గుజరాత్
వికీపీడియా నుండి
గుజరాత్ | |
రాజధాని - Coordinates |
గాంధీనగర్ - |
పెద్ద నగరము | అహ్మదాబాదు |
జనాభా (2001) - జనసాంద్రత |
50,596,992 (10వ) - 258/చ.కి.మీ |
విస్తీర్ణము - జిల్లాలు |
196,024 చ.కి.మీ (7వ) - 25 |
సమయ ప్రాంతం | IST (UTC +5:30) |
అవతరణ - గవర్నరు - ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
1960-05-01 - నవల్ కిశోర్ శర్మ - నరేంద్ర మోడి - ఒకే సభ (182) |
అధికార బాష (లు) | గుజరాతీ, హిందీ |
పొడిపదం (ISO) | IN-GJ |
వెబ్‌సైటు: www.gujaratindia.com |
గుజరాత్ (ગુજરાત Gujarat) పశ్చిమ భారతదేశంలోని రాష్ట్రము. ఇది మహారాష్ట్ర తరువాత దేశంలో పారిశ్రామికీకరణలో రెండవ స్థానంలో ఉంది.
గుజరాత్ రాజధాని గాంధీనగర్. ఇది ప్లాను ప్రకారం నిర్మించిన నగరం. గుజరాత్‌లోని అతి పెద్ద నగరమైన అహమ్మదాబాదు దీనికి దగ్గరలోనే ఉన్నది.
1960 మే 1 న అప్పటి బొంబాయి రాష్ట్రంనుండి ప్రధానంగా గుజరాతీ భాష మాట్లాడే ప్రాంతాలను వేరుచేసి గుజరాత్ రాష్ట్రం ఏర్పాటు చేశారు. మిగిలిన బొంబాయి రాష్ట్రం మహారాష్ట్ర అయ్యింది.
భారతదేశంలో గుజరాత్ బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటి. 2002నాటికి (1992 ధరల ఆధారంగా) గుజరాత్ సగటు తలసరి ఆదాయం 7500 రూపాయలు. ఇది భారతదేశం మొత్తంమీద సగటు 6400 రూపాయలకంటే బాగా ఎక్కువ.
మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభభాయి పటేల్ - ఈ ఇద్దరు ప్రసిద్ధ జాతీయోద్యమ నాయకులు గుజరాత్‌కు చెందినవారు. పాకిస్తాన్ దేశానికి జాతిపితయైన మహమ్మద్ ఆలీ జిన్నా మాతృభాష గుజరాతీ. భారత రోదసీ కార్యక్రమానికి మూలపురుషునిగా భావించే విక్రమ్ శారాభాయి కూడా గుజరాతీయే. కాని గుజరాతీయులు ప్రధానంగా తమ వ్యాపార దక్షతకు దేశమంతటా, ఇతరదేశాల్లో కూడా పేరు సాధించారు.
విషయ సూచిక |
[మార్చు] పరిపాలనా విభాగాలు
వ.సం. | కోడ్ | జిల్లా | ముఖ్య పట్టణము | జనాభా (2001) | విస్తీర్ణము (కి.మీ.²) | జన సాంద్రత (/కి.మీ.²) |
---|---|---|---|---|---|---|
1 | AH | అహమ్మదాబాదు | అహమ్మదాబాదు | 5808378 | 8707 | 667 |
2 | AM | అమ్రేలి | అమ్రేలి | 1393295 | 6760 | 206 |
3 | AN | ఆనంద్ | ఆనంద్ | 1856712 | 2942 | 631 |
4 | BK | బనస్ కాంతా | మనస్ కాంతా | 2502843 | 12703 | 197 |
5 | BR | భారుచ్ | భారుచ్ | 1370104 | 6524 | 210 |
6 | BV | భావనగర్ | భావనగర్ | 2469264 | 11155 | 221 |
7 | DA | దాహొద్ | దాహొద్ | 1635374 | 3642 | 449 |
8 | DG | డాంగ్స్ | అహ్వా | 186712 | 1764 | 106 |
9 | GA | గాంధీనగర్ | గాంధీనగర్ | 1334731 | 649 | 2057 |
