తమిళనాడు
వికీపీడియా నుండి
తమిళనాడు | |
రాజధాని - Coordinates |
చెన్నై - |
పెద్ద నగరము | చెన్నై |
జనాభా (2001) - జనసాంద్రత |
62,110,839 (6) - 478/చ.కి.మీ |
విస్తీర్ణము - జిల్లాలు |
130,058 చ.కి.మీ (11) - 30 |
సమయ ప్రాంతం | IST (UTC +5:30) |
అవతరణ - గవర్నరు - ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
1967-07-18† - సుర్జీత్ సింగ్ బర్నాలా - ఎం.కరుణానిధి - Unicameral (235) |
అధికార బాష (లు) | తమిళం |
పొడిపదం (ISO) | IN-TN |
వెబ్‌సైటు: tn.gov.in | |
=
తమిళనాడు రాజముద్ర |
|
† 1773 లో వ్యవస్థాపించబడినది. జూలై 18, 1967న తమిళనాడుగా నామకరణము చేయబడినది.[1] |
తమిళనాడు (தமிழ் நாடு, "Tamil Nadu") భారతదేశపు దక్షిణాన ఉన్న ఒక రాష్ట్రము. కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, పుదుచ్చేరి లు దీని సరిహద్దు రాష్ట్రాలు. తమిళనాడుకు ఆగ్నేయాన సముద్రంలో శ్రీలంక ద్వీపమున్నది. శ్రీ లంకలో గణనీయమైన తమిళులున్నారు..
తమిళనాడు రాజధాని చెన్నై. 1996కు ముందు దీని అధికారికనామము 'మద్రాసు'. ఇంకా కోయంబత్తూరు, కడలూరు, మదురై, తిరుచిరాపల్లి, సేలం, తిరునల్వేలి తమిళనాట ముఖ్యమైన నగరాలు.
తమిళనాడు బహుముఖంగా ప్రాముఖ్యత సంతరించుకున్న రాష్ట్రం. సంప్రదాయాలనూ, ఆధునికతనూ కలగలిపిన సమాజం. సాహిత్యము, సంగీతము, నాట్యము తమిళనాట ఈనాటికీ విస్తారమైన ఆదరణ కలిగి ఉన్నాయి. పారిశ్రామికంగానూ, వ్యాపార రంగంలో, సినిమా రంగంలో, వ్యవసాయంలో, విద్యలోనూ కూడా గణనీయమైన అభివృద్ది సాధించింది. దేశరాజకీయాలలో తమిళనాడు కీలకమైన పాత్ర కలిగిఉన్నది.
విషయ సూచిక |
[మార్చు] తమిళనాడుకు చెందిన కొదరు ప్రముఖులు
- చారిత్రిక కాలంలో
- కన్నగి
- తిరుళ్ళువావర్
- కంబన్
- మనునీధి చోళన్
- ఆదునిక కాలంలో
- సుబ్రహ్మణ్య భారతి
- అన్నాదురై
- తాంతై పెరియార్
- ఎమ్.జి.రామ చంద్రన్
- ఎమ్. కరుణానిధి
- ఎ.ఆర్.రహమాన్
- జయలలిత
- కమల్ హాసన్
- విలయనూర్ రామచంద్రన్
- అలాన్ తురింగ్ (కంప్యూటరు సైంటిస్టు - బాల్యం మద్రాసులో గడిపాడు)
[మార్చు] చరిత్ర
తమిళనాడు ప్రాంత చరిత్ర 6000 సంవత్సరాలు పైగా పురాతనమైనది. సింధునదీలోయలో (హరప్పా, మొహంజొదారో) మొదట ద్రావిడుల నాగరికత పరిఢవిల్లిందనీ, తరువాత ఆర్యుల దండయాత్రల కారణంగా ద్రావిడులు దక్షిణప్రాంతానికి (ప్రస్తుత తమిళ, తెలుగు, కన్నడ, మళయాళీ ప్రాంతాలు) క్రమేపీ విస్తరించారని ఒక ప్రబలమైన వాదన. కానీ ఈ వాదనకు బలమైన వ్యతిరేకత కూడా ఉన్నది. ఏమయినా తమిళ సమాజం పట్ల చాలామంది అవగాహన 'ద్రవిడనాగరికత' అనే అంశం ఆధారంగా మలచబడింది.
