాలు. అందుకే ఇవి ప్రజా కవిత్వముగా ఆదరణ సంతరించుకొన్నాయా?
బహుశా అప్పటి సాహితీ ప్రక్రియలలో ఒక్క శతకసాహిత్యమే సంఘంలోని ఆచారాలను నిశితంగా విమర్శించడానికి ఉపయోగపడింది. వీటిల్లో వేమన శతకము ఎప్పటికీ అగ్రగామి. మూడు పంక్తులలో ముప్ఫై పేజీలకు సరిపోయే భావాన్ని ఇమిడ్చిన మేధావి, తత్వ వేత్త. అందరూ అనుకొన్నదానికి నెక్కచ్చిగా ఎదురు నిలచిన మహానుభావుడు వేమన.
శతక సాహిత్యంలో ముప్ఫైకి పైగా ముస్లిం కవులు వ్రాసిన శతకాలున్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు. అలాగే క్రైస్తవభక్తిపరంగా కూడా చాలా శతకాలున్నాయి.
[మార్చు] ఆధారాలు
- ఆడ్లూరి శేషు మాధవరావు - తెలుగు భాష, సాహిత్యము వెబ్ సైటు లోని వ్యాసములు
- "ఈనాడు" లో చీకోలు సుందరయ్య వ్యాసము - "శతక సాహిత్యంలో ముస్లిం కవులు"
[మార్చు] శతక సాహిత్యము
- శ్రీ కాళహస్తీశ్వర శతకము - ధూర్జటి
- వేమన శతకము - వేమన
- సుమతీ శతకము- బద్దెన (భద్ర భూపాలుడు)
- దాశరథీ శతకము - కంచెర్ల గోపన్న (రామదాసు)
- భాస్కర శతకము - మారవి వెంకయ్య
- నీతి శతకము
- నారాయణ శతకము- పోతన
- కవి చౌడప్ప శతకము - కవి చౌడప్ప
- కృష్ణ శతకము - నృసింహకవి? తిక్కన? భీమకవి? వెన్నెలకంటి జన్నమంత్రి?
- ఆంధ్ర నాయక శతకము- కాసుల పురుషోత్తమ కవి
- నరసింహ శతకము
- రామలింగేశ శతకము - అడిదము సూరకవి
- వృషాధిప శతకము- పాల్కురికి సోమనాధుడు
- మారుతి శతకము
- దేవకీనందన శతకము
- గువ్వలచెన్న శతకము
- కుమార శతకము
- వేంకటేశ శతకము
- భర్తృహరి సుభాషిత త్రిశతి - ఏనుగు లక్ష్మణ కవి, ఎలకూచి బాల సరస్వతి, పుష్పగిరి తిమ్మన (మూడు అనువాదములు)
- సూర్య శతకము
- సర్వేశ్వర శతకము- యాతావక్కుల అన్నమయ్య
- శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము- తాళ్ళపాక అన్నమయ్య
- ధూర్తమానవా శతకము
- కుప్పుసామి శతకము
- భక్త కల్పద్రుమ శతకము - ముహమ్మద్ హుస్సేన్ (1949)
- సుమాంజలి - ముహమ్మద్ హుస్సేన్, మొక్కపాటి శ్రీరామ శాస్త్రి
- హరిహరనాథ శతకము - ముహమ్మద్ హుస్సేన్
- అనుగుబాల నీతి శతకము - ముహమ్మద్ హుస్సేన్
- తెనుగు బాల శతకము - ముహమ్మద్ హుస్సేన్
- రసూల్ ప్రభు శతకము - షేక్ దావూద్ (1963)
- అల్లా మాలిక్ శతకము - షేక్ దావూద్
- సూక్తి శతకము - సయ్యద్ ముహమ్మద్ అజమ్
- సోదర సూక్తులు - ముహమ్మద్ యార్
- హుస్సేన్ దాస్ శతకము - గంగన్నవలి హుస్సేన్ దాస్
- ప్రవక్త సూక్తి శతకము - అల్హజ్ ముహమ్మద్ జైనులే అబెదీన్
- పాపసాబుమాట పైడిమూట - తక్కల్లపల్లి పాపాసాహెబ్
- సాధుశీల శతకము - షేక్ ఖాసిమ్
- గురుని మాట - షేక్ ఆలీ
- మానస ప్రబోధము - షేక్ ఆలీ
- మిత్రబోధామృతము -షేక్ రసూల్ (వివేకోదయ స్వామి)
- భయ్యా శతకము - అబెదీన్
- బ్రహ్మ విద్యా విలాసము - ఉమర్ ఆలీ షా
శతకములు | బొమ్మ:Satakamu.png |
---|---|
శ్రీ కాళహస్తీశ్వర శతకము | వేమన శతకము | సుమతీ శతకము | దాశరథీ శతకము | భాస్కర శతకము | నీతి శతకము | నారాయణ శతకము | కృష్ణ శతకము | ఆంధ్ర నాయక శతకము | నరసింహ శతకము | రామలింగేశ శతకము | వృషాధిప శతకము | మారుతి శతకము | దేవకీనందన శతకము | గువ్వలచెన్న శతకము | కుమార శతకము | వేంకటేశ శతకము | సూర్య శతకము | సర్వేశ్వర శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | ధూర్తమానవా శతకము | కుప్పుసామి శతకము | శతకము |