10 | JA | జామ్‌నగర్ | జామ్‌నగర్ | 1913685 | 14125 | 135 |
11 | JU | జునాగఢ్ | జునాగఢ్ | 2448427 | 8839 | 277 |
12 | KA | కచ్ | భుజ్ | 1526321 | 45652 | 33 |
13 | KH | ఖేడా | ఖేడా | 2023354 | 4215 | 480 |
14 | MA | మహెసనా | మహెసనా | 1837696 | 4386 | 419 |
15 | NR | నర్మద | రాజ్‌పిప్లా | 514083 | 2749 | 187 |
16 | NV | నవ్‌సారి | నవ్‌సారి | 1229250 | 2211 | 556 |
17 | PA | పటన్ | పటన్ | 1181941 | 5738 | 206 |
18 | PM | పంచ్‌మహల్స్ | పంచ్‌మహల్స్ | 2024883 | 5219 | 388 |
19 | PO | పోర్‌బందర్ | పోర్‌బందర్ | 536854 | 2294 | 234 |
20 | RA | రాజకోట్ | రాజకోట్ | 3157676 | 11203 | 282 |
21 | SK | సబర్ కాంతా | సబర్ కాంతా | 2083416 | 7390 | 282 |
22 | SN | సురేంద్రనగర్ | సురేంద్రనగర్ | 1515147 | 10489 | 144 |
23 | ST | సూరత్ | సూరత్ | 4996391 | 7657 | 653 |
24 | VD | వదోదరా | వదోదరా | 3639775 | 7794 | 467 |
25 | VL | వల్సాడ్ | వల్సాడ్ | 1410680 | 3034 | 465 |
[మార్చు] భౌగోళికము
గుజరాత్‌కు వాయువ్యదిశలో పాకిస్తాన్ దేశం ఉన్నది. ఉత్తరాన రాజస్థాన్, దక్షిణాన మహారాష్ట్ర, తూర్పున మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. పశ్చిమాన అరేబియా సముద్రం ఉన్నది. భూభాగం పల్లపు ప్రాంతము. వాతావరణం ఎక్కువ పొడిగా ఉంటుంది. వాయువ్యాన దాదాపు ఎడారి వాతావరణం ఉంటుంది.
గుజరాత్ తీర రేఖ 1600 కి.మీ. పొడవైనది. ఆన్ని రాష్ట్రాలకంటే ఇది ఎక్కువ. మొత్తం భారతదేశంలో మూడవవంతు తీరం గుజరాత్‌లోనే ఉన్నది. కచ్ సింధుశాఖ (Gulf of Kutch), కాంబే సింధుశాఖ (Gulf of Cambay) ఈ తీరంలో భాగాలే.
[మార్చు] నగరములు
అహమ్మదాబాదు, వదోదర (బరోడా), సూరత్, రాజకోట్ - ఇవి గుజరాత్‌లో ముఖ్యమైన నగరాలు. అహమ్మదాబాదు భారతదేశంలో ఆరవ పెద్ద నగరం.
ఇంకా నాదియాడ్, జామ్‌నగర్, అంక్లేశ్వర్, భారుచ్, నవసారి, వాపి, వల్సాడ్, భుజ్, ద్వారక కూడా గుజరాత్‌లోని నగరాలు.
[మార్చు] ప్రకృతిసిద్ధ ప్రదేశాలు
గుజరాత్‌లో పలు జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని
- గిర్ నేషనల్ పార్కు, గిర్‌నగర్ - జునాగఢ్ వద్ద. నల్లని జూలుతో ఉండే ఆసియా జాతి సింహాలకు ఇదొక్కటే మిగిలిన స్థావరము.
- వెలవదర్ నేషనల్ పార్కు, భావనగర్ జిల్లా
- వండ్సా నేషనల్ పార్కు, బుల్సర్ జిల్లా
ఇంకా అంజల్, బలరాం-అంబాజీ, బార్దా, జంబూఘోడా, జెస్సోర్, కచ్ ఎడారి, ఖావ్‌డా, నల్ సరోవర్, నారాయణ్ సరోవర్, పనియా, పూర్నా, రామ్‌పురా, రతన్‌మహల్, స్కూల్‌పనేశ్వర్ లలో వన్యమృగ సంరక్షణాస్థలాలున్నాయి.