తమిళనాడు, చుట్టుప్రక్కల ప్రాంతాలలో వేరువేరు కాలాలలో పల్లవ, చేర, చోళ, పాండ్య, చాళుక్య, విజయనగర రాజుల రాజ్యం సాగింది. దాదాపు అన్ని సమయాలలోనూ 'కొంగునాడు' (కోయంబత్తూరు, ఈరోడ్, కరూర్, సేలం ప్రాంతాలు) ఒక విశిష్టమైన స్వతంత్ర ప్రతిపత్తిని నిలుపుకొంది. వ్యవసాయ ప్రధానమైన ఈ ప్రాంతాలలో ఇప్పటికీ సాంస్కృతిక విలక్షణత కనుపిస్తుంది.
[మార్చు] క్రీస్తు పూర్వము
క్రీ.ఫూ. 6వ శతాబ్దములో మదురై, తిరునల్వేలి కేంద్రంగా కులశేఖరుడు స్థాపించిన పాండ్యరాజ్యం వర్ధిల్లింది. వారి కాలంలో గ్రీసు, రోములతో వాణిజ్య సంబంధాలు ఉండేవి. తరువాత చేర రాజులు మలబారు తీర ప్రాంతం (ఇప్పటి కేరళ) లో రాజ్యమేలారు. ఇది సైనికంగా బలమైన రాజ్యం. వారికాలంలో రోముతో వాణిజ్యం మరింత అభివృద్ధి చెందింది.
[మార్చు] క్రీ.శ. 1 నుండి 9వ శతాబ్ధము వరకు
1 నుంది 4 వ శతాబ్దం వరకు చోళరాజులు పాలించారు. కరికాల చోళుడు వారిలో ప్రసిద్ధుడు. ఆ కాలంలోనే కావేరి నదిపై ఆనకట్ట కట్టారు (కల్లనాయి). ఇది అప్పటి సాంకేతికత ప్రజ్ఙకు చిహ్నము.
4వ శతాబ్దం తరువాత 400 సంవత్సరాలు దక్షిణాపధమంతా పల్లవుల అధీనంలో ఉంది. మహేంద్ర వర్మ, నరసింహ వర్మ వీరిలో ప్రసిద్ధులు. ఇది దక్షిణాపథంలో శిల్పానికి స్వర్ణయుగం.
[మార్చు] 9వ శతాబ్దము నుండి 13వ శతాబ్దము వరకు
మరల 9వ శతాబ్దంలో రాజరాజచోళుని నాయకత్వంలోను, తరువాత అతని కుమారుడు రాజేంద్రచోళుని నాయకత్వంలోను చోళుల రాజ్యం బలంగా విస్తరించింది. చోళుల సామ్రాజ్యం ఒరిస్సా, బెంగాలు, బీహారుల వరకు విస్తరించింది. తూర్పు చాళుక్యులను, చేరరాజులను, పాండ్యరాజులను ఓడించారు. లంక, అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీపాలు, సుమత్రా, జావా, మలయా, పెగూ ద్వీపాలను చోళరాజులు తమ అధీనంలోకి తెచ్చుకొన్నారు. 13వ శతాబ్దం తరువాత చోళుల పాలన అస్తమించింది.
