భానుమతీ రామకృష్ణ
వికీపీడియా నుండి
తెలుగు సినిమా |
||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
భానుమతీ రామకృష్ణ ప్రముఖ సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు. భానుమతి 1925వ సంవత్సరము సెప్టెంబరు నెలలో ప్రకాశం జిల్లా, ఒంగోలు లో జన్మించింది. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య శాస్త్రీయ సంగీత ప్రియులు మరియూ కళా విశారదులు.
భానుమతి తండ్రి వద్ద నుండే సంగీతమును అభ్యసించింది. అనేక కట్టుబాట్లు గల కుటుంబ వాతావరణములో పెరిగినప్పటికీ ఆమె ఎంతో ధైర్యంగా పదమూడేండ్ల చిరుత ప్రాయమునాడే 1939 లో విడుదలైనవరవిక్రయం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నిర్మాణ సమయములో తన కూతురును తాకరాదని ఆమె తండ్రి షరతు విధించారట! హీరో, నిర్మాతలు అలాగే నడుచుకున్నారు.
ఆ తరువాత ఆమె తమ ప్రతిభా పాటవాలతో, కష్టపడే తత్వముతో నూరుకుపైగా చిత్రాలలో నటించింది. ఆమె సినిమాలలో మల్లీశ్వరి, మంగమ్మగారి మనవడు వంటి ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి. విజయా వారి మిస్సమ్మ సినిమాలో ప్రధాన పాత్రకు మొదట భానుమతినే అనుకున్నారు. అయితే షూటింగు మొదలైన తర్వాత చక్రపాణికి ఆమె వ్యవహార శైలి నచ్చక ఆమె స్థానంలో సావిత్రిని తీసుకున్నాడు. ఆ సినిమా విడుదలై ఘన విజయం సాధించాక భానుమతి "నేను మిస్సమ్మలో నటించక పోవడం వల్ల సావిత్రి లాంటి గొప్ప నటి వెలుగులోకి వచ్చింది." అని సంతోషించింది.
భానుమతి కేవలము నటిగానే కాక బహుముఖ ప్రజ్ఞాశాలిగా పలువురి మన్ననలు అందుకున్నారు. ఓ గాయనిగా, సంగీత దర్శకురాలిగా, స్టూడియో యజమానిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, రచయిత్రిగా పలు పాత్రలు సమర్దవంతంగా నిర్వర్తించి శభాష్ అనిపించుకున్నారు. బహుశా ప్రపంచంలోనే ఇన్ని పాత్రలలో రాణించిన మహిళలు ఇహ లేరేమో! అని చెప్పడము అతిశయోక్తి కాదు.
ఆమె 1943, ఆగష్టు 8 న తమిళ , తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఎడిటరు అయిన శ్రీ పీ యస్ రామకృష్ణ ప్రేమ వివాహమాడినారు. వీరి ఏకైక సంతానం భరణి. ఈ భరణి పేరుమీదనే స్టూడియో నిర్మించి అనేక చిత్రాలు ఈ దంపతులు నిర్మించారు.
[మార్చు] అవార్డులు
![భానుమతి కుమారుడు భరణి, భానుమతి 1999 హైదరాబాదులో అంతర్జాతీయ చిత్రోత్సవము సమయములో పత్రికా సమావేశమునందు తీసిన చిత్రము](../../../upload/thumb/9/99/Bhanumati_couple.jpg/250px-Bhanumati_couple.jpg)
- 1956నందు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ పురస్కారము
- మూడు సార్లు జాతీయ అవార్డులు (అన్నై అను తమిళ సినిమాకు, అంతస్తులు , పల్నాటి యుద్ధం అను తెలుగు సినిమాలకు)
- అనాదురై నడిప్పుకు ఇళక్కనం (నటనకు వ్యాకరణం) అని బిరుదు ఇచ్చి గౌరవించాడు.
- తమిళ అభిమానులు అష్టావధాని అని కీర్తిస్తూ, వీరి బహుముఖ ప్రజ్ఞను తలచుకుంటూ ఉంటారు
- 1966లో ఆమె రాసిన అత్తగారి కథలు అను హాస్యకథల సంపుటికిగాను పద్మశ్రీ బిరుదు ఇచ్చి భారత ప్రభుత్వము వీరిని సత్కరించింది.
- ఇదే సంపుటికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు కూడా వచ్చింది.
- 1975 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ఇచ్చి సత్కరించింది.
- 1984 కలైమామణి బిరుదుతో తమిళనాడు నందలి ఐయ్యల్ నాటక మన్రము సత్కరించింది.
- భకహుకళ ధీరటి శ్రీమతి అను బిరుదుతో 1984ననే లయన్స్ క్లబ్బు సత్కరించింది.
- 1984లో తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు తో సత్కరించింది.
- 1986లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ఇచ్చింది.
- 1986 లో ఉత్తమ దర్శకురాలి గా అవార్డును ఆంధ్ర ప్రభుత్వము నుండి అందుకుంది.
[మార్చు] పరమపద ప్రయాణం
2005 డిసెంబర్ 24 న చెన్నై లోని తన స్వగృహంలో భానుమతీ రామకృష్ణ పరమపదించింది. తన బహుముఖ ప్రజ్ఞా విశేషాలతో ఎన్నో సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన భానుమతి మృతికి పలువురు ప్రముఖులు బాష్పాంజలి ఘటించారు.
[మార్చు] బయటి లింకులు
ఈ వ్యాసం 2005 డిసెంబర్ 26 వ తేదీన విశేషవ్యాసంగా ప్రదర్శించబడింది. |