[మార్చు] చరిత్ర
[మార్చు] స్వాతంత్ర్యమునకు ముందు చరిత్ర
ప్రస్తుతం 'గుజరాత్' అనబడే ప్రాంతంలో హరప్పా నాగరికత కాలంనాటి అవశేషాలు బయటపడటం వల్ల ఇది పురాతనమైన సంస్కృతికి కేంద్రమనవచ్చును. వ్యాపారానికి అనువైన తీరప్రాంతము ఉన్నందున మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం రాజ్యాలకాలంనుండీ ఇది వర్తక కేంద్రముగా విలసిల్లింది. ముఖ్యంగా భారుచ్ మంచి నౌకావర్తకకేంద్రం. గుజ్జరుల భూమి గనుక ఇది పూర్వకాలంలో గుజ్జరత్తము అనబడేది. గుజ్జరులు అనే జాతి క్రీ.శ.5వ శతాబ్దంలో వలస వచ్చారని చరిత్రకారులు భావిస్తున్నారు.
గుప్తుల సామ్రాజ్యం పతనమైన తరువాత మైత్రిక వంశము రాజులు గుజరాత్‌ను 6నుండి 8వ శతాబ్దము వరకు పాలించారు. వారి రాజధాని "వల్లభ". మధ్యలో 7వ శతాబ్దంలో కొద్దికాలం హర్షవర్ధనుడు గుజరాత్ ప్రాంతాన్ని పాలించాడు. 770లో సింద్ ప్రాంతంనుండి దండెత్తిన అరబ్‌రాజులు మైత్రిక వంశాన్ని జయించారు. ప్రతీహార రాజులు 8వ శతాబ్దం తరువాత కొంతకాలం పాలించారు.
775లో ఇరాన్‌నుండి పార్సీ (జోరాస్ట్రియన్) శరణార్ధులు గుజరాత్ ప్రాంతానికి వలస వచ్చారు.
960 నుండి 1243 వరకు సోలంకి వంశానికి చెందిన రాజపుత్రులు "అహిల్వారా" (పటన్)" రాజధానిగా పాలించారు. క్రీ.శ. 1000 నాటికి అది లక్ష జనాభా కలిగిన పెద్ద నగరం. 1243లో సోలంకిలనుండి వారి "ధోల్కా" ప్రాంతపు ప్రతినిధులైన వఘేలా వంశస్తులు అధికారం కైవసం చేసుకున్నారు. 1292లో దక్కన్ దేవగిరి యాదవ రాజులకు వఘేలాలు సామంతులైనారు.
1297-98లో ఢిల్లీ సుల్తాన్ అల్లా-ఉద్-దీన్ అహిల్వారాను నాశనంచేసి గుజరాత్‌ను తమ అధికారంలోకి తెచ్చుకొన్నాడు. 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానులు బలహీనపడినపుడు వారి గుజరాత్ గవర్నరు జఫర్ ఖాన్ ముజఫర్ స్వతంత్ర రాజయ్యాడు. అతని కొడుకు అహమ్మద్ షా 1411-1442 కాలంలో రాజ్యమేలాడు. అతని రాజధాని అహమ్మదాబాదు అప్పటినుండి ప్రధాన నగరంగా అభివృద్ధి చెందింది.
1576లో అక్బరు చక్రవర్తి గుజరాత్‌ను జయించి ముఘల్ సామ్రాజ్యంలో కలుపుకొన్నాడు. 18వ శతాబ్దంలో మరాఠాలు గుజరాత్‌ను జయించారు.
[మార్చు] బ్రిటీషు పాలనలో
ముందుగా పోర్చుగీసు వర్తకులు గుజరాత్ ప్రాంతానికి వచ్చి డామన్, డయ్యు, దాద్రా, నగర్ హవేలీ, మరికొన్ని స్థావరాలు ఏర్పరచుకొన్నారు. 1614లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీవారు సూరత్‌లో ఒక ఫాక్టరీ (గోడౌను) స్థాపొచారు. ఇది భారతదేశంలో వారి మొదటి స్థావరం. 1668లో పోర్చుగల్నుండి స్వాధీనంచేసుకొన్న బొంబాయి క్రమంగా బ్రిటిష్‌వారికి ముఖ్యకేంద్రమైంది. 2వ ఆంగ్ల-మరాఠా యుద్ధం తరువాత గుజరాత్ ఆంగ్లేయుల అధీనంలోకి వచ్చింది.