[మార్చు] 14వ శతాబ్దము
14వ శతాబ్దంలో మరల మొదలైన పాండ్యరాజుల పాలన ఉత్తరాదినుండి 'ఖిల్జీ' దండయాత్రలవలన త్వరలోనే అంతరించింది. తరువాత దక్కన్ ప్రాంతంలో బహమనీ సుల్తానుల రాజ్యం వేళ్ళూనుకుంది. తదనంతరం హంపి కేంద్రంగా విజయనగర సామ్రాజ్యం దక్షిణాపధమంతా నడచింది. వారు (నాయకర్, నాయగన్) నాయకుల సహాయంతో ఏలిక సాగించరు. 1564లో తళ్ళికోట యద్ధంతో విజయనగరసామ్రాజ్యం అంతరించింది. తమిళనాట చాలా ప్రాంతాలు స్వతంత్ర నాయకుల అధీనంలో చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నాయి. మదురై, తంజావూరు నాయకులు గొప్ప ఆలయాలు నిర్మింపజేశారు.
[మార్చు] 17వ శతాబ్దము
ఇక ఐరోపా వారి యుగం ఆరంభమైంది. 1609లో డచ్చివారు పులికాట్ వద్ద ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. 1639లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ వారు మద్రాసులో స్థావరం నెలకొలిపారు. స్థానిక నాయకుల మధ్య తగవులు బ్రిటిష్ వారి విస్తరణకు మంచి అవకాశమిచ్చాయి. 1760లో ఫ్రెంచివారిని 'వందవాసి'(Wandywash war) యుద్ధంలోను, డచ్చివారిని 'తరంగంబడి' యుద్ధంలోను, తరువాత టిప్పు సుల్తానును మైసూరు యుద్ధంలోను ఓడించి, బ్రిటిష్ వారు దక్షిణభారతదేశంలో ఎదురులేని ఆధిపత్యాన్ని సాదించుకొన్నారు. అప్పటినుండి మద్రాసు ప్రెసిడెన్సీ రూపు దిద్దుకుంది.
వీరపాండ్య కట్టబొమ్మన, మారుతుస్, పులితేవన్ వంటి కొందరు పాలెగాళ్లు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీనెదిరించి వీరోచితంగా పోరాడారు గాని ప్రయోజనం లేకపోయింది.
[మార్చు] 20వ శతాబ్దము
బ్రిటిష్ రాజ్యం కాలంలో విశాలమైన మద్రాసు ప్రెసిడెన్సీలో ఇప్పటి తమిళనాడుతోబాటు ఆంధ్ర, కర్ణాటక, కేరళలలోని కొన్నిభాగాలు కలసి ఉండేవి. 1947 లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అదే మద్రాసు రాష్ట్రమైనది. భాషా ప్రాతిపదికన 1953లో తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంగా విభజించారు. బళ్ళారి ప్రాంతం మైసూరు రాష్ట్రంలో కలుపబడింది. 1956లో మద్రాసు రాష్ట్రంలోని పశ్చిమభాగాలు కొన్ని కేరళ, మైసూరు (ఇప్పటి కర్ణాటక) రాష్ట్రాలలో కలుపబడ్డాయి.
1968లో మద్రాసు రాష్ట్రానికి "తమిళనాడు" అని పేరు మార్చారు. తమిళ (ద్రవిడ) భాష, సంస్కృతి తమిళనాడు రాజకీయాలలో ఇప్పటికీ ప్రధానమైన అంశాలు.
[మార్చు] రాజకీయాలు
- లోక్ సభ నియోజక వర్గాలు : 39
- అసెంబ్లీ నియోజక వర్గాలు : 234
1967 నుండి ప్రాంతీయ పార్టీలు తమిళనాడు రాజకీయాలలో ప్రముఖస్థానాన్ని వహిస్తున్నాయి.
1916లో ఏర్పడిన దక్షిణ భారత సంక్షేమ సంఘం (South Indian Welfare Association) క్రమంగా 'జస్టిస్ పార్టీ' గా అవతరించింది. 1944లో ఇ.వి.రామస్వామి పెరియార్ నాయకత్వంలో ఇది 'ద్రవిడకజగం' పార్టీ అయ్యింది. ఇది రాజకీయ పార్టీ కాదు. స్వతంత్ర 'ద్రవిడనాడు' సాధన వారి లక్ష్యం. అప్పటి నాయకులు అన్నాదురై, పెరియార్ ల మధ్య విభేదాల కారణంగా ఈ పార్టీ రెండుగా చీలింది.
