లోక్‌సభ
వికీపీడియా నుండి
భారత రాజకీయ వ్యవస్థ |
రాజ్యాంగం |
భారత దేశం |
శాసన వ్యవస్థ
|
కార్య నిర్వాహక వ్యవస్థ |
న్యాయ వ్యవస్థ
|
రాష్ట్రాలు |
ఎన్నికలు |
|
భారత పార్లమెంటు (సన్‌సద్) లో దిగువసభను లోక్‌సభ (Loksabha) అంటారు. లోక్‌సభ సభ్యులను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ప్రజల ప్రత్యక్ష ప్రాతినిధ్యం ఉండే సభ కనుక ఇది ప్రజల సభ (House of the People) అయింది. రాజ్యాంగం ప్రకారం లోక్‌సభలో గరిష్ఠంగా 552 మంది సభ్యులు ఉండవచ్చు. అందులో 530 మంది రాష్ట్రాల నుండి, 20 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నికైన సభ్యులు కాగా, మిగిలిన ఇద్దరు రాష్ట్రపతి చే నామినేట్ చెయ్యబడ్డ ఆంగ్లో ఇండియన్ సభ్యులు.
లోక్‌సభ సభ్యులను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలు (General Elections) అంటారు. వోటర్ల సంఖ్య రీత్యా, ఎన్నికల పరిమాణం రీత్యా భారత సార్వత్రిక ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత భారీ ఎన్నికలు.
విషయ సూచిక |
[మార్చు] కాల పరిమితి
లోక్‌సభ కాలపరిమితి ఐదేళ్ళు. ఎన్నికలు జరిగిన వెంటనే జరిగే మొదటి సమావేశం తేదీ నుండి 5 సంవత్సరాలకు ఆ లోక్‌సభ గడువు తీరిపోతుంది. అయితే ఆత్యయిక పరిస్థితి విధించిన సమయంలో ఈ పరిమితిని ఒక్కో సంవత్సరం చొప్పున పొడిగించుకుంటూ పోవచ్చు. అయితే, ఆత్యయిక పరిస్థ్తిని ఎత్తివేసిన తరువాత 6 నెలలకు మించి పొడిగించేందుకు వీలులేదు.
అయితే, సభను ఐదేళ్ళ కంటే ముందే రద్దు చేయ్యవచ్చు. లోక్‌సభకు ఎన్నిక కాదలచిన వ్యక్తికి 25 ఏళ్ళ వయసు నిండి ఉండాలి.
[మార్చు] చరిత్ర
1950 జనవరి 26 న రాజ్యాంగం అమలు లోకి వచ్చిన తరువాత, మొదటి సార్వత్రిక ఎన్నికలు 1951-52 లో జరిగాయి. మొదటి ఎన్నికైన లోక్‌సభ ఏప్రిల్, 1952 న అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి వివిధ లోక్‌సభల వివరాలు ఇలా ఉన్నాయి:
లోక్‌సభ | ఏర్పాటు | స్పీకరు |
---|---|---|
మొదటి లోక్‌సభ | ఏప్రిల్ 1952 | జి.వి.మావలాంకర్, ఎం.అనంతశయనం అయ్యంగార్ |
రెండవ లోక్‌సభ | ఏప్రిల్ 1957 | ఎం.అనంతశయనం అయ్యంగార్ |
మూడవ లోక్‌సభ | ఏప్రిల్ 1962 | సర్దార్ హుకం సింగ్ |
నాలుగవ లోక్‌సభ | మార్చి 1967 | నీలం సంజీవరెడ్డి, జి.ఎస్.ధిల్లాన్ |
ఐదవ లోక్‌సభ | మార్చి 1971 | జి.ఎస్.ధిల్లాన్, బలిరాం భగత్ |
ఆరవ లోక్‌సభ | మార్చి 1977 | కె.ఎస్.హెగ్డే |
ఏడవ లోక్‌సభ | జనవరి 1980 | బలరాం జాఖర్ |
ఎనిమిదవ లోక్‌సభ | డిసెంబర్ 1984 | బలరాం జాఖర్ |
తొమ్మిదవ లోక్‌సభ | డిసెంబర్ 1989 | రబీ రే |
పదవ లోక్‌సభ | జూన్ 1991 | శివరాజ్ పాటిల్ |
పదకొండవ లోక్‌సభ | మే 1996 | పి.ఎ.సంగ్మా |
పన్నెండవ లోక్‌సభ | మార్చి 1998 | గంటి మోహనచంద్ర బాలయోగి |
పదమూడవ లోక్‌సభ | అక్టోబర్ 1999 | గంటి మోహనచంద్ర బాలయోగి, మనోహర్ జోషి |
పదునాల్గవ లోక్‌సభ | మే 2004 | సోమనాథ్ చటర్జీ |
ఐదవ లోక్‌సభ సమయంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఆత్యయిక పరిస్థితి విధించి, సభ కాలపరిమితిని పొడిగించింది. లోక్‌సభ చరిత్రలో కాలపరిమితి పొడిగించబడిన సభ ఇదే.