బరోడా (వదోదర) కు చెందిన గైక్వాడ్ మరాఠాలు, మరికొంతమంది స్థానిక పాలకులు ఆంగ్లేయులతో సంధి ఒప్పందాలు కుదుర్చుకొని, ఆంగ్లేయుల అనుమతితో తమ సంస్థానాలను (చిన్నరాజ్యాలను) తమతమ పాలనలో నిలుపుకొన్నారు. అలాకాని మిగిలిన గుజరాత్ ప్రాతం (కథియవార్, కచ్, అహమ్మదాబాదు, భారుచ్, కైరా, పంచమహల్స్, సూరత్ వంటి ప్రాంతాలు) 1818-1947 మధ్య బొంబాయి ప్రెసిడెన్సీలో భాగంగా నేరుగా ఆంగ్లఅధికారుల పాలనలో ఉన్నది.
[మార్చు] స్వాతంత్ర్యము తర్వాత
1947లో భారతదేశానికి స్వాతంతత్ర్యము రావడం, దేశవిభజన జరగడం అయ్యింది. గుజరాత్ రాజ సంస్థానాలను మూడు వర్గాలుగా విభజించారు. అవి సౌరాష్ట్ర (ఇందులో కథియవార్ ప్రాంతపు సంస్థానాలు ఉన్నాయి), కచ్,బొంబాయి రాష్ట్రం (ఇందులో బ్రిటిష్‌పాలనలో ఉన్న ప్రాంతము, బరోడా, తూర్పు గుజరాత్ సంస్థానాలు ఉన్నాయి). 1956లో కచ్, సౌరాష్ట్ర, కొంత హైదరాబాదు సంస్థాన ప్రాంతము, కొంత మధ్య ప్రదేశ్ ప్రాంతము కలిపి బొంబాయి రాష్ట్రాన్ని మరింత విస్తృతపరచారు. అందులో దక్షిణాన ప్రదానంగా మరాఠీ మాట్లాడే ప్రాంతాలు, ఉత్తరాన గుజరాతీ మాట్లాడే ప్రాంతాలు ఉన్నాయి. 1 మే 1960న భాషాపరంగా గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలను విభజించారు. గుజరాత్ అప్పటి రాజధాని అహమ్మదాబాదు. 1970లో గాంధీనగర్‌కు రాజధాని మార్చబడింది.
26 జనవరి 2001న గుజరాత్‌లో దారుణమైన భూకంపం సంభవించింది. ఇందులో 20,000 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20,000 మంది గాయపడ్డారు. భుజ్, పరిసర ప్రాంతాలు సంపూర్ణంగా నేలమట్టమయ్యాయి.
2002 రెండులో జరిగిన మతకలహాలు ఎన్నో ప్రాణాలను బలిగొన్నాయి. ఈ సంఘటన గుజరాత్ రాజకీయాలపైన, సమాజంపైన తీవ్రమైన ప్రభావం చూపింది.
[మార్చు] రాజకీయాలు
గుజరాత్ శాసన సభలో 182 మంది సభ్యులుంటారు. రాజకీయ పాలనా విధానం అన్ని రాష్ట్రాలవలెనే ఉంటుంది.
ముఖ్యమంత్రులు
- జీవరాజ్ నారాయణ్ మెహతా
- బలవంతరాయి మెహతా
- హితేందర్ కె. దేశాయి
- ఘనష్యామ్‌భాయి సి.ఓఝా
- చిమన్ భాయి జె పటేల్
- బాబు భాయి జె పటేల్
- మాధవ్ సింహ్ సోలంకీ
- అమర్ సింగ్ చౌదరి
- చబిల్‍దాస్ మెహతా)
- కేషూభాయి ఎస్.పటేల్
- సురేష్ చంద్ర ఆర్. మెహతా
- శంకర్ సింగ్ వాఘెలా
- దిలీప్ భాయి రమణ్ భాయి పరిఖ్
- నరేంద్ర మోడి
[మార్చు] ఆర్ధికవ్యవస్థ
గుజరాత్ భారతదేశపు అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ఒకటి. గుజరాత్ స్థూల సగటు తలసరి ఆదాయం భారతదేశపు సగటుకంటే బాగా ఎక్కువ. పత్తి, వేరుశనగ, ఖర్జూరాలు, చెఱకు, పెట్రోలు - ఇవి గుజరాత్ ఉత్పత్తులలో ముఖ్యమైనవి.
- ఖంబట్ సింధుశాఖలోని సూరత్ నగరం వజ్రాలవ్యాపారానికి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.