అన్నాదురై నాయకత్వంలో 'ద్రవిడ మున్నేట్ర కజగం' (డి.యమ్.కె, DMK)పార్టీ 1956లో ఎన్నికలలోకి దిగింది. 1960 దశకంలో జరిగిన హిందీ వ్యతిరేక ఆందోళన సమయంలో డి.యమ్.కె బలం పుంజుకుంది. 1967లో కాంగ్రసును చిత్తుగా ఓడించి అధికారం కైవసం చేసుకుంది. 1969లో అన్నాదురై మరణించడంతో కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యాడు.
కరుణానిధి నాయకత్వంతో విభేదించిన సినీ నటుడు ఎమ్.జి.రామచంద్రన్ ( ఎమ్.జి.ఆర్, MGR) 972లో పార్టీనుండి విడిపోయి 'అఖిల భారత ద్రవిడ మున్నేట్ర కజగం' (AIADMK) స్థాపించాడు. 1977 నుండి 1987 వరకు ఎమ్.జి.ఆర్. ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 1987లో ఎమ్.జి.ఆర్. మరణానంతరం పార్టీలో సంక్షోభం ఏర్పడింది. కాని ఎమ్.జి.ఆర్. భార్య జానకి రామచంద్రన్ నాయకత్వంలోని భాగం నిలబడలేకపోయింది. జయలలిత నాయకత్వంలో ఎ.ఐ.డి.ఎమ్.కె. స్థిరపడింది.
మొత్తంమీద 1967 నుండి డి.ఎమ్.కె, ఎ.ఐ.డి.ఎమ్.కె. ఈ రెంటిలో ఏదో ఒక పార్టీ అధికారంలో ఉంటున్నది.
ఐనా తమిళనాడులో కాంగ్రెసు, బి.జె.పి, కమ్యూనిస్టులు వంటి జాతీయ పార్టీలు, పి.ఎమ్.కె. వంటి ప్రాంతీయ పార్టీలు కూడా చెప్పుకోదగినంత ప్రాబల్యం కలిగి ఉన్నాయి. శ్రీ లంకలోని తమిళుల సమస్య కూడా తమిళనాడు రాజకీయాలపై గణనీయమైన ప్రభావం కలిగి ఉన్నది.
[మార్చు] సినిమాలు
బొంబాయి (బాలీవుడ్) తరువాత చెన్నై భారతదేశంలో సినిమారంగానికి ముఖ్యమైన నిలయం. సినిమా రంగానికి సంబంధించిన సదుపాయాలు ఎక్కువగా 'కోడంబాకం' ప్రాంతంలో ఉన్నందున తమిళనాడు సినిమా రంగాన్ని 'కోలీవుడ్' అని చమత్కరిస్తారు. ఒకప్పుడు నాలుగు దక్షిణ భారత భాషలకూ మద్రాసే ప్రధాన సినిమా పరిశ్రమ కేంద్రం. ఇప్పుడు తక్కిన రాష్ట్రాలలో చిత్ర పరిశ్రమ వృద్ధి చెందునందువల్ల 'చెన్నై' ప్రాముఖ్యత కాస్త పలచబడింది. అయినా తమిళ సినీ రంగం, తెలుగు సినీ రంగం కుడి ఎడమగా ఉంటూ వస్తున్నాయి.
ఇక తమిళనాడు రాజకీయాలలో సినిమా ప్రభావం ప్రపంచంలో మరక్కడా లేనంత ప్రబలం. దాదాపు సినీపరిశ్రమ, రాజకీయ రంగం కలగలిపి ఉంటున్నాయి.
[మార్చు] ఆర్ధిక వ్యవస్థ
భారత దేశం ఆర్ధిక వ్యవస్థలో తమిళనాడు మూడవ స్థానం ఆక్రమిస్తుంది. పారిశ్రామికంగానూ, వ్యాపార పరంగానూ తమిళనాడు బహుముఖంగా అభివృద్ధి చెందింది.
