మోక్షగుండం విశ్వేశ్వరయ్య
వికీపీడియా నుండి
మోక్షగుండం విశ్వేశ్వరయ్య - MV - (1861 సెప్టెంబర్ 15 —1962 ఏప్రిల్ 12), భారతదేశపు ప్రముఖ ఇంజనీరు. బెంగుళూరు నగరానికి 40 మైళ్ళ దూరంలోని ముద్దెనహళ్ళి గ్రామంలో శ్రీనివాస శాస్త్రి, వెంకాయమ్మ దంపతులకు ఆయన జన్మించాడు. వీరి పూర్వీకులు ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మోక్షగుండం గ్రామానికి చెందిన వారు. మూడు శతాబ్దాల కిందట వారు మైసూరుకు వలస వెళ్ళారు. చిక్కబళ్ళాపూరు లో ప్రాధమిక విద్య, బెంగుళూరు లో ఉన్నతవిద్య పూర్తి చేసాడు. 1881లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బియ్యే, తరువాత పుణె సైన్సు కాలేజి నుండి సివిలు ఇంజనీరింగు ఉత్తీర్ణుడయ్యాడు.
ఆయన తండ్రి సంస్కృత పండితుడు, హిందూ ధర్మశాస్త్ర పారంగతుడే కాక ఆయుర్వేద వైద్యుడు కూడా. MV కి 15 ఏళ్ళ వయసులో తండ్రి కర్నూలులో మరణించాడు.
బొంబాయి ప్రజా పనుల శాఖలో చేరిన తరువాత, భారత నీటిపారుదల కమిషను చేరవలసినదిగా ఆహ్వానం వచ్చింది. ఆయన దక్కను ప్రాంతంలో చక్కని నీటిపారుదల వ్యవస్థను రూపొందించాడు. ఒక ఆటోమాటిక్ వరద గేట్ల వ్యవస్థను ఆయన రూపొందించాడు. 1903 లో మొదటిసారిగా దీనిని పుణె దగ్గరి ఖడక్‌వాస్లా వద్ద నెలకొల్పారు. వరద సమయంలో ఆనకట్ట భద్రతను దృష్టిలో ఉంచుకుంటూనే అత్యధిక నీటి నిల్వ చేసే విధానం ఇది. దీని తరువాత గ్వాలియర్ వద్ద అల తిగ్రా వద్ద, మైసూరు వద్ద గల కృష్ణరాజ సాగర్ ఆనకట్టలలోను దీనిని వాడారు. అప్పట్లో కృష్ణరాజ సాగర్ ఆనకట్ట భారతదేశంలోనే అతిపెద్దది.
హైదరాబాదు నగరాన్ని వరదల నుండి రక్షించడానికి ఒక వ్యవస్థను రూపొందించినపుడు, ఆయనకు గొప్ప పేరు వచ్చింది. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కూడా ఆయన పాత్ర ఉంది. 1908లో స్వఛ్చంద పదవీ విరమణ తరువాత, మైసూరు సంస్థానంలో దివాను గా చేరి సంస్థాన అభివృద్ధికి కృషి చేసాడు. 1917 లో బెంగుళూరు లో ప్రభుత్వ ఇంజనీరింగు కాలేజి స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించాడు. తరువాత ఈ కాలేజికి ఆయన పేరే పెట్టడం జరిగింది. ఈనాటికి కూడా యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కర్ణాటక లోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటి. మైసూరు విశ్వవిద్యాలయం నెలకొల్పటంలో కూడా ఆయన పాత్ర ఉంది.
మైసూరు దివానుగా ఉండగా ఆయనకు బ్రిటిషు ప్రభుత్వపు నైట్‌హుడ్ (సర్) బిరుదు వచ్చింది. 1955 లో భారత దేశపు అత్యంత గొప్ప పురస్కారం - భారతరత్న - వచ్చింది. కర్ణాటక లోని ఇంజనీరింగు కాలేజీలన్నీ అనుబంధంగా ఉండే సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఆయన పేరిట నెలకొల్పారు.
ఆయన జన్మశతి సంవత్సరంలొ బెంగుళూరు లో విశ్వేశ్వరయ్య పారిశ్రామిక, సాంకేతిక ప్రద్ర్శనశాల నెలకొల్పబడింది.