- ఇదే ప్రాంతంలో భావనగర్ సమీపంలో అలంగ్ షిప్ రిసైకిలింగ్ యార్డ్ ప్రపంచంలోని అతిపెద్దది.
- ఆనంద్‌లోని అమూల్ పాల ఉత్పత్తి సమాఖ్య ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థలలో ఒకటి. భారతదేశంలో పాల ఉత్పత్తికి గుజరాత్‌దే అగ్రస్థానం.
- ధీరూభాయి అంబానీ స్థాపించిన రెలియన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కూడా గుజరాత్‌కేంద్రంగా దేశమంతటా విస్తరిల్లింది.
[మార్చు] విద్యా సంస్థలు
గుజరాత్‌లోని ఇండియన్ ఇన్స్టిట్ట్యూట్ ఆఫ్ మేనేజిమెంటు (Indian Institute of Management)]] అహమ్మదాబాదులో ఉంది. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాలయం. ప్రపంచంలో ఆ తరహా విద్యా సంస్థలలో బాగా పేరు పొందినవాటిలో ఒకటి.
[మార్చు] ప్రజలు
గుజరాతీ ఇక్కడి ప్రధాన భాష.
ఎక్కువమంది స్థానికులు హిందువులు. ఇస్లాం, జైన, జోరాస్ట్రియన్, క్రైస్తవ మతస్తులు కూడా గణనీయంగా ఉన్నారు.
పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందినందున ఇతర రాష్ట్రాలనుండి, ముఖ్యంగా బీహారు,దక్షిణ భారతదేశంవగైరా ప్రాంతాలనుండి వచ్చి గుజరాత్‌లో పనిచేసే కార్మికుల సంఖ్య బాగా ఎక్కువ
[మార్చు] మత సామరస్యము
2002లో సంభవించిన హిందూ-ముస్లిం మతకలహాలు గుజరాత్ చరిత్రలో ఒక మచ్చగా పరిణమించాయి. 790మంది ముస్లిములు, 254 మంది హిందువులు ఈ కలహాల్లో మరణించారని, 223మంది జాడ కానరావడంలేదని ఒక నివేదిక పేర్కొన్నది. [1][2].
దాదాపు 2000మంది, అందునా అధికభాగం ముస్లిములు మరణించారని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ (Amnesty International) భావించింది. [3]. అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం ఈ విషయంలో బాగా వివాదాస్పదమైంది.
[మార్చు] పర్యటన
ముఖ్యమైన పర్యాటక స్థలాలు
- పాలిటానా
- డయ్యు
- కచ్
- జామ్‌నగర్
- జునాగఢ్
- రాజ్‌కోట్.
[మార్చు] మూలాలు
[మార్చు] బయటి లింకులు
- గుజరాత్ ప్రభుత్వం సైటు
- గుజరాత్ సైటు
- గుజరాత్ భూకంపం గురించి
- గుజరాత్ చరిత్ర
- ఇంకా గుజరాత్ చరిత్ర
- గుజరాత్ రచయిత హరిలాల్ ఉపాధ్యాయకు అంజలి
- గుజరాత్ వెబ్ డైరెక్టరీ
భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు | ![]() |
---|---|
ఆంధ్ర ప్రదేశ్ | అరుణాచల్ ప్రదేశ్ | అసోం | బీహార్ | ఛత్తీస్‌గఢ్ | గోవా | గుజరాత్ | హర్యానా | హిమాచల్ ప్రదేశ్ | జమ్మూ కాశ్మీరు | జార్ఖండ్ | కర్నాటక | కేరళ | మధ్య ప్రదేశ్ | మహారాష్ట్ర | మణిపూర్ | మేఘాలయ | మిజోరాం | నాగాలాండ్ | ఒరిస్సా | పంజాబ్ | రాజస్థాన్ | సిక్కిం | తమిళనాడు | త్రిపుర | ఉత్తరాంచల్ | ఉత్తర ప్రదేశ్ | పశ్చిమ బెంగాల్ | |
కేంద్రపాలిత ప్రాంతములు: అండమాన్ నికోబార్ దీవులు | చండీగఢ్ | దాద్రా నగరు హవేలీ | డామన్ డయ్యు | లక్షద్వీపములు | పుదుచ్చేరి | |
జాతీయ రాజధాని ప్రాంతము: ఢిల్లీ |