[మార్చు] వ్యవసాయం
[మార్చు] వస్త్ర పరిశ్రమ
వస్త్రాలకు సంబంధించిన వ్వసాయోత్పత్తులు, యంత్రాలు, ముడి సరకులు, వస్త్రాల కర్మాగారాలు, చేనేత కార్మికులు కూడా తమిళనాడు ఆర్ధికరంగంలో ముఖ్యమైన వనరులు. ఒక్క తిరుపూర్ పట్టణం నుండే 2004లో 5వేల కోట్ల విలువైన వస్త్రాలు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఇక్కడ 7,000 దుస్తుల పరిశ్రమలు 10 లక్షల కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది.
[మార్చు] ఉత్పత్తి పరిశ్రమలు
చెన్నై చుట్టుప్రక్కల ఇంజినీరింగ్ ఉత్పత్తుల పరిశ్రమలు ఇతోధికంగా ఉన్నాయి. ఫోర్ద్, హ్యుండై, మిత్సుబిషి కారు ఫ్యాక్టరీలు, ఎమ్.ఆర్.ఎఫ్, టి.ఐ.సైకిల్స్, అశోక్ లేలాండ్, కల్పక్కం అణు విద్యుత్ కర్మాగారము, నైవేలి లిగ్నైట్ పరిశ్రమ, సేలం స్టీల్స్, మద్రాస్ సిమెంట్, టైటాన్ వాచెస్, తమిళనాడు పేపర్ & పల్ప్, తోలు పరిశ్రమలు - ఇవి కొన్ని ముఖ్యమైన పరిశ్రమలు.
శివకాశి పట్టణం ముద్రణ, బాణసంచా, అగ్గిపెట్టెలు పరిశ్రమలకు భారతదేశంలో అగ్రగామి.
[మార్చు] సమాచార సాంకేతిక మరియు సాఫ్ట్వేర్ రంగములు

బెంగళూరు తరువాత చెన్నై రెండవ సాఫ్ట్వేర్ కేంద్రము.
[మార్చు] ఈ-పరిపాలన
ప్రభుత్వసేవలను కంప్యూటరీకరంచడంలో తమిళనాడు అగ్రగామి.
[మార్చు] సామాజిక అభివృద్ధి
ఇంకా చెన్నై వైద్య, పరిశోధన, విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నది. ముఖ్యంగా ప్రాధమిక విద్యకు ప్రభుత్వధనం బాగా వినియోగింపబడుతూ ఉన్నది. 'బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం' అనే పధకం తమిళనాడులోనే ప్రారంభమైంది.
ఇక సామాజిక అంశాలలో వెనుకబాటు తనం కూడా కొన్ని విషయాలలో కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. వాఠిలో ఒకటి - కొన్ని ప్రాంతాలలో - ఆడ శిశువులను చంపివేయడం.
[మార్చు] జిల్లాలు
తమిళనాడు రాష్ట్రములో 30 జిల్లాలు ఉన్నాయి. ధర్మపురి జిల్లాను రెండుగా విభజించి క్రిష్ణగిరి ముఖ్యపట్టణముగా క్రిష్ణగిరి జిల్లా, 30వ జిల్లాగా యేర్పడినది.