[మార్చు] సభా నిర్వహణ
లోక్‌సభా నిర్వహణ బాధ్యత ను స్పీకర్ నిర్వహిస్తారు. సభ్యులు తమలో ఒకరిని స్పీకర్‌గా ఎన్నుకుంటారు. స్పీకర్‌కు సహాయంగా ఒక డిప్యూటీ స్పీకర్‌ను కూడా ఎనుకుంటారు. సార్వత్రిక ఎన్నికల తరువాత సభ్యుల ప్రమాణ స్వీకారంతో లోక్‌సభ ఏర్పాటు అవుతుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమ నిర్వహణకు ఒక తాత్కాలిక స్పీకరును సభులలో ఒకరిని ఎంచుకుంటారు. సాధారణంగా అనుభవజ్ఞుడైన సభ్యుని ఎంచుకోవడం రివాజు. తరువాత స్పీకరు ఎన్నిక జరుగుతుంది. ఆపై, సభా నిర్వహణ బాధ్యత పూర్తిగా స్పీకరుదే. సభానిర్వహణ కొరకు వివిధ నిబంధనలు ఏర్పాటయ్యాయి. సభ్యుల ప్రవర్తనను నిర్దేశిస్తూ ప్రవర్తనా నియమావళి ఉంది. వివిధ అంశాలకు సమయం కేటాయింపు కొరకు బిజినెస్ ఎడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది.
[మార్చు] సమావేశాలు
లోక్‌సభ సమావేశాలు సాధారణంగా ఉ.11 గంటల నుండి మ.1 వరకు, మళ్ళీ మ.2 నుండి 6 వరకు జరుగుతాయి. విషయ ప్రాముఖ్యతను బట్టి ఈ సమయాలు పొడిగించబడటం జరుగుతూ ఉంటుంది. కనీస సంఖ్యలో సభ్యులు ఉంటేనే సమావేశం మొదలవుతుంది. ఈ సంఖ్యను కోరం అంటారు. లోక్‌సభకు కోరం - స్పీకరుతో కలిపి 55. కొత్తగా ఎన్నికై, ఇంకా ప్రమాణస్వీకారం చెయ్యని సభ్యులు ఉంటే, వారి చేత ముందు ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఇటీవలి కాలంలో గతించిన ప్రస్తుత లేదా పూర్వపు సభ్యుల పట్ల సంతాప తీర్మానాలు ప్రవేశప్డతారు.
లోక్‌సభలో కింది ముఖ్యమైన వ్యాపకాలు చేపడతారు.
- ప్రశ్నోత్తరాలు: సభ్యుల ప్రశ్నలకు సంబంధిత మంత్రుల సమాధానాలు ఇస్తారు. ప్రశ్నల్లో మూడు రకాలు ఉంటాయి. అవి:
- నక్షత్ర గుర్తు గల ప్రశ్నలు. వీటికి మంత్రులు సభలో జవాబిస్తారు. వీటికి అనుబంధ ప్రశ్నలు కూడా అడగవచ్చు
- నక్షత్ర గుర్తు లేనీ ప్రశ్నలు: వీటికి రాతపూర్వక సమాధానాలు ఇస్తారు. వీటికి అనుబంధ ప్రశ్నలు ఉండవు.
- స్వల్ప అవధి ప్రశ్నలు: పై రెండు రకాల ప్రశ్నలకు జవాబిచ్చేందుకు కనీసం 10 రోజుల వ్యవధి ఉంటుంది. విషయ ప్రాముఖ్యతను బట్టి కొన్ని ప్రశ్నలకు మరింత త్వరగా సమాధాన్ని సభ్యులు ఆశించవచ్చు. వీటిని స్వల్ప అవధి ప్రశ్నలు అంటారు. స్పీకరు అనుమతితో ఇటువంటి ప్రశ్నలు అడగవచ్చు.
- ఇతరత్రా వ్యాపకాలు: ప్రశ్నోత్తరాల సమయం ముగిసాక, ఈ కార్యక్రమం చేపడతారు. వాయిదా తీర్మానాలు, హక్కుల తీర్మానాలు, అధికార పత్రాల సమర్పణ, రాజ్యసభ సందేశాలు, సభాసంఘాల నియామకాలు, నివేదికలు, రాష్ట్రపతి ఆమోదముద్ర పొందిన బిల్లుల వివరాలు మొదలైనవి ఇందులో ఉంటాయి.
- ప్రధాన వ్యాపకం: వివిధ రకాలైన బిల్లులు, సాధారణ బడ్జట్, రైల్వే బడ్జట్ వంటి ఆర్ధిక అంశాలు, ప్రభుత్వం గానీ, లేదా ప్రైవేటు సభ్యుడు గానీ ప్రవేశపెట్టే తీర్మానాలు ఈ సమయంలో చేపడతారు.
పై వ్యాపకాలు కాక, అరగంట చర్చలు, అత్యవసర ప్రజా ప్రాముఖ్య విషయాలు కూడా సభాకార్యక్రమాల్లో భాగం.