రాష్ట్రము. | కోడ్ | జిల్లా | ముఖ్య పట్టణము | జనాభా (2001) | విస్తీర్ణము (కి.మీ.²) | జన సాంద్రత (/కి.మీ.²) |
---|---|---|---|---|---|---|
TN | AR | అరియలూర్ | అరియలూర్ | 694058 | 1939 | 358 |
TN | CH | చెన్నై | చెన్నై | 4216268 | 174 | 24231 |
TN | CO | కొయంబత్తూర్ | కొయంబత్తూర్ | 4224107 | 7469 | 566 |
TN | CU | కుద్దలూర్ | కుద్దలూర్ | 2280530 | 3999 | 570 |
TN | DH | ధర్మపురి | ధర్మపురి | 2833252 | 9622 | 294 |
TN | DI | దిండిగుల్ | దిండిగుల్ | 1918960 | 6058 | 317 |
TN | ER | ఈరోడ్ | ఈరోడ్ | 2574067 | 8209 | 314 |
TN | KC | కాంచీపురం | కాంచీపురం | 2869920 | 4433 | 647 |
TN | KK | కన్యాకుమారి | నగర్‌కోయిల్ | 1669763 | 1685 | 991 |
TN | KR | కరూర్ | కరూర్ | 933791 | 2896 | 322 |
TN | MA | మదురై | మదురై | 2562279 | 3676 | 697 |
TN | NG | నాగపట్టినం | నాగపట్టినం | 1487055 | 2716 | 548 |
TN | NI | నీలిగిరి | ఉదగమండలం | 764826 | 2549 | 300 |
TN | NM | నమక్కల్ | నమక్కల్ | 1495661 | 3429 | 436 |
TN | PE | పెరంబలూర్ | పెరంబలూర్ | 486971 | 1752 | 278 |
TN | PU | పుదుక్కొట్టై | పుదుక్కొట్టై | 1452269 | 4651 | 312 |
TN | RA | రామనాథపురం | రామనాథపురం | 1183321 | 4123 | 287 |
TN | SA | సలెం | సలెం | 2992754 | 5220 | 573 |
TN | SI | శివగంగ | శివగంగ | 1150753 | 4086 | 282 |
TN | TC | తిరుచిరప్పల్లి | తిరుచిరప్పల్లి | 2388831 | 4407 | 542 |
TN | TH | థేని | థేని | 1094724 | 3066 | 357 |
TN | TI | తిరునల్వేలి | తిరునల్వేలి | 2801194 | 6810 | 411 |
TN | TJ | తంజావూర్ | తంజావూర్ | 2205375 | 3397 | 649 |
TN | TK | తూతుకుడి | తూతుకుడి | 1565743 | 4621 | 339 |
TN | TL | తిరువల్లూర్ | తిరువల్లూర్ | 2738866 | 3424 | 800 |
TN | TR | తిరువరూర్ | తిరువరూర్ | 1165213 | 2161 | 539 |
TN | TV | తిరువన్నమలై | తిరువన్నమలై | 2181853 | 6191 | 352 |
TN | VE | వెల్లూర్ | వెల్లూర్ | 3482970 | 6077 | 573 |
TN | VL | విల్లుపురం | విల్లుపురం | 2943917 | 7217 | 408 |
TN | VR | విరుదునగర్ | విరుదునగర్ | 1751548 | 4288 | 408 |
[మార్చు] పండగలు
పొంగల్ (సంక్రాంతి) తమిళనాట ప్రధానమైన పండుగ. ఇంకా దీపావళి, విషు (తమిళ ఉగాది), దసరా, వినాయక చవితి కూడా జరుపుకుంటారు. అలాగే మహమ్మదీయ, క్రైస్తవ పండుగలు కూడా పెద్దయెత్తున జరుపబడతాయి. తమిళనాడులో ముఖ్యమైన కుంభాభిషేకం, తైపూసం, ఆడివెల్లి వంటి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.
వేలాంకిణి చర్చి, నాగూరు మసీదు లలో ఉత్సవాలలో అన్ని మతాలవారు పాలుపంచుకుంటారు.
[మార్చు] పర్యటన
తమిళనాడు పర్యాటకులను ఎన్నోవిదాలుగా ఆకర్షిస్తుంది. పురాతన ఆలయాలు, నింగినంటే గోపురాలు, ఆధునిక నగరాలు, పల్లెటూరి జీవన విధానం, సాగర తీరాలు, పార్కులు, అడవులు, వేసవి విడుదులు, పరిశ్రమలు, సినీ స్టూడియోలు, పట్టుచీరలు, బంగారం దుకాణాలు, ఆధునిక వైద్యశాలలు - ఇలా అన్ని విధాల పర్యాటకులకూ తమిళనాడు చూడదగింది.
[మార్చు] ముఖ్యమైన పర్యాటక స్థలాలు
- నగరాలు
- చెన్నై
- మదురై
- కోయంబత్తూరు
- సాగరతీరాలు
- మెరీనా బీచ్
- సిల్వర్ బీచ్
- కన్యాకుమారి
- మహాబలిపురం
- గుళ్ళు, గోపురాలు
- వేసవి విడుదులు
- ఊటీ
- కొడైకెనాలు
- వన్యస్థలాలు
- మదుమలై
- పిచ్చవరం
[మార్చు] అవీ, ఇవీ
- దేశంలో తమిళనాడుప్రాంతంలో మాత్రమే ఈశాన్య ఋతుపవనాలవల్ల అక్టోబరు - నవంబరు - డిసెంబరు మాసాలలో వర్షాలు పడతాయి.
- బంగాళా ఖాతంలోని అల్పపీడనాలవల్ల పడే వర్షాలు తమిళనాడు నీటివనరులలో ముఖ్యమైనది. కాని వాటివల్ల వచ్చే తుఫానులవల్ల నష్టాలకు కూడా తమిళనాడు తరచు గురి అవుతుంటుంది.
- 2004 డిసెంబరు 26 న వచ్చిన 'సునామీ' ఉప్పెనకు తమిళనాట తీరప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి.
- కావేరీ నది జలాల వినియోగం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య చిరకాలంగా ఉన్న వివాదం. రెండు రాష్ట్రాల వ్యవసాయానికీ ఈ నీరు చాలా అవుసరం.
- చెన్నైలోని 'మెరీనా బీచ్' ప్రపంచంలో రెండవ పొడవైన బీచ్. కడలూరులోని 'సిల్వర్ బీచ్' మెరీనా బీచ్ తరువాత పొడవైనది.
- ఒకప్పుడు, తెలుగు సినీ పరిశ్రమ పూర్తిగా మద్రాసులో ఉన్నపుడు, మద్రాసు వెళ్ళిన తెలుగు వారికి ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ ల ఇళ్ళు చూడడం టూర్ లో చాలా ముఖ్యమైన భాగంగా ఉండేది.
[మార్చు] బయటి లింకులు
- తమిళనాడు శాసనసభ ఎన్నికలు 2006
- తమిళనాడు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైటు
- తమిళనాడు పటాలు
- తమిళనాడు పర్యాటక శాఖా వెబ్ సైటు
- తమిళనాడులో మానవాభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి నివేదిక
- టిడ్కో - తమిళనాడు ప్రభుత్వ ఆర్ధిక వీక్షణం
- తమిళనాడు విశేషాలు
- ఒక తమిళనాడు పోర్టల్
భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు | ![]() |
---|---|
ఆంధ్ర ప్రదేశ్ | అరుణాచల్ ప్రదేశ్ | అసోం | బీహార్ | ఛత్తీస్‌గఢ్ | గోవా | గుజరాత్ | హర్యానా | హిమాచల్ ప్రదేశ్ | జమ్మూ కాశ్మీరు | జార్ఖండ్ | కర్నాటక | కేరళ | మధ్య ప్రదేశ్ | మహారాష్ట్ర | మణిపూర్ | మేఘాలయ | మిజోరాం | నాగాలాండ్ | ఒరిస్సా | పంజాబ్ | రాజస్థాన్ | సిక్కిం | తమిళనాడు | త్రిపుర | ఉత్తరాంచల్ | ఉత్తర ప్రదేశ్ | పశ్చిమ బెంగాల్ | |
కేంద్రపాలిత ప్రాంతములు: అండమాన్ నికోబార్ దీవులు | చండీగఢ్ | దాద్రా నగరు హవేలీ | డామన్ డయ్యు | లక్షద్వీపములు | పుదుచ్చేరి | |
జాతీయ రాజధాని ప్రాంతము: ఢిల్లీ |